అన్నమయ్య అన్నది-26
(రోచిష్మాన్, 9444012279)
‘‘ఇంతకంటే నేమున్నది యెంత దలపోసినాను
చింత దీఱ నీసేవ సేయుటే కలది’’
ఇంతకన్నా ఏముంది ఎంత ఆలోచించినా; కష్టాలు తీఱేట్టుగా నీ సేవ చెయ్యాల్సి ఉంది అంటూ ఇదిగో మనకు అవసరమైన సంకీర్తనను పల్లవింపజేశారు అన్నమయ్య. ఎంత ఆలోచించినా దుఃఖం తీఱాలంటే దేవుడి సేవకంటే మఱొకటేముంది అంటూ ఏమీలేదు అని అర్థం చేసుకోమంటున్నారు అన్నమయ్య.
భగవద్గీత (అధ్యాయం 10 శ్లోకం 9)లో ‘‘మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం / కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ’’ అని చెప్పబడ్డది. అంటే నాపై (భగవంతుడిపై) మనసు ఉన్నవాళ్లూ, నన్ను పొందిన ప్రాణం ఉన్న వాళ్లూ నన్ను లేదా నా గుఱించి ఒకళ్లకొకళ్లు బోధించుకుంటూ ఆపై చెప్పుకుంటూ ఎప్పుడూ తృప్తిపడతారు ఆపై ఆనందిస్తారు అని అర్థం. భగవంతుడి సేవలో చింత (దుఃఖం) తీఱుతుంది అని ఈ శ్లోకం తెలియజెబుతోంది.
హావడ్ వైద్య విద్యాలయంలో సహకార వైద్య ఆచార్యుడిగా (Associate Proffessor of Medicine at The Harward Medical School) పని చేసిన హబట్ బెన్‌సన్ (Herbert Benson) అనే వైద్యుడు (1975) తన the Relaxation Response పుస్తకంలో ఇలా చెప్పాడు: ‘‘The Relaxation Response has always existed in the context of religious teachings. its use had been most wide spread in the Eastern culture, where it has been an essential part of daily existance. Religious prayers and related mental techniques have measurable, definable physiologic effects…’’ మనం భగవంతుడి సేవలో భాగంగా చేసే ప్రార్థనలు (religious prayers) మానసిక ఆందోళన (చింత)ల్ని తీఱుస్తాయి అని హబట్ బెన్‌సన్ అంతర్జాతీయంగా, ఒక సరైన పాఠంగా తెలియజెప్పాడు; మనం తెలుసుకుందాం.
‘‘ఉపకారముగ దేహ మొసఁగితి విటు నాకు
ఉపమించి నేఁజేసే ప్రత్యుపకార మిఁక నేది
ఎపుడూ నీ ధర్మమున నిటు నీ ఋణస్థుఁడనై
ప్రసన్నుఁడనై నేను బ్రదుకుటే కలది’’
చేసిన ఉపకారంగా శరీరాన్ని ఇచ్చావు ఇలా నాకు; ఆ ఉపకారంతో పోల్చి నేను చేసే ప్రత్యుపకారం ఇంక ఏది? ఎప్పుడూ నీ పుణ్యమా అని (నీ ధర్మమున) ఇలా నీకు ఋణపడ్డ వాడినై, సంతుష్టుడినై నేను బతకాల్సి ఉంది అంటూ అన్నమయ్య పండిన తన మనసును పదాలలో పలికించారు.
ఈ దేహాన్ని ఇవ్వడం భగవంతుడు చేసిన ఉపకారం. దానితో పోల్చతగ్గ ప్రత్యుపకారం లేదు. సాయం పొందినందుకుగానూ భగవంతుడికి ఋణపడి సంతుష్టుడై బతకడమే మనిషి చెయ్యాల్సింది. అన్నమయ్య మనకు చేసిన చాల విలువైన, ఫలవంతమైన బోధన ఇది. పొందిన సాయాన్ని మరిచిపోకుండా ఉండడం ఋణపడి ఉండడం అవుతుంది. భగవంతుడు చేసిన సహాయం లేదా ఉపకారం శరీరాన్ని ఇవ్వడం. ఆ సహాయానికి ఋణపడ్డ వాడు అవడమూ, ఆ ఋణపడడంవల్ల సంతుష్టుడు అవడమూ మనిషి తనను తాను మేలైన మనిషిగా మలుచుకోవడం అవుతుంది.
‘‘వేవేగ వెఱ్ఱి జేయక వివేకిఁ జేసితివి
ఈవికి నే మాఱుకు మాఱిచ్చే దెక్కడ నున్నది
ఈవల నీకుఁ గీర్తిగా నిట్టే నీ యాధీనుఁడనై
భావించి భయము లేక బ్రదుకుటే కలది’’
తొందఱపడి వెఱ్ఱివాడిని చెయ్యకుండా వివేకిని చేశావు. ఆ దానానికి (ఈవికి) నేను ప్రతిక్రియగా మరొకటి ఇచ్చే దెక్కడ ఉంది? ఇకపై (ఈవల) నీకు స్తుతిగా, వెంటనే (ఇట్టే) నీ ఆధీనుడినై ధ్యానంచేస్తూ (భావించి) భయం లేకుండా బతకాల్సి ఉంది అని ఉగ్గడించారు అన్నమయ్య.
ఏ వెఱ్ఱి వాడిగానో కాకకుండా వివేకిగా చేసినందుకు భగవంతుడికి స్తుతిగా, భగవంతుడికి లోబడి ఆ భగవంతుడిని ధ్యానిస్తూ భయ రహితంగా బతకాలని అన్నమయ్య అనడం మహోన్నతం. మనిషి ఎలా బ్రతకాలి? భగవంతుడికి స్తుతిగా బతకాలి! మహిపై మఱే మహనీయుడూ ఈ మాట చెప్పలేదు. భగవంతుడికి స్తుతిగా బతకడానికి అలవాటుపడితే, భగవంతుడిని ధ్యానిస్తూ బతికితే భయం అనేది ఉండదు. ఎప్పుడయితే భయం ఉండదో అప్పుడు చింత కూడా ఉండదు.
‘‘జడులలోఁ గూర్చక యాచార్యునిలోఁ (తోఁ?) గూర్చితివి
నడపేటి నీ సరవికి నా సరివి యేమున్నది
ఎడయక శ్రీవేంకటేశ నీకు బంటనై
బడివాయ కిట్లానే బ్రదుకుటే కలది’’
తెలివి లేని వాళ్లతో కలపకుండా గురువులతో కలిపావు నడిపిస్తున్న నీ దారిలో నా దారి ఏముంది? దూరమైపోకుండా శ్రీవేంకటేశ్వరా నీకు బంటునై దారి తప్పకుండా ఇలాగే బతకాల్సి ఉంది అంటూ అన్నమయ్య సంకీర్తన్ని సంపూర్ణం చేశారు.
‘నీ దారిలో నా దారి ఏముంది?’ ఈ తలపుతో భగవంతుడి బంటుగా దారి తప్పకుండా జీవించడమే మనిషి జీవితానికి సంపూర్ణత్వం అవుతుంది. ఈ పరమసత్యాన్ని ఇకనైనా మనం ఆకళింపు చేసుకోవాలి.
చైనీస్ కవి, తాత్త్వికుడు లావ్ – చు (Lao -Tzu) తన టావ్ – ట – చింగ్ (3వ కవిత) లో ‘‘గురువు నడిపిస్తాడు / జనాల మస్తిష్కాలను శూన్యం చేసి’’ అని అంటాడు. నా దారి ఏముంది? దూరమైపోకుండా శ్రీవేంకటేశ్వరా, నీకు బంటునై దారితప్పకుండా ఇలా బతకడమే ఉన్నది అని అంటూ ఆ లావ్ – చు భావాన్ని మనకు కలగజేస్తూ అన్నమయ్య ఒక గురువులా మన మస్తిష్కాలకు మేలిమిని ఇస్తున్నారు. ఆ కవితలో లావ్ – చు ‘‘గురువు జనాలకు సాయం చేస్తాడు వాళ్లకు తెలిసిన అన్నిటినీ, వాళ్ల కోర్కెలు అన్నిటినీ కోల్పోయేటందుకు’’ అనీ అంటాడు. అన్నమయ్య సరిగ్గా ఆ పనే చేశారు ఈ సంకీర్తనలో. లావ్ – చు ‘‘అభ్యసించు చెయ్యకపోవడాన్ని / ఆపై అన్నీ సరిగ్గా అమరుతాయి’’ అంటూ ఆ కవితను ముగిస్తారు. అన్నమయ్య ఈ సంకీర్తన ద్వారా మనకు ఆ స్థితినే బోధించారు. మనం ఆన్నమయ్యను అందుకుందాం.
చింత తీఱేందుకు భగవంతుడి సేవ చేసుకోవాలంటూ, దేహాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి ఋణపడి ఉండడంవల్ల సంతుష్టిని పొందాలంటూ, భగవంతుడికి స్తుతిగా బతకాలంటూ, భగవంతుడి ధ్యానం చేస్తూ, భగవంతుడి బంటుగా బతకాలంటూ, దారి తప్పకుండా బతకాలంటూ దిశా నిర్దేశం చేస్తూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

