ఆమె గళం – జానపదానికి యుగళం

Date:

సి.ఆర్. రెడ్డి ఆమెతో ఏమన్నారంటే…
సప్తపర్ణిలో ఆగష్టు 17 న వింజమూరి అనసూయ డాక్యుమెంటరీ ప్రదర్శన
క్వీన్‌ ఆఫ్‌ ఫోక్‌ సాంగ్స్‌ – వింజమూరి అనసూయ
(డా. పురాణపండ వైజయంతి)
ఆమె జానపదాలు పాడుతుంటే జానపదులు కళ్ల ముందు ప్రత్యక్షమవుతారు.
ఆమె ‘తుదిలేని యాత్ర’ అంటూ తాత్త్విక గీతాలు పాడుతుంటే మనం దైవంలో లీనమవుతాం.
జానపదాలకు, భావగీతాలకు కట్టిన బాణీలు వింటుంటే స్త్రీలంతా గర్వంతో పొంగిపోతారు.
మేనమామ దేవులపల్లి రచించిన ‘ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా’ ఆరు చోట్ల ప్రత్యక్షంగా పాడారని వింటే ఆశ్చర్యచకితులవుతారు.
తొమ్మిది పదులు నిండినా పసిపిల్లలా ఉత్సాహంగా ఉండే ఆ చిన్ని శిశువును చూస్తే ముచ్చటపడిపోతారు.
అసూయ ఏ మాత్రం లేని ‘అనసూయ’ పేరును సార్థకం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని ‘సప్తపర్ణి’ లో ‘అసమాన అనసూయ’ డాక్యుమెంటరీ మూడోసారి ప్రదర్శితమవుతున్న సందర్భంగా…
ఇన్నని, అన్నని. చెప్పలేనన్ని ప్రయోగాలు చేసిన డా. వింజమూరి అనసూయాదేవితో సుమారు పది సంవత్సరాల క్రితం చేసిన ప్రత్యక్ష ఇంటర్వ్యూ ఆమె మాటల్లోనే మరోసారి..

ఒకే రోజు ఆరు చోట్ల ప్రత్యక్ష గానం…
1947 ఆగస్టు 15..
మొదటి స్వాతంత్య్ర దినం..
నేను మర్చిపోలేని రోజు.
మామయ్య రాసిన ‘ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా’ దేశభక్తి గేయాన్ని ఉదయాన్నే ఆరుగంటలకు మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రత్యక్షంగా పాడాను. వెంటనే అక్కడ నుంచి ‘ఆంధ్రవిజ్ఞాన సమితి’ చేరుకుని అక్కడ తొమ్మిది గంటలకు ఇదే గీతాన్ని మళ్లీ ఆలపించాను. పది గంటలకల్లా వై.యమ్‌.సి.ఏ. చేరుకుని, అక్కడ మళ్లీ పాడాను. సాయంత్రం నాలుగు గంటలకి ఆంధ్ర మహిళా సభలోను, ఆరు గంటలకి ఆంధ్ర మహాసభలోను, రాత్రి 8 గం.లకి ఆకాశవాణి మద్రాసు కేంద్రం వారు నిర్వహించిన ‘స్వాతంత్య్ర రథం కార్యక్రమం’ పాడాను. ఇలా ఆ గీతాన్ని ఒకే రోజున ఆరు ప్రదేశాలలో ప్రత్యక్షంగా గానం చేసిన ఏకైక గాయనిని నేనే. అందునా మన జాతిపిత ‘మహాత్మా గాంధీ’ ఎదుట పాడటం గుర్తు చేసుకుంటుంటే ఈ రోజుకీ నా శరీరం పులకిస్తుంది. అది నేను మరువలేని సంఘటన.
స్వాతంత్య్రం వచ్చిన రోజున దేశభక్తి గీతాన్ని ఇన్ని ప్రదేశాలలో, ఇంతమందికి వినిపించటం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను.
ఆ రోజు ఊరంతా పండగ వాతావరణమే. గ్రామగ్రామాలన్నీ మువ్వన్నెల జెండాలతో అలంకరించారు. దేశమంతా వంద దీపావళులలాగ సంబరాలు చేసుకున్నారు. ఆ రోజే జరిగిన మరో చిత్రమైన సంఘటన గురించి చెప్పాలి మీకు. నాకు అలంకారం చేసుకోవడమంటే చాలా ఇష్టం. సందర్భం కూడా కలిసి వచ్చింది. మన జండాను ప్రతిబింబించేలా ఏదైనా చేయాలనుకున్నాను. నేనే ఒక ఫ్యాషన్‌ క్రియేట్‌ చేశాను. 5 గజాల తెల్ల చీర కొనుక్కుని, ఎరుపు ఆకుపచ్చ రంగుల శాటిన్‌ రిబ్బన్లు కొని, వాటిని పొడవుగా కట్‌ చేసి చీర మీద నిలువు చారలుగా వేసుకున్నాను. జాకెట్‌కి కూడా బోర్డర్‌ వేసుకున్నాను. టైలర్‌ని రాత్రింబవళ్లు కూచోపెట్టి మరీ కుట్టించుకున్నాను. నా పాటలాగే నా డ్రస్‌ కూడా హిట్‌ అయ్యింది. అంత సరదా అలంకరణ అంటే నాకు. ఇప్పుడు కూడా చూశారుగా, నా చీరలో ఉన్న మూడు రంగులతో కలిపి బొట్టు పెట్టుకున్నాను. నిత్యం ఉత్సాహంగా ఉండటమే మనకు ఆరోగ్యం. నేను తొమ్మిది పదులు నిండినా ఇంత ఉత్సాహంగా ఉండటానికి కారణం ఇదే.


