ఏపీ వెనకబాటుకు కారణమెవరు?
చంద్రబాబు నుంచి మోడీ దాకా అందరిదీ బాధ్యతే
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
అనలిస్టులు అందరూ అమ్ముడు పోలేదు. ఎవరో ఒకరిద్దరిని చూసి, అందరూ అలాగే ఉంటారనుకోవడం పొరపాటు. వేరే రాష్ట్రాల్లో ఉంటూ ఏపీకి ఏదో అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం ఏమిటి? చంద్రబాబు అంగీకరిస్తే అందరూ అంగీకరించినట్లేనా… ప్రజా జీవితంలో ఉండేవారు కేసుల్లో చిక్కుకుంటే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఓటుకు నోటు కేసు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా వారికి ముకుతాడు వేసి ఆడిస్తూనే ఉంటుంది. ఇప్పుడు బీజేపీ చేస్తున్న పని అదే. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో న్యాయం అన్న తరహాలో పాలన సాగుతోంది. పంజాబ్, తెలంగాణలలో ధాన్యం కొనుగోలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని కేంద్రం పోలవరానికి ఇచ్చింది. కానీ ఏమైంది. 62ఏళ్ళుగా పోలవరం నిర్మాణం సాగుతూనే ఉంది. మూడున్నర ఏళ్ళలో కాళేశ్వరం పూర్తయిపోయింది. ఖర్చు మీద అదుపు అధికారం ఉండడం దీనికి కారణం. పోలవరం కట్టాలంటే ఏపీ దగ్గర డబ్బుల్లేవు. వైయస్ఆర్ ప్రారంభించినప్పుడు ధనయజ్ఞం అంటూ విమర్శలు చేశారు. ఆయన తవ్విన కాల్వల నుంచే గ్రావిటీ ద్వారా నీరిస్తామని నవ్యాంధ్రలో కొలువుదీరిన తొలి టీడీపీ ప్రభుత్వం చెప్పింది. ప్రత్యేక హోదా వద్దు…ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ మాట మార్చింది. ఏపీకి ఇచ్చినన్ని నిధులు ఏ రాష్ట్రానికీ ఇవ్వలేదని బీజేపీ బీరాలు పలుకుతుంటుంది. ఇచ్చి ఉంటే ఆ నిధులన్నీ ఏమయ్యాయి. నిధులిచ్చి చేతులు దులుపుకోవడమేనా? ఎలా ఖర్చు చేశారనే అంశాన్ని విస్మరించడమేనా! అటు కేంద్రం కానీ, రాష్ట్రం కానీ ప్రజల బాగోగులు పట్టించుకోలేదు. ఓట్లు వేసే సమయం వచ్చేసరికి వారిపై ప్రేమ లీటర్ల కొద్దీ కారుతుంది. అవి చేస్తాం… ఇవి చేస్తాం అంటూ కబుర్లు చెబుతుంటారు.
మేధావుల ఫోరాలంటూ బయలుదేరి, యథాశక్తి ప్రజా ప్రయోజనాలను డ్యామేజి చేశారు. ప్రభుత్వానికి సహకరించడం మాని ఇబ్బందులు సృష్టించారు. మేధావులు కూడా పార్టీల పంచన చేరి, రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించారు. ప్రత్యేక హోదా కావాలని ఒక్క రోజయినా బంద్ చేశారా అంటూ తెలంగాణకు చెందిన ఓ బిజెపి అభిమాని ప్రైవేటు సంభాషణలో నన్ను ప్రశ్నించారు. ఒక అనలిస్టుగా బెంగళూరుకు చెందిన ఒక మహిళ బీజేపీకి అనుకూలంగా పెట్టిన పోస్టుపై నా వ్యాఖ్య చూసి, ఆయన నన్ను నిలదీశారు. అసలు ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందా? ఎంత సేపు పక్క రాష్ట్రం ఎక్కడ బాగుపడిపోతుందో, తమ రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే ఆలోచించారు తప్ప ఒక జాతీయ పార్టీ అభిమానిగా అన్ని రాష్ట్రాలూ అభివృద్ది చెందాలన్న కాంక్ష ఆ పార్టీకే లేదు.
మరొక అంశం ఏమిటంటే.. భారత్ అంటే రాష్ట్రాల సమాఖ్య, ఫెడరల్ వ్యవస్థ అనే అంశానికి ఎప్పుడో తిలోదకాలిచ్చేశారు. ఇందిర ప్రధానిగా ఉన్నప్పుడే ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అనే సూత్రాన్ని పాటించారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంటున్న పార్టీ దీన్నేమీ కొత్తగా వెలుగులోకి తేలేదు. ఎన్నికలు వస్తే ఒకలాగా లేకుంటే ఒకలాగ వ్యవహరిస్తూ వచ్చింది. 2014 ఎన్నికలలో ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని ఆ తదుపరి రాజకీయ పరిణామాలలో తుంగలో తొక్కింది. కాంగ్రెస్ అప్పట్లో అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీకి కచ్చితంగా స్పెషల్ స్టేటస్ వచ్చి ఉండేది. ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటుంది. కొత్తగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రమైనా… ఆ పరిస్థితి ఏపీకి వచ్చింది. రాజధాని కూడా లేకుండా ఏడేళ్ళుగా నెట్టుకొస్తున్న ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ వస్తే… తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా పరిశ్రమలు తరలివస్తాయనే భయంతోనే ఏపీకి అన్యాయం చేస్తున్నారు. ఏపీలో ఏటా ఇంచుమించు 3లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. ఉద్యోగాలు దొరక్క వారు దిక్కులు చూస్తున్నారనే విషయం దేశం మొత్తానికి తెలుసు. పరిస్థితి బాగో లేకపోతే చక్కదిద్దాల్సింది పోయి అనలిస్టుల పేరుతో తప్పొప్పులు ఎంచుతూ వేడుక చూస్తున్నారు. ఇంటికి పెద్ద అయిన తండ్రి సంతానంపై వివక్ష చూపితే ఏమవుతుంది. ఇప్పుడు ఏపీకి ఎదుర్కొంటున్న సమస్య ఇదే.
తప్పు అనలిస్టులదా! పార్టీలదా!!
Date: