అక్కినేని నాగేశ్వరరావు జయంతి.
(రోచిష్మాన్, 9444012279)
ఎన్.టి. రామారావు అన్న నట ప్రభంజనంలోనూ ఉన్నత స్థాయి ఉనికికొన్న ఉత్తమ నటుడు నాగేశ్వరరావు!
ఆలోచనా సరళితో, అవగాహనతో, సరైన నిర్ణయాలతో, మేలైన అంచనాలతో గొప్ప నటుడుగా నిలబడ్డారు, చరిత్రగా నెలకొన్నారు నాగేశ్వరరావు.
దేవదాసు సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠను పొందారు నాగేశ్వరరావు. “మీరు చేసిన దేవదాసును నేను ముందే చూసుంటే నేను దేవదాసు పాత్రను చెయ్యకపోదును” అని దిలీప్ కుమార్ అన్నారట.

తన పరిధిని, తన ప్రతిభ పరిధిని కచ్చితంగా గ్రహించి ఉద్గమించారు నాగేశ్వరరావు. ఇది చాల గొప్ప విషయం. తానేంటి? తనకు ఉన్నదేమిటి? తాను ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నలకు సరైన జవాబులతో రాణించిన మేధావి నాగేశ్వరరావు.
అవును, నాగేశ్వరరావు మేధావి అయిన నటుడు! తన ‘మేధతో గొప్ప నటుడు’ అయిన వారు నాగేశ్వరరావు. ఎలా అయితే ఘంటసాల తన గాత్రంతో కన్నా తన మేధతో గొప్ప గాయకుడు అయ్యారో అలా నాగేశ్వరరావు తన ప్రతిభతో కన్నా తన మేధతో గొప్ప నటుడుగా స్థిరమయ్యారు.
అన్ని రకాలుగానూ రామారావు సహజ ప్రజ్ఞావంతమైన నటుడు. (రామారావు ప్రతిభ, ప్రజ్ఞ దేశంలో మరో నటుడికి లేవు!) ఆ రామారావు ఉండగా మరో ధ్రువంగానూ, ఇంకో దిగ్గజంగానూ నాగేశ్వరరావు విలసిల్లారు. ఈ ఒక్క నిజం నాగేశ్వరరావు గురించి మనకు తెలియాల్సింది ఎప్పుడూ తెలియజెబుతూనే ఉంటుంది. ‘తనకన్నా రామారావు గొప్ప నటుడు’ అని స్వయంగా చెప్పడం నాగేశ్వరరావు ‘తెలివిడి’ని తెలియజేస్తుంది.

తెలివిడితో గొప్ప నటుడయ్యారు నాగేశ్వరరావు! అభిప్రాయాలతో కాదు, అనుకోవడాలతో కాదు తెలివిడితో, అవగాహనతో గొప్ప నటుడయ్యారు నాగేశ్వరరావు! ఇది మధ్యతరగతి మాంద్యాన్ని, జాడ్యాన్ని అధిగమించిన స్థితి.
అభిప్రాయాలతో బతికే మధ్యతరగతి బుద్ధి మాంద్యానికి ఇవాళ్టికీ నాగేశ్వరరావు ఒక చరుపు.
దేవదాసు తరువాత మిస్సమ్మ సినిమాలోని పాత్ర నాగేశ్వరరావు మేలైన ఆలోచనా సరళికి తార్కాణం. చాల బాగా చేశారు ఆయన ఆ పాత్రను. ఎన్నో సినిమాల్లో, ఎన్నో పాత్రలను గొప్పగా చేశారు నాగేశ్వరరావు.
సుడిగుండాలు సినిమాలో నాగేశ్వరరావు నటన విశేషం; విశిష్టం. ఆ సినిమాలో తన కొడుకు శవాన్ని చూడాల్సి వచ్చినప్పుడు ఇతర శవాలను చూస్తూ చూస్తూ చివరికి తన కొడుకు శవాన్ని చూసిన సందర్భంలో నాగేశ్వరరావు నటన అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. దాదాపుగా ఇలాంటి సందర్భానికే నాయగన్ సినిమాలో కమల్ హాసన్ చేసినది నాగేశ్వరరావు స్థాయికి దీటు కాదు. తమిళ్ ప్రేమాభిషేకం సినిమాలోనూ కమల్ నటన నాగేశ్వరరావు నటనకు సాటి కాదు.
నాగేశ్వరరావు సువర్ణ సుందరి సినిమా మాయాబజార్ మొదటి రిలీజ్ కన్నా పెద్ద హిట్! ప్రేమాభిషేకం ఎంత పెద్ద హిట్టో చరిత్ర చెబుతూనే ఉంటుంది. ఎన్నో హిట్లతో నాగేశ్వరరావు విజయవంతమైన నటుడు.

నాగేశ్వరరావు నట జీవితంలో సీతారామయ్య గారి మనమరాలు సినిమా ఒక విశేషం. కొన్ని వందల సినిమాలు చేశాక ఒక నటుడు తన మేనరిజమ్స్ అన్నిటినీ వదులుకుని పూర్తిగా మరో నటుడిలా చెయ్యడం అత్యంత గొప్ప విషయం. ఆ గొప్పతనాన్ని అలవోకగా అమలుపరిచారు; అందలమెక్కించారు నాగేశ్వరరావు.
నాగేశ్వరరావు ఒక చరిత్ర. తనను తాను తెలుసుకుని తనను తాను గెలుచుకుని ‘నిలిచి ఉండే గెలుపు’ అయి నిలిచిపోయారు నాగేశ్వరరావు.
అభిప్రాయాలతో కాదు, అనుకోవడాలతో కాదు తెలివిడితో, అవగాహనతో గొప్పగా పరిణమించడం; గొప్పతనమై పరిఢవిల్లడం నాగేశ్వరరావు మనకిచ్చిన మేలైన సందేశం.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

