విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

Date:

(వాడవల్లి శ్రీధర్)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే”
శుక్లాంబరధరం అంటే తెల్లని ఆకాశం. తెలుపు అనే ధావళ్యత సత్త్వగుణ ప్రతీక. ‘శుక్లాంబరధరం విష్ణుం’ అంటే సత్త్వగుణమైన ఆకాశాన్ని ధరించిన వాడని. శశివర్ణం అంటే చంద్రునివలె కాలస్వరూపుడని. అంటే లోక పాలకుడని. ‘చతుర్భుజం’ అంటే ధర్మార్ధకామమోక్షాలనే నాలుగు చేతులతో ప్రసన్నమైన శబ్ద బ్రహ్మ మై సృష్టిని పాలిస్తున్నది సకల గణాధిపతి అయిన వినాయకుడే అని పై శ్లోకంలో దాగున్న వినాయక తత్త్వం
గణపతిని తలచుకుంటే చాలు తలపెట్టిన ఏ కార్యక్రమమైనా నిరాటంకంగా సాగిపోతుంది. ఏటా భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితగా జరుపుకుంటాం. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా గణేశుని పూజిస్తారు. ఇక వీధులలో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకుంటారు. ఏ కార్యంలోనైనా తొలి పూజలందుకునే వినాయకుడు అంటే అందరికీ ఎంత భక్తిభావమో, తన భక్తులపై కూడా గణపతికి వల్లమాలిన అభిమానం. ఆయన రూపం, నామాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. విఘ్నాధిపతి రూపం విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం.
నాయకుడు
దేవుళ్లందరిలో… వినాయకుడు ప్రత్యేకమే కాదు , స్వతంత్ర ప్రతిపత్తిగల వాడు. నాయకత్వ లక్షణాలకు ఈయన ప్రతీక గణపతి అంటే గణానికి అధిపతి, అంటే దేవుళ్ల సమూహానికి ఆయన అధిపతి! నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు లక్ష్యాలను అందుకోవడం తేలికవుతుందని ఈ విధంగా ఆయన మనకు సందేశమిస్తున్నాడు. నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్లే.. లక్ష్యాలను సాధించడానికి అనేక దారుల్లో ప్రయత్నించగలుగుతారు. ఏ సమస్యకైనా పరిష్కారం చూపగలుగుతారు. ఇది మన దారిలో ఎదురొచ్చే కష్టాలను ఎదుర్కొని గమ్యం చేరుకోవడానికి ఉపయోగపడుతుంది వినాయకుడి విశిష్టత మనలో చాలామందికి వినాయకుడు అంటే ఒక దేవుడు అని శివపార్వతుల కొడుకని మాత్రమే తెలుసు కాని ”వినాయకుడు ” అనే పదానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏమిటంటే ” నాయకుడు లేనివాడు” అని. అంటే తనకు తనే నాయకుడు అని. ‘త్వమేవాహమ్’, ‘అహంబ్రహ్మాస్మి’ అన్న భావమే అది. అందుకే మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా గణపతినే పూజ చేస్తారు పూజారులు. ఏ గణానికైనా అతడే ‘పతి’ జగత్తు. ఎందుకంటే అంతా ‘గణ’ మయమే కాబట్టి ! వివిధ గణ సమాహారమే ఈ విశ్వమని మనకు పురాణాలు చెబుతున్నాయి. ‘గ’ అనే అక్షరం నుంచే జగత్తు జనించింది. కరచరణాద్యనయన విన్యాసం మొదలుకుని.. శబ్దమైన భాష, భాషాత్మకమైన జగత్తు… అంతా ‘గ’ శబ్ద వాక్యం . దీన్ని సుగుణానికి సంకేతం అంటారు. ‘ణ’ కారం మనసుకు, మాటలకు అందని పరతత్త్వానికి గుర్తు. ఇది నిర్గుణ సంకేతమన్నమాట! సుగుణంగా, నిర్గుణంగా భాసించే ఈశుడే ‘గణేశుడు’. అతడే ‘గణపతి’. పదహారు రూపాలలో కొలువై ఉన్నాడని పెద్దలు చెబుతుంటారు.
వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకంటారు? ఆ విరిగిన దంతం ఎక్కడ పడిందంటే..
