ప్రభుత్వాల వైఖరి సమంజసమేనా!
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
2000 సంవత్సరం వరకూ సినిమా ఓ వినోద సాధనం. మొదటి రోజే సినిమా చూడాలనే ధ్యాసతో థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరే వారు. విజయవాడ లాంటి నగరాల్లో ఇది ఇప్పటికీ కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి… కోట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు తొందరగా తమ డబ్బు రాబట్టుకోవడానికి టికెట్లు పెంచడం ప్రారంభమైంది. మాల్స్‌లో అయితే ఇది వెర్రితలలు వేసింది. టికెట్ ధరలు ఒక ఎత్తయితే…ఆవరణలో అమ్మే తినుబండారాలు, మంచినీళ్ళు కూల్ డ్రింక్స్ ధరలు మరొక ఎత్తు. అవి కచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండవు. కోర్టులు జోక్యం చేసుకున్నా ప్రయోజనం శూన్యం. వందల కోట్లు పోసి తీసే సినిమాలకు పైరసీ బెడద తోడైంది. అందుకే ఒకేసారి అన్ని థియేటర్లలో విడుదల చేసేయడం.. వారం రోజుల్లో అసలుతో పాటు లాభాలనూ కూడగట్టుకోవడం సంప్రదాయంగా మారింది. హీరోలకు కోట్లాదిరూపాయల రెమ్యునరేషన్. అంతకు మించి గ్రాఫిక్ వర్క్‌కు ఇంకొంత. అంతా ఇల్యూషన్ (భ్రాంతి). సినిమాయే ఓ భ్రాంతి అంటే లేటెస్ట్ టెక్నిక్స్‌తో ప్రేక్షకులను అంతకు మించిన భ్రాంతిలో ముంచుతున్నారు. ఆహా ఓహో అనిపిస్తున్నారు. ఆ డైరెక్టర్ అంత గొప్ప అంటే ఇంత గొప్ప అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటారు. వాస్తవానికి మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలకు పొడిగింపుగా సినిమాలు తీస్తూ వాటికి గ్రాఫిక్స్ జోడిస్తూ… ప్రేక్షకులకు అభిమాన పాత్రులైన హీరోలకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ చెల్లిస్తూ, సినీ మాయా జగత్తుతో భ్రమ అనే మత్తును ప్రవేశపెట్టారు. అన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి, పైరసీ పాలవడంతో కంగుతిన్న దర్శక, నిర్మాతలు వారం రోజుల్లోనే లాభాలు మూటగట్టుకుంటున్నారు. ఒకప్పుడు వంద కేంద్రాలలో వందరోజులు ఆడిన చిత్రాలుండేవి. ఇప్పుడు అది వేల కేంద్రాలలో వారం రోజుల స్థాయికి చేరింది. ఆపై ఓటీటీలు, శాటిలైట్ హక్కులు, టీవీ హక్కుల రూపంలో మరికొంత నిర్మాతలకు ముడుతుంది.
ఈ వ్యవహారం ప్రభుత్వాలకు తెలియడానికి కొంత సమయం పట్టింది. తమ ఖజానాకు పడుతున్న చిల్లును గమనించాయి. బెనిఫిట్ షోలు, ఎక్స్ట్రా షోలు పేరుతో డబ్బు దండుకుంటున్న నిర్మాతలకు నిబంధనలు పెట్టాయి. ఇది సహజంగానే నిర్మాతలకు ఇబ్బంది పెట్టాయి. అందుకే ఇప్పుడు తొలి వారం రోజులకు టికెట్ ధరలు పెంచుకునే అంశం ప్రభుత్వాల గుప్పెట్లోకి వెళ్ళింది. సో… ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. నిష్పత్తి మేరకు సొమ్ము చేతులు మారుతుందనేది బహిరంగ రహస్యం.
ఏపీ ప్రభుత్వం కొన్ని నెలలుగా ఈ అంశంపై సాగదీసి, భీష్మించుకుని తదుపరి ఒక పద్దతి ప్రకారం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ అంశంలో నష్టపోయింది భీమ్లానాయక్ సినిమా నిర్మాతలు. దీనివెనుక రాజకీయ అంశముందని విమర్శించిన వారూ లేకపోలేదు. ఆ తరువాత వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకోవడంలో ఆ దర్శక నిర్మాతలు ఏపీ ప్రభుత్వంతో సామరస్య ధోరణితో వ్యవహరించి గట్టున పడ్డారు. ఏపీ ప్రభుత్వం పట్టువెనక సినీ పరిశ్రమ ఆదాయం మొత్తం తెలంగాణకే వెళ్ళిపోతున్న అంశం ఉందని అంటున్నారు. ఆఖరుకు తెలుగు సినిమాలలో కనీసం 20శాతం ఆంధ్ర ప్రాంతంలో షూటింగులు చేసుకోవాలనే నిబంధనతో ప్రభుత్వం మెట్టు దిగి టికెట్ రేట్లను పెంచుకోవడానికి అంగీకరించింది.
ఇప్పుడు తాజాగా మెగా స్టార్ చిరంజీవి చిత్రం ఆచార్యకు తెలంగాణలో తొలి వారం రోజులు టికెట్లు పెంచుకోవడానికి అనుమతిచ్చారు. ఏపీలో ఇంకా ఆ అంశంపై ఇంతవరకూ ఎలాంటి అలికిడీ లేదు. ఒకట్రెండు రోజుల్లో అక్కడ కూడా అనుమతి వచ్చే అవకాశాలే ఎక్కువ.
టికెట్ల ధరలు పెంచుకునే అవకాశాన్ని అన్ని సినిమాలకూ ఎందుకు ఇవ్వడం లేదు. లేదా… టాప్ స్టారర్ చిత్రాలకే తప్ప చిన్న నటుల చిత్ర నిర్మాతలు పెంపు ఎందుకు అడగడం లేదు…. దీనికి సమాధానం ఒకటే. సినిమా నిర్మాణ ఖర్చు. ఖర్చు ఎంత ఎక్కువైతే… టికెట్ ధరలు అంత ఎక్కువుంటాయి. ఒక మోస్తరు చిత్రాలు మూడు రోజుల పాటు ఆడినా పెట్టుబడి వచ్చేస్తుంది. పెద్ద చిత్రాలు ధర పెంచుకోకపోతే మునిగిపోతారు. అదీ తేడా. ఇక్కడ ప్రభుత్వాలు స్థిత ప్రజ్ఙతతో వ్యవహరించి, తమ పనులు చక్కబెట్టుకుంటున్నాయి.
కొందరి చిత్రాలకే పెంపు ఎందుకు?
Date: