శాపగ్రస్త గంధర్వుడు

Date:

ఘంట‌సాల‌పై మ‌హ్మ‌ద్ ర‌ఫీ వ్యాఖ్య ఇది
వారం వారంఘంట‌సాల స్మృతిప‌థం-4
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)

ghantasala karunasri
ghantasala karunasri


‘ఘంటసాల గారు ఉత్తర భారతదేశంలో (బాలివుడ్)లో పుట్టకపోవడం వృత్తి రీత్యా మా అదృష్టం. అంతటి మధురగళం లభించడం దక్షిణాది వారి…ముఖ్యంగా తెలుగు వారి అదృష్టం. ఏ గంధర్వుడో శాపవశాత్తు ఆయన రూపంలో పుట్టి ఉంటారు’…ప్రఖ్యాత గాయకుడు మహ్మద్ రఫీ ఒక సందర్భం లో ఒక పాత్రికేయుడితో చేసిన వ్యాఖ్య ఇది. హిందీ చిత్రపరిశ్రమలో అగ్రశ్రేణి గాయకుడిగా వెలుగొందుతూ అలా అనడంలో ఘంటసాల వారి గాత్రవైభవంతో పాటు తోటి గాయకుడి ఉన్నతిని గుర్తించి మన్నించిన రఫీ గారి సంస్కారం వెల్లడైంది.


‘మీరు ఉండగా తెలుగులో నేను పాడాలను కోవడం సాహసమే అవుతుంది. పాటలకు నేను న్యాయం చేయలేను. నన్నుక్షమించమని కోరుకుతున్నాను‘ అని ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయం చిత్రం ‘భలే తమ్ముడు’కు పాడడానికి మద్రాసు వచ్చినప్పుడు ముకుళిత హస్తాలతో విన్నవించుకున్నారు. వైవిధ్యం కోసం ఆ సినిమాకు గాయకుడిని మార్చాలని నిర్మాతలు నిర్ణయించినట్లు చెప్పుకునేవారు.
దర్శక, నిర్మాతల ఇష్టానిష్టాలను, గాయక కులాన్ని గౌరవించే ఘంటసాల వారు రఫీ మాటలకు కరిగిపోయారు. ‘మీరు అద్వితీయమైన గాయకులు. నేనూ మీ అభిమానినే. నిర్మాతలు వైవిధ్యం కోసం చేసే ప్రయత్నం విజయవంతం కావాలని కోరుతున్నాను. మీరు తప్పక పాడండి. సఫలీకృతులవుతారు’ అని అభినందనలు తెలిపారు. ఆ సినిమా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొనే నటుడు టీఎల్ కాంతారావు తమ ‘సప్తస్వరాలు’లో పాటను (హాయిగా పాడనా గీతం)పాడాలని కోరినప్పుడు రఫీ మృదువుగా తిరస్కరిం చారట. ‘మంచి కఠం ఘంటసాల ఉండగా, వైవిధ్యం పేరుతో తెలుగు భాష తెలియని మాలాంటి వారిని అడగడం సరికాదు. మీ భాష పాటకు ఆయనంత న్యాయం చేయలేను. ఎన్టీఆర్ తో ఉన్న అభిమానం కొద్దీ ఆ సినిమాకు పాడానంతే’అని స్పష్టం చేశారు. (ఘంటసాల దూరమైన తరువాత ఎన్టీఆర్ నాయకుడిగా నటించిన ‘ఆరాధన’కు రఫీ పాడారు).