గజకర్ణుడు, లంబోదరుడు, వినాయకుడు, విఘ్ననాయకుడు, ధూమ్రకేతు, గణాధ్యక్షుడు, బాలచంద్రుడు, గజానన మొదలైన పేర్లతో పాటు, గణేశుడిని ఏకదంతుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ పేరుకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. అంతేకాదు వినాయకుడి దంతం పడిన ఒక ఆలయం కూడా ఉంది. హిందూ మతంలో ఏ పూజ తలపెట్టినా.. ఏ శుభకార్యము ప్రారంభించాలన్నా మొదట గణేశుడిని పూజిస్తారు. ఏదైనా మతపరమైన పని లేదా ఆరాధన ప్రారంభించే ముందు విఘ్నాలు ఏర్పడకుండా గణేశుడిని పూజిస్తారు. గణేశుడి ఆరాధన అత్యంత శ్రేష్ఠమైనదిగా పురాణ శాస్త్రాలలో పేర్కొనబడింది. వాస్తవానికి గజకర్ణుడు, లంబోదరుడు, వినాయకుడు, విఘ్ననాయకుడు, ధూమ్రకేతు, గణపతి. ఏకదంతుడు ఎలా అయ్యాడు?
పురాణాల ప్రకారం పరశురాముడికి గణేశుడికి మధ్య జరిగిన యుద్ధమే దీనికి కారణం. ఒకప్పుడు పరశురాముడు శివుడిని కలవడానికి వచ్చాడు. అప్పుడు అతను తలుపు బయట నిలబడి ఉన్న వినాయకుడిని చూసి తాను శివుడిని కలవాలనుకుంటున్నానని లోపలికి వెళ్లనివ్వమని అడిగాడు. అయితే గణపతి పరశురాముడిని లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో పరశురాముడికి కోపం వచ్చింది. తనను లోపలికి వెళ్లనివ్వకపోతే యుద్ధం చేయాల్సి ఉంటుందని గణేశునితో చెప్పాడు. తను గెలిస్తే శివుడిని కలవడానికి లోపలికి అనుమతించాలని చెప్పాడు. గణేశుడు యుద్ధ సవాలును స్వీకరించాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. యుద్ధ సమయంలో పరశురాముడు తన గొడ్డలితో గణేశుడిపై దాడి చేశాడు. ఈ గొడ్డలి కారణంగా గణపతి దంతాలలో ఒకటి విరిగి పడిపోయింది. అప్పటి నుండి గణపతి ఏక దంతుడు అయ్యాడు.
ఇతర పురాణ కథలు
ఇతర పురాణ కథనాల ప్రకారం గణేశుడి దంతం విరగడానికి కారణం పరశురాముడు కాదు అతని సోదరుడు కార్తికేయుడు. ఇద్దరు సోదరుల వ్యతిరేక స్వభావం కారణంగా శివ పార్వతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే గణేశుడు కార్తికేయుడిని చాలా ఇబ్బంది పెట్టాడు. అలాంటి ఒక పోరాటంలో కార్తికేయుడు గణేశుడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు గణపతిని కొట్టాడు. అప్పుడు దంతాలలో ఒకటి విరిగిపోయింది. అంతేకాదు మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని గణపతిని కోరినప్పుడు ఒక షరతు పెట్టాడని కూడా ఒక ప్రసిద్ధ కథనం. తాను మాట్లాడటం మాననని.. అంటే కంటిన్యూగా మాట్లాడతాడని అదే సమయంలో వ్యాసుడు చెప్పే మహాభారత కథను రాస్తానని చెప్పాడు. అప్పుడు గణపతి స్వయంగా తన దంతాలలో ఒకదానిని విరిచి పెన్నులా తయారు చేశాడు.
ఎక్కడ వినాయకుడి దంతాలు పడిపోయాయంటే….
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సూర్ గ్రామంలోని ధోల్కల్ కొండలపై వందల సంవత్సరాల పురాతనమైన గణేష్ విగ్రహం సుమారు 3వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇది మొత్తం ప్రపంచంలోని అరుదైన విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇతడిని దంతెవాడ రక్షకుడిగా కూడా పిలుస్తారు. యుద్ధంలో విరిగిపడ్డ పన్ను దంతేవాడ జిల్లాలో కైలాస గుహలో ఉంది. ఇదే కైలాస ప్రాంతమని, వినాయకుడికి, పరశురాముడికి మధ్య భీకర యుద్ధం జరిగిందని చెబుతారు. ఈ యుద్ధంలో గణపతి దంతం ఒకటి విరిగి ఇక్కడ పడింది. అందుకే కొండ శిఖరం క్రింద ఉన్న గ్రామానికి ఫరస్పాల్ అని పేరు పెట్టారు.
గణపయ్య అంటే పిల్లలకు చాలా ఇష్టం :
ఆయనకు రోజు పూజలు చేయడమే కాదు.. ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి. గణపతి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. మనం కూడా అలాగే తయారవ్వాలి. అందుకే.. పిల్లలూ ఒకసారి వినాయకుడిని తీక్షణంగా చూడండి. ఆయన్నుంచి మనం అందుకోవాల్సిన ఆదర్శవంతమైన గుణగణాలు కానుకగా ఇస్తాడు. అవన్నీ విజయానికి మంత్రాలే! శివుడు ఓసారి వినాయకుడిని, అతని తమ్ముడు కుమారస్వామిని మూడుసార్లు ప్రపంచాన్ని చుట్టి రమ్మంటాడు. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద ప్రయాణం మొదలుపెడతాడు. వినాయకుడిదేమో ఎలుక వాహనం. అది వేగంగా పోలేదు కదా! కొద్దిసేపు ఆలోచించి…. వెంటనే తన తల్లిదండ్రుల చుట్టూ తిరగడం మొదలుపెడతాడు. ఎందుకు అలా చేశాడో తెలుసా? ఎందుకంటే అతని దృష్టిలో తల్లిదండ్రులంటే ప్రపంచం. వాళ్లంటే ఆయనకు భక్తి, ప్రేమ, గౌరవం. సంక్షోభ సమయంలో కొత్తగా ఎలా ఆలోచించాలో.. ఈ సంఘటనలో మనకు చెప్తాడు వినాయకుడు. సమస్య దగ్గరే ఆగిపోకుండా వెంటనే దానికి పరిష్కారం కనుక్కొన్నాడు. ఇన్నోవేటివ్ గా ఉండాలని ఆయన పరోక్షంగా చెప్తున్నాడు. అంతేకాదు… మనలో ఎవరూ దేవుడ్ని చూడలేదు. కానీ, తల్లిదండ్రులే దేవుడికి ప్రతిరూపాలు. వాళ్లు మనల్ని ప్రేమిస్తారు. మనకోసం ఆరాటపడతారు. కానీ, మనం వాళ్లను నిర్లక్ష్యం చేస్తాం. తల్లిదండ్రులను ప్రేమించండి, గౌరవించండనే సందేశాన్ని వినాయకుడు మనకిస్తున్నాడు. కాబట్టి, వినయంగా ఉంటూ జ్ఞానాన్ని పెంచుకోవాలి.
పెద్ద చెవులు
ఎప్పటికైనా మంచి శ్రోతే.. గొప్ప జ్ఞాన సంపన్నుడు కాగలడు. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్నా… ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలన్నా.. ముందు మంచి శ్రోతగా మారాలి. వినాయకుడి పెద్ద చెవులు అదే చెప్తున్నాయి. ఎవరు ఏం చెప్పినా ముందు వినాలి. అది మన దగ్గరున్న సమాచారాన్ని విశ్లేషించుకోవడానికి.. మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
తొండం
వినాయకుడి తొండం ఎటంటే అటు వంగుతుంది. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకోవాలి. అ విధంగా మనల్ని మనం మలుచుకోవాలని ఇది మనకు నేర్పిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా మారినవాళ్లనే విజయం వరిస్తుంది.
చిన్న కళ్లు
చేస్తున్న పనిపైనే ఫోకస్ పెట్టాలి. అవసరం లేని విషయాల గురించి బాధపడకూడదు. ఈ విషయాన్ని చిన్నగా ఉండే వినాయకుడి కళ్లు చెప్తున్నాయి. వినాయకుడి కళ్లు ఏకాగ్రతకు చిహ్నం. పెద్దగా ఆలోచించాలని, పెద్ద కలలు ఉండాలని వినాయకుడి పెద్ద తల చెప్తుంది. ఏం తిన్నా జీర్ణం చేసుకోవాలి. మంచి, చెడుని కూడా జీర్ణం చేసుకోవాలని వినాయకుడి పెద్ద పొట్ట సూచిస్తుంది. తక్కువగా మాట్లాడమని వినాయకుడి చిన్న నోరు చెప్తుంది. కష్టపడి పని చేస్తే లభించే ఫలితాలు లడ్డూలు, ఆయన ముందు ఉండే ప్రసాదం.. సంతోషాన్ని, ఆహారాన్ని అందరం పంచుకోవాలని చెప్తుంది. ఇక పెద్ద శరీరం ఉండే వినాయకుడు చిన్న ఎలుకపై ప్రయాణిస్తాడు. ఇది చిన్న ప్రాణి పట్ల కూడా గౌరవభావంతో ఉండాలని సూచిస్తుంది.
వినాయకుడి వాహనం మూషికం అంటారు.. కానీ ఎలుకతో పాటు సింహం, నెమలి, పాము కూడా ఆయనకు వాహనాలే. మత్సాసుర సంహారం కోసం వక్రతుండ అవతారం దాల్చి సింహాన్ని వాహనంగా చేసుకున్నాడు. కామాసురుని సంహరించడానికి వికటవినాయక అవతారం ఎత్తినప్పుడు నెమలి వాహనం అయింది. నెమలి కామానికి, గర్వానికి, అహంకారానికి ప్రతీక. అయితే, ప్రచారంలో ఉన్నది ఎలుక మాత్రమే. దీనికి అఖుడని పేరు. క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ఇది ప్రతీక. తమోరజో గుణాల విధ్వంసకారక శక్తికి సంకేతం.మూషికుడనే రాక్షసుడు గణనాథుడితో యుద్ధం చేసి ఓడిపోయి, తనను వాహనంగా చేసుకొమ్మని వినాయకుడిని శరణు వేడుకున్నాడు. వినాయకుని తొండం ఓంకారానికి, ఏకదంతం పరబ్రహ్మకు, ఉదరం స్థిరత్వానికి, చేతుల్లోని పాశం రాగానికి, అంకుశం క్రోధానికి, అభయహస్తం భక్తుల రక్షణకు, మణికహస్తంలోని మోదకం ఆనందానికి ప్రతీకలు.
ఇతరులలోని అవలక్షణాలను చూడరాదనే విషయాన్ని గణపతి నేత్రాలు తెలియజేస్తే, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని చెవులు తెలియజేస్తాయి. అన్ని విషయాలను కడుపులో దాచుకోవాలనే స్థిరత్వానికి సంకేతం తన ఉదరం ద్వారా వెల్లడిస్తే, ఇతరులు వేసే నిందలు, దుర్భాషలను పట్టించుకోరాదని సంకేతం ఆయన పాదాలు వివరిస్తాయి. స్వామి వాహనం ఎలుక. ఎంత చిన్నదో అంతవేగంగా ప్రయాణిస్తుంది.

స్వామి ఒక చేతిలో మోదకం యశస్సు లేదా కీర్తికి సూచన. ఒక చేతిలో పాశం చెడు మార్గంలో పయనించేవారిని దీనితో బంధించి తన మార్గంలోకి తెచ్చుకోవడానికి. గణపతిని ప్రార్థించేవారికి సిద్ధి కలిగి, బుద్ధి ప్రాప్తిస్తుంది. అందుకే సిద్ధి, బుద్ధి.. ఈయన భార్యలుగా చిత్రించబడ్డారు. నిజానికి వినాయకుడు బ్రహ్మచారి. అందుకే ఆయనను ఉపాసించాలి. ఇది సంసారికార్ధం. ఇక ఆధ్యాత్మిక అర్థం వేరుగా ఉంది. పై రెండింటిని సమన్వయం చేసి చూస్తే విఘ్నేశ్వరుడు దేవతలకే అధిపతి! ఎవరు గణేషుని సహస్ర నామాలతో విధిపూర్వకంగా అనుష్టిస్తారో వారికి అన్నీ శుభాలే.
గణపతికి ఎరుపు రంగు అత్యంత ప్రీతిపాత్రం. ఆయనకు ప్రియమైన నైవేద్యం మోదకం. ప్రయత్నం లేకుండానే మొలిచే గరికలు స్వామికి ప్రీతికరం. చవితి తిథి, మంగళ, శుక్రవారాలు ఇష్టమైన రోజులు. వినాయకుడు ముఖ్యంగా పిల్లల దేవుడు, గుజ్జురూపం, ఏనుగు తొండం, ఎలుక వాహనం చూస్తే పిల్లలకు ఆకర్షణ. గణపతి పూజ ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలియదు. గణపతిని దేవతల అధిపతిగా చేశారన్నది పురాణగాథ. గణాధిపత్యం కోసం జరిగిన పోటీలో తన సోదరుడు కుమారస్వామిపై వినాయకుడు మీద విజయం సాధించాడు. కేవలం తల్లిదండ్రుల పాదపద్మాలే పుత్రునికి గొప్ప తీర్థం భావించాడు
పురాణాల ప్రకారం హిందువుల తొలి పండుగ వినాయక చవితి. ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ గణనాథుడికే. అగ్రపూజ అందుకునే దేవుడు, విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. తల్లిదండ్రులనే సమస్త లోకాలుగా భావించి, విజ్ఞతతో గణాధిపత్యం పొందిన బుద్ధిమంతుడు స్వామి. అలాంటి గణపతిని పూజించడానికి వినాయక చవితినాడు పత్రాలే ప్రధానమైనవి. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వాటి పేర్లు, వాటిలోని వైద్య గుణాల గురించి మీరూ తెలుసుకోండి

  1. మాచీ పత్రం : ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. నేత్ర రోగాలకు అద్భుత నివారిణి. నేత్ర, చర్మ వ్యాధులు నయమవుతాయి. ఈ పత్రంతో ‘ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి’ అని అర్చించాలి
  2. బృహతీ పత్రం : దీన్నే ‘వాకుడాకు’ ‘నేల మునగాకు’ అని కూడా పిలుస్తారు. ఇది గొంతు సమస్యలు, శారీరక నొప్పులు, ఎక్కిళ్లు, కఫ, వాత దోషాలు, ఆస్తమా, దగ్గు, సైనసైటిస్‌ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ పత్రాన్ని ‘ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి’ అంటూ గణపతికి సమర్పించాలి.
  3. బిల్వ పత్రం : దీనికే మారేడు అని పేరు. శివునికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీ స్వరూపం. ఇది మధుమేహానికి దివ్య ఔషధం. మారేడు వేళ్ళతో చేసిన కషాయం టైఫాయిడ్‌ జ్వరానికి విరుగుడు. ఈ పత్రంతో ‘ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి’ అంటూ అర్చించాలి.
  4. దూర్వాయుగ్మం (గరిక) :గణపతికి అత్యంత ఇష్టమైన పత్రం గరిక. తులసి తరువాత అంత పవిత్రమైంది గరిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. ‘ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి’ అంటూ స్వామికి గరికను సమర్పించాలి.
  5. దత్తూర పత్రం దీనిని మనం ‘ఉమ్మెత్త’ అని కూడా పిలుస్తాం. కఫ, వాత దోషాలను హరిస్తుంది. దీనిని వైద్యుని పర్యవేక్షణలో తీసుకోవాలి. ‘ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి’ అంటూ వరసిద్ధి వినాయకునికి సమర్పించాలి.
  6. బదరీ పత్రం :దీనినే ‘రేగు’ అని పిలుస్తుంటాం. బదరీ వృక్షం సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని స్వరూపం. చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు, అన్నం అరుగుదల సమస్యలకు, గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. ‘ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి’ అంటూ గణపతికి సమర్పించాలి.
  7. అపామార్గ పత్రం దీనికే ‘ఉత్తరేణి’ అని పేరు. దీని పుల్లలు యజ్ఞాలు, హోమాల్లో వినియోగిస్తారు. ఆ పొగను పీల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. స్థూలకాయానికి, వాంతులు, పైల్స్‌, టాక్సిన్స్‌ వల్ల వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. ‘ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి’ అంటూ ఈ పత్రాన్ని స్వామికి సమర్పించాలి.
  8. చూత పత్రం ఇదే మామిడి ఆకు. నోటి దుర్వాసన, చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ఠ స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజులలో కనిపించదు. ‘ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి’ అంటూ సమర్పించాలి.
  9. తులసి : ఎంత చెప్పుకొన్నా తరిగిపోని ఔషధ గుణాలున్న మొక్క తులసి. పరమ పవిత్రమైంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైంది. కఫ, వాత, పైత్య దోషాలు మూడింటినీ అదుపులో ఉంచుతుంది తులసి. కాలుష్యాన్ని తగ్గిస్తుంది. తులసి ఆకులు, వేర్లు, కొమ్మల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. తులసిచెట్టు రోజుకు 22 గంటలపాటు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ‘ఓం గజకర్ణాయ నమః తులసి పత్రం పూజయామి’ అంటూ గణపతికి అర్పించాలి. సూచన : తులసీ దళాలతో గణపతిని ఒక్క వినాయక చవితినాడు తప్ప ఇంకెప్పుడూ ఆరాధించకూడదని అంటారు.
  10. కరవీర పత్రం : దీనినే ‘గన్నేరు’ అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యం ఉంది. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో కిందపడినా నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. గన్నేరు చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చినా అనేక రోగాలు నయం అవుతాయి. ‘ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి’ అంటూ సమర్పించాలి.
  11. విష్ణుక్రాంత పత్రం దీనినే ‘అవిసె’ అంటాం. ఇది తామర వ్యాధిని అరికడుతుంది. విష్ణుక్రాంత పత్రం మేధస్సును పెంచుతుంది. ‘ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి’ అంటూ విష్ణుక్రాంత పత్రాన్ని సమర్పించాలి.
  12. దాడిమీ పత్రం : అంటే దానిమ్మ. లలితా సహస్ర నామాల్లో అమ్మవారికి ‘దాడిమి కుసుమ ప్రభ’ అనే నామం కనిపిస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరంమీద రాస్తే అలర్జీలు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు, గాయాలు మానిపోతాయి. ఇది వాపును అరికడుతుంది. పైత్యం, విరోచనాలు, ఉబ్బసం, అజీర్తి, దగ్గు వంటి వాటిని అదుపులో ఉంచుతుంది. ‘ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి’ అంటూ ఈ పత్రాన్ని గణపతికి సమర్పించాలి.
  13. దేవదారు పత్రం ఇది వనములలో, అరణ్యములలో పెరిగే వృక్షం. పార్వతీదేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు నూనె తలకు రాసుకుంటే.. మెదడు, కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు నూనె వేడినీళ్ళలో వేసి స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. ‘ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి’ అని సమర్పించాలి గణపతికి.
  14. మరువక పత్రం మనం దీన్ని ‘మరువం’ అంటాం. దీన్ని ఇళ్ళలోనూ, అపార్టుమెంట్లలోనూ కుండీల్లో పెంచుకోవచ్చు. ఇది మంచి సువాసన గల పత్రం. మరువం వేడినీళ్ళలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది. ‘ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి’ అంటూ ఈ పత్రాన్ని స్వామికి సమర్పించాలి.
  15. సింధువార పత్రం ఇదే వావిలి ఆకు. వావిలి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. ‘ఓం హేరంభాయ నమః సింధువార పత్రం పూజయామి’ అంటూ గణపతికి సమర్పించాలి.
  16. జాజి పత్రం జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. జాజి కషాయాన్ని రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ నివారణఅవుతుంది. చర్మరోగాలు, కామెర్లు, కండ్లకలక, కడుపులో నులిపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. ‘ఓం శూర్పకర్ణాయ నమః జాజి పత్రం సమర్పయామి’ అని సమర్పించాలి.
  17. గండకీ పత్రం దీనిని ‘దేవకాంచనం’ అని పిలుస్తాం. థైరాయిడ్‌ వ్యాధికి ఔషధం గండకీపత్రం. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబులను హరిస్తుంది. ‘ఓం స్కంధాగ్రజాయ నమః గండకీ పత్రం సమర్పయామి’ అంటూ వినాయకునికి సమర్పించాలి.
  18. శమీ పత్రం దీనిని జమ్మి అంటాం. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమాకు ఔషధం. ‘ఓం ఇభవక్త్రాయనమః శమీపత్రం సమర్పయామి’ అంటూ గణపతికి సమర్పించాలి.
  19. అశ్వత్థ పత్రం ఇదే రావి వృక్షం. రావి సాక్షాత్‌ శ్రీమహావిష్ణు స్వరూపం. రావి భస్మాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి. అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను వాడతారు. రావి చర్మరోగాలను, ఉదర సంబంధ రోగాలను, నయం చేస్తుంది. ‘ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం సమర్పయామి’ అంటూ సమర్పించాలి.
  20. అర్జున పత్రం దీన్నే ‘మద్ది’ అంటాం. ఇది తెలుపు, ఎరుపు .. రెండు రంగులలో లభిస్తుంది. మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. కానీ వాతాన్ని పెంచుతుంది. మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. ‘ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం సమర్పయామి’ అంటూ పూజించాలి.
  21. అర్క పత్రం ఇది జిల్లేడు ఆకు. జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. జిల్లేడు పాలు కళ్ళలో పడడం వల్ల కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ జిల్లేడు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు.. అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్తశుద్ధిని కలిగిస్తుంది. ‘ఓం కపిలాయ నమః అర్క పత్రం సమర్పయామి’ అని సమర్పించిన తర్వాత..
    చివరిగా ‘ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః ఏకవింశతి పత్రాణి సమర్పయామి’ అంటూ పూజను ముగించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...