Thursday, November 30, 2023
HomeArchieveతెలంగాణ వైద్య చ‌రిత్ర‌లో వినూత్న అధ్యాయం

తెలంగాణ వైద్య చ‌రిత్ర‌లో వినూత్న అధ్యాయం

హైద‌రాబాద్ న‌లుచెర‌గులా టిమ్స్‌
నాలుగు కోట్ల శంకుస్థాప‌న చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌
సూప‌ర్ స్పెషాలిటీ వైద్య సేవ‌లు, పారా మెడిక‌ల్ కాలేజీలు
హైద‌రాబాద్‌, ఏప్రిల్ 26:
ప్రజారోగ్యం, వైద్యం మరింత మెరుగుపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశ వైద్య రంగ చరిత్రలో నిలిచిపోయేలా ఎయిమ్స్ తరహాలో మూడు టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలకు గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఒకే రోజు శంకుస్థాపనలు చేసారు. హైద‌రాబాద్ న‌గ‌రంతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు అత్యాధునిక హంగులతో కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని అందించడంతోపాటు, వైద్య విద్యను విస్తరించే లక్ష్యంతో, గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వైద్య రంగంలో ఈ విప్లవాత్మక కార్యాచరణకు నాంది పడింది.


టిమ్స్ నిర్మాణాలు :
నగరంలోని కొత్త‌పేట‌ ప్రూట్ మార్కెట్ స్థలంలో… ఎల్బీన‌గ‌ర్‌ – టిమ్స్ , ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ హాస్పిట‌ల్ స్థలంలో..స‌న‌త్ న‌గ‌ర్‌ – టిమ్స్ , అల్వాల్‌ లో అల్వాల్ టిమ్స్ కు మంగళవారం నాడు సిఎం శంకుస్థాపనలు చేశారు. ఈ మూడింటిలో స్పెషాలిటీ, సూప‌ర్ స్పెషాలిటీ వైద్య సేవ‌లు అందుతాయి. దాంతోపాటు.. వైద్య విద్య కోసం పీజీ స్పెషాలిటీ, సూప‌ర్ స్పెషాలిటీ సీట్లు, న‌ర్సింగ్, పారా మెడిక‌ల్ కాలేజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఒక్కో టిమ్స్‌ను 1,000 పడకల సౌక‌ర్యంతో నిర్మించ‌నున్నారు. ప్ర‌తి దవాఖానాలో 26 ఆప‌రేష‌న్ థియేట‌ర్లు, 300 ఐసీయూ పడకలతోపాటు ఆక్సిజ‌న్ సౌక‌ర్యం అందుబాటులోకి రానుంది. గ్రేటర్‌ హైదరాబాద్ చుట్టూ నిర్మిం‌చ‌నున్న నాలుగు సూపర్‌ స్పెషాల్టీ దవా‌ఖా‌నల వల్ల హైదరాబాద్ తో పాటు, పరిసర జిల్లాల ప్రజ‌లకు మెరుగ్గా వైద్య‌సే‌వలు అందనున్నాయి.


శంకుస్థాపనలు సాగాయిలా…
ఎల్బీ నగర్ –టిమ్స్
సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు కొత్త‌పేట‌ (ఎల్బీన‌గ‌ర్‌) సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణ ప్రదేశానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు పండితులు వేదమంత్రోచ్చరణాలతో స్వాగతం పలికారు. భూమి పూజ జరిపిన అనంతరం పూజారులు సిఎం కేసీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన కార్యాన్ని నిర్వహించారు.
ఎల్.బి.నగర్ – టిమ్స్ దవాఖాన ప్రత్యేకతలు
ఎల్బీ నగర్ టిమ్స్ దవాఖానాను మొత్తం 21.36 ఎక‌రాల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జీ ప్ల‌స్ 14 అంత‌స్తుల్లో దవాఖానను నిర్మిస్తారు. ఇందులో వెయ్యి ప‌డ‌క‌లను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించింది. గడ్డి‌అన్నా రం (కొత్తపేట) పండ్ల మార్కె‌ట్‌లో నిర్మిం‌చ‌నున్న ఎల్.బి.నగర్ సూపర్‌ స్పెషాల్టీ దవా‌ఖాన వల్ల నల్ల‌గొండ, వరం‌గల్‌, యాదా‌ద్రి–భు‌వ‌న‌గిరి తది‌తర జిల్లాల ప్రజ‌లకు మెరుగైన వైద్యం అందనున్నది.


సనత్ నగర్ – టిమ్స్ శంకుస్థాపన – దవాఖాన ప్రత్యేకతలు
ఎర్ర‌గ‌డ్డ (సనత్ నగర్) టిమ్స్ దవాఖాన నిర్మించే స్థలానికి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు చేరుకున్నముఖ్యమంత్రి కేసీఆర్, అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసి, శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ దవాఖానా పరిధిలోని 60 ఎకరాల స్థలంలో.. జీ ప్ల‌స్ 14 అంత‌స్తుల్లో 1000 ప‌డ‌క‌ల మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ దవాఖానను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ‌నున్నది. ఇందుకు గాను రూ.882 కోట్లు కేటాయించింది. ఈ నూతన సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ దవా‌ఖా‌నతో నగర ప్రజలతో పాటు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలు మెరుగైన సేవలు పొందే వీలుం‌టుంది.
అల్వాల్ టిమ్స్ – శంకుస్థాపన – ప్రత్యేకతలు
మధ్యాహ్నం 1 గంటకు అల్వాల్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానా నిర్మాణానికి సిఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అల్వాల్ లో మొత్తం 28.41 ఎక‌రాల్లో, జీ ప్ల‌స్ 5 అంత‌స్తుల్లో 1000 ప‌డ‌క‌ల దవాఖానాను నిర్మించ‌నున్నారు. ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.897 కోట్లను కేటాయించింది. అల్వాల్ లో నిర్మించే సూపర్‌ స్పెషాల్టీ దవా‌ఖాన వల్ల సిద్ది‌పేట, కరీం‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, ఆది‌లా‌బాద్‌, నిర్మల్‌ తది‌తర జిల్లాల ప్రజలు అత్యాధునిక వైద్య‌సే‌వలు పొందే వీలుం‌టుంది.


టిమ్స్’ ద్వారా అందించే ప్రత్యేక వైద్య సేవలు, చికిత్సలు, పరీక్షలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ టిమ్స్ దవాఖానాలన్నీ ఎయిమ్స్ మాదిరిగానే స్వయం ప్రతిపత్తి గల వైద్య విజ్ఞాన సంస్థలే. వీటిలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు, వైద్య విద్యనందించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో పీజీ కోర్సులు ఉంటాయి. సూపర్ స్పెషాలిటీలో నర్సింగ్, పారా మెడికల్ కోర్సుల్లో విద్యనందిస్తారు. ఈ టిమ్స్ లలో మొత్తం 30 గుండె, కిడ్నీ, లివర్, మెదడు,ఊపిరితిత్తులు మొదలైన డిపార్టుమెంటులుంటాయి. క్యాన్సర్, ట్రామా, ఎండోక్రైనాలజీ, ఎలర్జీ, రుమటాలజీ, గుండె క్యాత్ ల్యాబ్, కిడ్నీ డయాలసిస్, క్యాన్సర్ రేడియేషన్, కిమో థెరపీ, సిటి స్కాన్, ఎం.ఆర్.ఐ తదితర సేవలందిస్తారు. ఒక్కో దవాఖానాలో 500 మంది వరకు రెసిడెంట్ డాక్టర్లు, 200 మంది బోధనా సిబ్బందిని నియమిస్తారు. వీరందరూ అక్కడే ఉండేందుకు అన్ని సౌకర్యాలతో క్వార్టర్స్ కూడా నిర్మిస్తారు.
శంకుస్థాపనల అనంతరం..సిఎం కెసిఆర్ అల్వాల్ బహిరంగ సభనుద్దేశించి మాట్లాడారు. సిఎం ప్రసంగ పాఠం….వారి మాటల్లోనే.


గతంలో గాంధీ ఉస్మానియాలే గతి
‘‘ ఎనుకట ఏ దవాఖానకు పోతున్నావ్ అని అడిగితే.. గాంధీ దవాఖాన, ఉస్మానియా తప్పితే నీలోఫర్ అని చెప్పేవారు. ఈ దవాఖానాలు తప్ప ఇంకొకటి లేదు. ప్రైవేటు హాస్పటల్స్ మాత్రం చాలా వచ్చాయి. పేద ప్రజల కోసం హాస్పటల్స్ సరిగా ఉండేవి కావు.’’
మనకంటే 4 లక్షల ఏండ్ల క్రితమే వైరస్ పుట్టింది
మానవులు ఈ భూగోళం మీదకు 4 లక్షల ఏళ్ళ క్రితం వచ్చారు. కానీ వైరస్ లన్నీ మనుషులు రావడానికి 4 లక్షల ఏళ్ళ క్రితమే వచ్చాయని ఎంటమాలజిస్టులు చెప్పారు. అంటే 8 లక్షల సంవత్సరాల ముందే వైరస్ లు వచ్చాయి. వాటిని రూపుమాపడం సాధ్యం కాదు, అవి ప్రకృతిలో భాగంగా ఉంటాయన్నరు. అవి ఎప్పుడెప్పుడు ప్రకోపం చెందుతాయో అప్పుడు వ్యాప్తి చెందుతాయి అని చెప్తే నేను బేజారైపోయాను. కరోనా అయిపోదా అంటే కరోనా తాతలు కూడా ఉన్నాయి భవిష్యత్తులో అని సైంటిస్టులు చెప్పారు.


ఇంత ప్రగతిని మనమే చేసినమంటే గర్వంగా వున్నది
‘‘ఒక నగరంగానీ, ఒక రాష్ట్రం గానీ, ఒక దేశం గానీ ఎవరికైతే పటిష్టమైనటువంటి వైద్య వ్యవస్థ ఉంటుందో వాళ్ళు తక్కువ నష్టంతోని బయట పడతారు. ఎవరికైతే వైద్య వ్యవస్థ బాగుడందో వారు నష్టాలకు గురై లక్షలమంది చనిపోతారన్నరు. వైరస్ లను మొత్తం ఫినిష్ చేసే మెకానిజం ఇప్పటికీ ప్రపంచంలో లేదు. కంట్రోల్ చేసే వైద్య విధానముంది. వైద్య విధానాన్ని పటిష్టం చేసే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా పేదల కోసం, ఇబ్బందులు పడే వారి కోసం పలు చర్యలు తీసుకున్నది. కొన్ని సందర్భాల్లో ఇదంతా మనమే చేశామా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఊహించనటువంటి కార్యక్రమాలు చేశాం.’’
మనది మానవీయ ప్రభుత్వం..
హైదరాబాద్ కు వైద్యం కోసం వచ్చిన వారు దురదృష్టవశాత్తూ మరణిస్తే వాళ్ళను ప్రభుత్వ అంబులెన్సులో ఇంటి కాడ వదలిపెట్టి రమ్మనమని చెప్పినం. ఇది ఇండియాలో కాదు, అమెరికాలో, లండన్ లో ఎక్కడా లేదు. మానవీయ కోణంతో పనిచేసే ప్రభుత్వం మనది. చాలా కష్టపడి, పోరాడి, ఆరు దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టీ దీన్ని అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో పటిష్టపరచాలే కాబట్టీ సరైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోవడం జరుగుతున్నది. ఇదంతా కూడా మీరు గమనిస్తున్నారు.’’


అదీ మనకు వాళ్లకు తేడా..
‘‘ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రంలో రాజకీయ సభలు జరుపుతున్నాయి. ఇక్కడ మాత్రం మనం సికింద్రాబాద్ కంటోన్మంట్ లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నాం. ఇది వాళ్ళకు మనకు ఉండే తేడా.’’
ఎయిమ్స్ తరహాలో టిమ్స్
‘‘ హైదరాబాద్ కు నలుదిక్కులా దవాఖానలు నిర్మిస్తున్నాం. హెచ్ఎండిఎ పరిధిలో మన జనాభా 1 కోటి 64 లక్షలు. చాలా స్టెప్స్ తీసుకుంటున్నాం. రూరల్ ఏరియాలో కూడా పడకలు పెంచాం. సదుపాయాలు పెంచాం. నగరం మీద మరీ లోడ్ ఎక్కువవుతూ ఉంది కాబట్టీ పాత గాంధీ దవాఖాన, నీలోఫర్ అంటే కలవదు. ఒక నాలుగు హాస్పటల్స్ తో పాటు నీలోఫర్ ఆసుపత్రిలో కూడా పడకలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ వచ్చే హాస్పటల్ మామూలు హాస్పటల్ కాదు. ఏదో చిన్న దవాఖాన కట్టరు ఇక్కడ. మనం నిలబడే స్థలంలో ఎక్కడైతే మనం మాట్లాడుతున్నమో ఆ దవాఖాన పేరు టిమ్స్ హాస్పటల్ అంటే తెలంగాణ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఆల్ ఇండియా ఇన్సి ట్యూట్ ఆఫ్ మెడికల్స్ సైన్సెస్ ఎట్లా అయితే ఉంటదో అలాంటి దవాఖాన ఇక్కడ వస్తున్నది.’’


ఎటువంటి వైద్య సేవలంటే..
‘‘ ఈ హాస్పటళ్ళలో మీకు దాదాపుగా 16 స్పెషాలిటి, 15 సూపర్ స్పెషాలిటీలల్లో బ్రహ్మాండంగా మీకు వైద్యం అందే అవకాశం ఉంటుంది. కిడ్నీ వ్యాధి కావచ్చు, ఊపరితిత్తుల వ్యాధి కావచ్చు, గుండె వ్యాధి కావచ్చు. మరొకటి కావచ్చు. అన్నింటికి కూడా ఇక్కడ సౌకర్యం ఉంటుంది.వందకు వంద శాతం పేదలకు ప్రభుత్వ ఖర్చుతో కార్పోరేట్ స్థాయిలో ఫ్రీగా ఉచితంగా వైద్యసేవలు అందుతాయి. మహిళలకు ప్రత్యేకంగా ఒక ప్రసూతి వింగ్ ను ఏర్పాటు చేయాలి. వాళ్ళు కూడా ఎక్కడో పోవాలని అని కాకుండా అన్ని సేవలతో పాటు ప్రత్యేకమైనటువంటి ప్రసూతి కేంద్రం కూడా వంద పడకలో, రెండు వందల పడకలో ఇక్కడే నిర్వహించినట్లైతే మళ్ళీ వేరేచోటికి పోయే అవసరం రాదు. ఆ చర్య కూడా తీసుకోవాలని చెప్పి నేను హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను.’’


నలుదిక్కులా టిమ్స్
‘‘ ఉత్తమ సేవలందించేటువంటి ఒక గొప్ప టిమ్స్ హాస్పటల్ ఈ రోజు మనం దక్షిణ భాగంలో గచ్చిబౌలిలో ఏర్పాటు చేసుకున్నాం. పశ్చిమ భాగంలో చెస్ట్ హాస్పటల్ లో మరొక టిమ్స్ హాస్పటల్ వచ్చింది. అదే విధంగా తూర్పు భాగంలో, ఎల్బీ నగర్ లోని గడ్డి అన్నారం ప్రాంతంలో మరొక టిమ్స్ కు శంఖుస్థాపన వేయడం జరిగింది. దీంతోపాటు హైదరాబాద్ కు ఉత్తర భాగంలో మనం ఇక్కడ నిల్చున్న చోట మీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో టిమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. గాంధీకో, ఉస్మానియాకో, నీలోఫర్ కో పరుగెత్తాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ కు నలుదిక్కులా ఎక్కడికక్కడ జనాభాకు వైద్య సేవలు అందించడానికి ఈ నాలుగు హాస్పటల్స్ ను మనం ప్రారంభించుకున్నాం. ఇందులో వేయి పడకలతో హాస్పటళ్ళు ప్రారంభమవుతాయి. ప్రసూతి కేంద్రాలు కూడా ఏర్పడతాయి. చిన్న పిల్లల జబ్బులను కూడా నయం చేస్తారు.’’


హైద్రాబాద్ ప్రభుత్వ దవాఖానాల్లో 6000 బెడ్స్
‘‘ నిజాం ఆర్థోపెడిక్ హాస్పటల్ లో మరో రెండు వేల పడకలు కూడా అదనంగా మనం మంజూరు చేసుకుంటున్నాం. మొత్తం హైదరాబాద్ నగరంలో ఆరు వేల బెడ్స్ ను, ప్రతీ బెడ్ కూడా ఆక్సిజన్ తో ఉండే విధంగా, ఇందులో 1000, 1500 వరకు ఐసియు బెడ్స్ ఉండే విధంగా హాస్పటల్స్ నిర్మాణం జరుగుతున్నది. తద్వారా దోపిడీకి గురికాకుండా వైద్యం ఉచితంగా పేద ప్రజలకు అందించబడాలని నేను మనస్ఫూర్తిగా భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.’’


మతవిద్వేషం ప్రమాదకరం…
‘‘ విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఏం జరిగిందో, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలిసినటువంటి వాళ్ళు ఏ ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మీరందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మతం పేరు మీద, కొందరు కులం పేరు మీద చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తున్నాను. ఈ దేశం అన్ని మతాలను, అన్ని కులాలను, అందరినీ సమున్నతంగా ఆదరించే గొప్ప భారతదేశం. దీన్ని చెడగొట్టుకుంటే, ఈ సామరస్యవాతావరణం చెడిపోతే మనం ఎటుకాకుండా పోతాం. ఒకసారి ఆ క్యాన్సర్ జబ్బు మనకు పట్టుకుంటే మనం చాలా ప్రమాదంలో పడిపోతాం.’’


పరమత సహనమే భారతీయ తత్వం..
‘‘ ఫలానా వాళ్ళ షాపులో పూలు కొనద్దు. ఫలానా వాళ్ళ షాపులో ఇది కొనద్దు. అది కొనద్దు అని కొందరు మత విద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారు. అది మీరు ప్రజలుగా ఆలోచన చేయాలి. మన భారతీయులు 13 కోట్ల మంది విదేశాలలో పనిచేస్తున్నారు. ఒకవేళ వాళ్ళందిరినీ ఆ ప్రభుత్వాలు తిరిగి పంపిస్తే వాళ్ళకు ఎవరు ఉద్యోగాలివ్వాలి. ఎవరు సాదాలి..? ప్రజలు ఆలోచించాల్సిన అవసరమున్నది.


ప్రగతి పథంలో తెలంగాణ
‘‘ మన హైదరాబాద్ లో ఈ ఏడు సంవత్సరాల్లో 2 లక్షల 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించగలిగాం. సుమారుగా 10, 15 లక్షల మంది పిల్లలకు ఆ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు దొరికాయి. రేపు హైదరాబాద్ నగరంలో 14 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఫార్మా యూనివర్సిటీతో పాటు, ఫార్మా సిటీ తేబోతున్నాం. మన మేడ్చల్ పక్కనున్నటువంటి ఏరియాలో హైదరాబాద్ ప్రపంచానికే వ్యాక్సిన్ సెంటర్ గా ఉంది. జీనోమ్ వ్యాలీ లో బయోటెక్ వ్యాక్సిన్ లు తయారుచేయడంలో మనం భారతదేశానికే కాదు ప్రపంచానికే రాజధానిగా ఉన్నాం. మొత్తం ప్రపంచంలోనే 33 శాతం టీకాలు తయారుచేసే సెంటర్ మన హైదరాబాద్. ఎక్కడెక్కడివారో ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నారు.’’


హైద్రాబాద్ శాంతి సామరస్యాలకు కేంద్రం
‘‘హైదరాబాద్ పోతే విమానం దిగినా, రైలు దిగినా, బస్సు దిగినా ప్రశాంతంగా ఉంటుంది. బాగా ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల భోజనం దొరుకుతుంది. అన్ని భాషలు మాట్లాడేవారుంటరు. అందరు కలిసి బ్రతుకుతారు. కానీ… హైదరాబాద్ లో దిగుతూనే కత్తులు పట్టుకుంటారు. తుపాకులు పట్టుకుంటారు. 144 సెక్షన్ పెడతారు. కర్ఫ్యూ ఉంటుంది. పొద్దున లేస్తే తన్నుకుంటారు…అనే పేరువస్తే … మన దగ్గరికి ఎవరైన వస్తారా. సామరస్యం ఉంటే, శాంతి ఉంటే, లా అండ్ ఆర్డర్ బాగుంటే, మన పోలీస్ శాఖ బాగుంటే వెల్లువలా పెట్టుబడులు వస్తాయ్. పరిశ్రమలు తరలి వస్తాయ్. ఉద్యోగాలు, ఉపాధి దొరకుతుంది. పొద్దున లేస్తే కులం పేరు మీద, మతం పేరు మీద కొట్లాటలు, కర్ఫ్యూలు, ఫైరింగ్ లు ఉంటే ఎవ్వరు కూడా మన దగ్గరికి రారు. అది మన కాళ్ళు మనం నరుక్కున్నట్టు అవుతుంది.’’


మతపిచ్చి క్యాన్సర్ రోగం వంటిది
‘‘ తెలంగాణ బిడ్డగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాల్లో ఒక సీనియర్ రాజకీయనాయకునిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. మత పిచ్చి అనే క్యాన్సర్ ను మన మీద పెట్టుకోవద్దు. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదో తాత్కాలికంగా అప్పటికప్పుడు మజా అనిపిస్తుంది. కానీ శాశ్వతంగా మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అటువంటి సంకుచిత ధోరణులకు తెలంగాణలో ఆస్కారమివ్వవద్దు..’’


నూతన రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి ఫలాలు :
‘‘ మనది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. పసికూన రాష్ట్రం. ఈ దేశంలో చాలా పెద్ద రాష్ట్రాలున్నాయి. మహారాష్ట్ర కావచ్చు. తమిళనాడు కావచ్చు. కర్ణాటక కావచ్చు. గుజరాత్ కావచ్చు. ఇవన్నీ ఎప్పటి నుంచో రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. మన తెలంగాణ తలసరి ఆదాయం వీటన్నింటిని మించి నమోదైంది. ఇంత ప్రగతితో అద్భుతంగా మనం ముందుకు పోతున్నాం. సంపద సృష్టిస్తున్నాం. పేదలకు పంచుతున్నాం. ఇవ్వాళ 2016 రూపాయల పెన్షన్ తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడ కూడ ఇవ్వరు. ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్ లో కూడా ఇవ్వరు. దివ్యాంగులకు 3016 రూపాయల పెన్షన్ ఎక్కడ కూడా ఇవ్వరు. ఆడపిల్ల పెండ్లి జరిగితే 1,00,116/- రూపాయలు ఇచ్చే సాంప్రదాయం ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడ కూడా లేదు. అదే విధంగా 7 ఏండ్ల కింద కరెంటు సమస్య ఎట్లా ఉండేదే మనకు తెలుసు. ఇవ్వాళ మన దగ్గర కరెంటు పోతే వార్త. ఇండియాలో కరెంటు ఉంటే వార్త. ఇది వాస్తవం.’’


పుష్కలంగా కరెంటు, సాగు, తాగు నీరు
‘‘ ప్రధానమంత్రి ప్రాతినిధ్యంవహించే గుజరాత్ లో కూడా రైతులు రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తున్నారు. కానీ 7 ఏండ్ల క్రితం పుట్టిన పసికూన తెలంగాణ రాష్ట్రంలో రాత్రింబవళ్ళు కష్టపడి 24 గంటల కరెంటు అన్ని రంగాలకు ఇచ్చుకుంటూ ఉన్నాం. ఎండాకాలం వచ్చిందంటే ఎమ్మెల్యేల చావుకొచ్చేది. దారుణమైన పరిస్థితులు. ఏ మూలకు పోయిన బిందెల ప్రదర్శనలు, నిరసనలు, రాస్తారోకోలు జరిగేవి. ఇవ్వాల తెలంగాణలో బిందెల ప్రదర్శన ఎక్కడ కూడా లేదు. మిషన్ భగీరథ పుణ్యామా అని మంచినీళ్ళ సమస్య కూడా తీర్చుకున్నాం. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ వంటి పథకాలతో బ్రహ్మాండంగా ముందుకుపోతున్నాం. ధాన్యం పండించడంలో దేశంలో నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతున్నాం. అన్ని రంగాలు బాగుజేసుకుంటూ ముందుకు సాగుతున్నాం..’’


వైద్యం విద్య రంగాలకు పెద్ద పీట
‘‘ ఇక నుంచి ప్రభుత్వం విద్య, వైద్యం మీద దృష్టిపెట్టబోతున్నది. రాబోయే రోజుల్లో మన గురుకుల పాఠశాలలు మరిన్ని పెరగాలి. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. విద్య, వైద్య సేవలు ప్రజలందరికీ అందాలని చెప్పి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నది.’’
మీ ఆశీర్వాదమే మాకు బలం
‘‘ పెద్ద పెద్ద రాష్ట్రాలను దాటి ముందుకుపోతున్నామంటే, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి కరెంటు ప్రజలకు ఇవ్వగలుగుతున్నామంటే మీరిచ్చే మద్దతు, దీవెన, ఆశీస్సులు, బలం తప్ప మరోటి కాదు. మీ దీవెన ఇదే విధంగా కొనసాగాలి. పటిష్టంగా తెలంగాణ పచ్చబడాలె. ఇంకా ముందుకు పోవాలి. దేశానికే తలమానికంగా ఉండే విధంగా ఈ రాష్ట్రం తయారుకావాలి. అందుకోసం ఎంతముందుకైన వెళ్తాం. ఎవరితోనైనా పోరాడుతాం. ఎప్పటికప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటూ, కడుపులో పెట్టుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.’’


అభినందనలు
‘‘ ఇంతమంచి స్థలంలో అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను ప్రారంభించుకున్నందుకు ఇక్కడి శాసన సభ్యులను, మంత్రిని, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలను మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జై తెలంగాణ ’’
మూడు టిమ్స్ దవాఖానా ల శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రులు .. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తో పాటు, మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీహెచ్.మల్లారెడ్డిలు పాల్గొన్నారు.
ఎంపీలు, కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, శంభీర్ పూర్ రాజు, కె.నవీన్ రావు, సురభి వాణీదేవి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, యోగానంద్, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య, జైపాల్ యాదవ్, కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జెడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, లక్ష్మీనారాయణ, రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీ ఎస్. వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మలిపెద్ది సుధీర్ రెడ్డి,
వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, డిఎంఈ రమేశ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