గేలిచేసిన నోళ్ళే న‌మ‌స్క‌రించాయి
వ్యాసం ప్రారంభంలో పేర్కొన్నట్లు రఫీ వ్యాఖ్య కొందరు ఉత్తరాది వారి చెవి సోకలేదో లేక ఘంటసాల అంటే ఎవరో తెలియదో కానీ ఆయన వస్త్రధారణను బట్టి ప్రతిభను తక్కువగా అంచనా వేశారనేందుకు ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.‘జీవితచక్రం’ చిత్రం సంగీత దర్శకుడు శంకర్ కోరిక మేరకు పాటల రికార్డింగ్ కు ఘంటసాల బొంబాయి వెళ్లారు. సహజ, నిరాడంబర వస్త్రధారణతో (ఖద్డరు ధోవతి, చొక్కా) ఉండగా, అక్కడి కొందరు ‘ఫ్యాంట్, షర్టు కూడా వేసుకోకుండా చూడడానికి అలా ఉన్నాడు. ఆయనేం పాడతాడు. ఈయన తప్ప ఇంకెవరూ దొరకలేదా?’ అని వ్యాఖ్యానించారట. అవేమి పట్టించుకోని ఘంటసాల పాటల రిహార్సల్స్ లో గొంతు విప్పగానే స్పీకర్లలో ప్రకంపనలు (వైబ్రేషన్లు)వచ్చాయట. ఆ గాత్రం విన్న ఆ ‘వ్యాఖ్యా’తలు అబ్బురంతో ‘ఎంత గొప్ప కంఠం’ అని నమస్కరించారట.


సంస్కారానికి మారుపేరు
ఘంటసాల గారంటే రఫీకి ఎంత గౌరవం ఉందో రఫీ గారంటే ఘంటసాలకూ అంతే గౌరవం. పైగా సహ గాయకుడిని మన్నించే గుణం. అందుకు ఒక సంఘటనను ఉదహరించారు శ్రీమతి ఘంటసాల సావిత్రమ్మ, శ్యామల గార్లు. ‘సువర్ణ సుందరి’ హిందీలో పునర్నిర్మాణ సందర్బంలో లతామంగేష్కర్, రఫీ పాటలు పాడేందుకు మద్రాసు వచ్చారు. ‘హాయి హాయిగా ఆమని సాగే..’పాటకు సమాంతరం గీతం ‘కుహు కుహు బోలే కోయలయా…’ పాట అభ్యాస సమయంలో తెలుగు పాటలోని (ఘంటసాల గాత్రం) సోయగం రఫీ గాత్రంలో రావడం లేదని లతామంగేష్కర్‌కు అనిపించింది. అప్పుడే అటుగా వచ్చిన ఘంటసాలతో ’ ఈ పాటను ఒకసారి మీతో పాడాలని ఉంది. నా తృప్తి కోసం కాదనకండి’ అని ఆమె కోరారు. కానీ ఆయన ససేమిరా అన్నారు. ‘మీరు నా పట్ల గల అభిమానంతో అలా కోరినా రఫీ గారు పాడడానికి వచ్చినప్పుడు నేను గొంతు సవరించుకోవడం సమజసం కాదు. అలా చేయడం వారిని అవమానించడమే కాదు…నా అహంకారాన్ని చూపించినట్లవుతుంది. సాటి గాయకుడిని చిన్నబుచ్చలేను’ అని మృదువుగా తిరస్కరించారు. అదీ ఆయన సంస్కారం. తనకు తెలుగు భాష మీద పట్టులేదని రఫీ భావించినట్లే, తనకు హిందీ కూడా అంతేనన్నది ఘంటసాల ఉద్దేశం కావచ్చు. కానీ పాడాలనుకుంటే భాష విషయం పెద్ద అవరోధం కాకపోవచ్చు తోటి గాయకుడి పట్ల గౌరవం,సంస్కారం అది. (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Maharashtra: A battle between individuals

(Dr Pentapati Pullarao) Maharashtra is the second largest and richest...

Hurricane claims 50 lives in Florida

Washington: At least 50 people were killed, many injured,...

మన మౌనం ధర్మ వినాశనానికి దారివ్వకూడదు: పవన్ కళ్యాణ్

విజయవాడ, సెప్టెంబర్ 24 : తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన...

తిరుపతి లడ్డు వివాదం ..సమాధానం చెప్పవలసింది ఎవరు?

అపరిమిత అధికారాలిచ్చిన ఫలితం ఇది…(శివ రాచర్ల)సీఎం చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు....