Saturday, March 25, 2023
HomeAP Newsమాది రాజ‌కీయాల‌కు అతీత‌మైన బంధం

మాది రాజ‌కీయాల‌కు అతీత‌మైన బంధం

కేంద్రంతో సంబంధాల‌పై ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
మా ప్ర‌య‌త్నాల‌కు అండగా నిల‌వ‌రూ
ఒక‌వైపు సంద్రం…మ‌రోవైపు జ‌న‌సంద్రం
ప్ర‌తి రూపాయినీ స‌ద్వినియోగం చేస్తున్నాం
తేరుకోని ఎనిమిదేళ్ళ గాయం
ప్ర‌ధాని స‌మ‌క్షంలో విశాఖ స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌సంగం
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం, విశాఖపట్నం:
త‌మ‌ది రాజ‌కీయాల‌కు అతీత‌మైన బంధ‌మ‌ని ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీని అభివృద్ధి ప‌థంలోకి తీసుకెళ్ళాల‌ని తాము చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు అండ‌గా నిల‌వాల‌ని ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి విజ్ఞ‌ప్తి చేశారు. ఏపీకి విభ‌జ‌న గాయ‌మై ఎనిమిదేళ్ళు అయ్యింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విఖపట్నంలో శ‌నివారం ప్రధాని నరేంద్ర మోదీ కార్య‌క్ర‌మాల‌లో ఆయ‌న పాల్గొన్నారు. విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని వివిధ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అనేక ప్రారంభోత్స‌వాలూ చేశారు. ఈ ప‌నుల విలువ మొత్తం 10వేల 742 కోట్లుంటుంది. ఈ కార్య‌క్ర‌మానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్ పాల్గొన్నారు.


సీఎం వైయస్‌.జగన్ ప్ర‌సంగం ఆయ‌న మాట‌ల్లోనే…
ఉత్తరాంధ్ర గడ్డమీద సాదర స్వాగతం…
దేశ ప్రగతి రథసారధి, గౌరవనీయులు, పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గారికి, కేంద్ర మంత్రివర్యులకు, మనసు నిండా ఆప్యాయతలతో, చిక్కటి చిరునవ్వులతో లక్షలాదిగా తరలి వచ్చిన నా అక్కలకు, చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, అవ్వాతాతలకు, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ఉత్తరాంధ్రా గడ్డ మీద ఈ విశాఖలో సాదరంగా, హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి స్వాగతం పలుకుతున్నాను.


ఒకవైపు సముద్రం– మరోవైపు జన సముద్రం…
ఈ రోజు చారిత్రక ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఒకవైపు సముద్రం కనిపిస్తోంది, మరోవైపు జనసముద్రం కనిపిస్తోంది. కార్తీక పౌర్ణమివేళ ఎగసిపడిన కెరటాలకు మించి ఈరోజు జనకెరటం ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ కనిపిస్తోంది.


ఏం పిల్లడో ఎల్దమొస్తవా అన్నట్లు….
ఇక్కడకి వచ్చిన ఈ జనాభాను చూస్తుంటే ప్రజాకవి, గాయకుడు వంగపండు చెప్పినట్టుగా..పాడినట్టుగా.. తన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఏం పిల్లడో ఎల్దామొస్తవా అంటూ….ఈ రోజు మనం తలపెట్టిన ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా కదిలి రావడం కనిపిస్తోంది.
ఇదే నేలమీద నడియాడిన మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే.. వస్తున్నాయ్‌.. వస్తున్నాయ్‌ జగన్నాధ రథచక్రాలొస్తున్నాయ్‌ అంటూ కదిలివస్తున్న లక్షల జనసందోహం మన ఎదుట కనిపిస్తోంది.


ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా జన సందోహం…
ఈ రోజు దేశమంటి మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అన్న మన విజయనగరం వాసి, మహాకవి గురజాడ మాటలు మనందరికీ కర్తవ్య బోధ చేస్తున్నాయి. ప్రజల అభిమానంతో పాటు వారి ఆకాంక్షలకు ఇక్కడకు వచ్చిన ఈ జనసాగరం అద్దం పడుతోంది.
దాదాపుగా రూ.10,742 కోట్లు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన చేతుల మీదుగా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు…ఈ అశేష జనవాహిని తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున నిండుమనస్సుతో నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.


ప్రతి రూపాయి సద్వినియోగం దిశగా….
సర్‌… ప్రజల ప్రభుత్వంగా గడిచిన మూడున్నర సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పిల్లల చదువులు అయితేనేమి, ప్రజలందరికీ వైద్య ఆరోగ్యం అయితేనేమి, రైతులు సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమంతో పాటు అభివృద్ధి, పరిపాలన, ఈ రెండింటి వికేంద్రీకరణ, పారదర్శకత, గడపవద్దకే పరిపాలన ఇలా.. ఈ మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం. ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలదొక్కుకోవడం అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇంట ప్రతి ఒక్క కుటుంబం నిలదొక్కుకోవడం అని నమ్మి, ఇంటింటా ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి మా ఆర్ధిక వనరుల్లో ప్రతి రూపాయి సద్వినియోగం చేశాం.
ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మా శక్తిమేరకు మేం చేస్తున్న ప్రయత్నాలకు పెద్దలు, సహృదయలు అయిన మీరు, మీ సహాయ సహకారాలు మరింతగా అందించి మమ్మల్ను ఆశీర్వదించాలని ఈ సభా ముఖంగా ప్రధానమంత్రిని కోరుతున్నాను.


ఎనిమిదేళ్ల గాయం నుంచి కోలుకోనేలేదు….
ఎనిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఇంకా కోలుకోలేదు. మా గాయాలు మానేలా, మా రాష్ట్రం జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా, మీరు సహృదయంతో విశాల హృదయంతో చేసే ప్రతి సహాయం, మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ, మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి, మా రాష్ట్ర పునర్‌నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.


కేంద్రంతో రాజకీయాలకతీతమైన అనుబంధం..
మీరు మా రాష్ట్రం కోసం, మా ప్రజల కోసం చేసే ఏ మంచి అయినా కూడా.. ఈ రాష్ట్రం, ఈ ప్రజానీకం ఎప్పటికీ గుర్తుపెట్టుకుందని మనవి చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం.. పార్టీలకు, రాజకీయాలకు అతీతం.


ఏపీ ప్రయోజనాలే మా అజెండా….
మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు. ఉండదు, ఉండబోదు. మా రాష్ట్రానికి, మా రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను గుర్తుపెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు…. మీరు మరింతగా పెద్దమనసు చూపితే.. అలా మీరు చూపించే ఆ పెద్ద మనసును, మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తుపెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను.


ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానీ, ఇంతకముందు పలు సందర్భాలలో కానివ్వండి.. విభజనకు సంబంధించిన హామీల దగ్గర నుంచి.. పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నుంచి రైల్వే జోన్‌ వరకు… ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులను మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనుసుతో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కోరుకుంటున్నాను.


మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