ఈ నెల 15 సమావేశం అజెండా అదేనా
మునుగోడు ఫలితంతో క్యాడర్‌లో ఉత్సాహం
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారా! అందరికీ గుర్తుండే ఉంటుంది. 2019 జూన్‌లో అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా… 2018 సెప్టెంబర్‌లో ముందస్తుకు వెళ్ళాలన్న హఠాన్నిర్ణయాన్ని తీసుకున్నారు కేసీఆర్. అప్పుడైతే సరే… కేంద్ర – రాష్ట్రాలకు ఎన్నికలు ఒకే సారి ఎన్నికలు జరిగితే ఎంతో కొంత నష్టం వాటిల్లుతుందని ఊహించి, అలా చేశారు. మరి ఇప్పుడు అలాంటి అవసరం ఏమొచ్చింది. షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబరులో ఎన్నికలకు వెళ్ళాలి. కానీ మరోసారి కేసీఆర్ చర్యలు ముందస్తు అనుమానానికి తావిస్తున్నాయి.
రెండు నెలల క్రితం ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు కాకుండా పార్టీ ముఖ్యులతో కూడా సమావేశమయ్యారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేందుకే ఆ సమావేశమని సరిపెట్టుకున్నప్పటికీ… ఇప్పుడు మళ్ళీ అలాంటి సమావేశ నిర్వహణకు సిద్ధమవడం పరిశీలకులలో ముందస్తు అనుమాన బీజాన్ని నాటింది. ముందస్తుకు వెళ్ళడానికే ఈ నెల 15న టీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేశారని రాజకీయావర్గాల్లో ప్రచారం సాగుతోంది.
దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం చీటికీమాటికీ ఏదో ఒక సమస్య సృష్టిస్తుండడమే. ఇక ఇది పని కాదనీ, కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలనీ కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు వినికిడి. మునుగోడు ఉప ఎన్నికలో విజయం ఆయనను ముందస్తు ఆలోచన దిశగా డ్రైవ్ చేస్తోందంటున్నారు. హుజురాబాద్, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ పై చేయి సాధించడం… ఇప్పుడు మునుగోడు జై టీఆర్ఎస్ అనడంతో తనపై ప్రజలు చూపుతున్న అభిమానాన్ని ఆలంబనగా చేసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా తీర్చిదిద్దిన నేపథ్యంలో మొదట తెలంగాణలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం యోచిస్తున్నారంటున్నారు.
సర్వేలు తమకు అనుకూలంగా ఉంటే ఎన్నికలకు కేసీఆర్ సై అంటారని అంటున్నారు. ఈ నెల 15న నిర్వహించే పార్టీ సంయుక్త సమావేశంలో ఏ విషయం తేలిపోతుంది. మునుగోడు విజయంపై ఇంత పెద్ద సమావేశం ఏర్పాటుచేస్తారనుకోవడం భ్రమే. ఏదో కీలక నిర్ణయాన్ని తీసుకోవాలనే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారనీ, అది ముందస్తు ఎన్నికల కోసమే అవుతుందనీ పరిశీలకులు భావిస్తున్నారు.