మాది అవినాభావ సంబంధం..
మావయ్యది నాది అవినాభావ సంబంధం. ఆయన పాటలు రాసేవారు, నేను బాణీలు కట్టేదానిని. అలా ఎన్నో భావగీతాలు పాడాను. నాకు తొమ్మిదేళ్లు వచ్చేసరికే రెండు మూడు వందల పాటలకి రాగాలు కట్టాను. నేను చేసిన బాణీలన్నీ కర్ణాటక సంగీతం ఆధారంగా చేసినవే. లలిత గీతాలు వచ్చి నన్ను స్వరపరచమని అడిగినట్టు అనిపించింది నాకు. భావగీతాలు నాతోనే పుట్టాయి. వల్లూరి జగన్నాథరావు గారితో కలిసి ‘భక్తిరంజని’ కార్యక్రమంలో పాడాను. ‘తుదిలేని యాత్ర ఇది’, ‘అఖిల లోకేశ్వరా చేరి నిలిచి’ వంటి గీతాలు బాగా ప్రసిద్ధికెక్కాయి. ‘మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో’ జానపదాన్ని నేనే స్వరపరిచాను. ‘నాకు నేర్పిందీ, నన్ను తీర్చిందీ’ కర్ణాటక సంగీతమే. లలిత సంగీతం నన్ను వరించిందని భావిస్తాను. ఇంత చిన్నవయసులో బాణీలు కట్టిన మహిళ నాకు తెలిసుండి భారతదేశంలో మరొకరు లేరు. నిజానికి నా పేరు గిన్సి బుక్‌లోకి రావాలి. రాకపోవటానికి కారణం తెలియదు.

ఇద్దరం కలిసి…
నా సంగీత గురువు మునిగంటి వెంకట్రావు పంతులు గారు. ఆయన నాకు క్షేత్రయ్య పదాలు నేర్పారు. ఆ పదాల మీద రీసెర్చి చేద్దామనుకున్నాను. కానీ నాకు జానపదాలంటే ఇష్టం. అప్పటì కే నేను చాలా జానపద గేయాలకు సంగీతం సమకూర్చాను. నిజానికి నేను నా తొమ్మిదవ ఏటనే జానపదాలకు, భావగీతాలకు బాణీలు కట్టటం ప్రారంభించాను. సుమారు 30 ఏళ్ల పాటు జానపద గేయాలు పాడాను. ఆ తరవాతే ఆకాశవాణిలో జానపద గీతాలు వేయటం మొదలుపెట్టారు. అలా ప్రారంభమైంది నా సంగీత ప్రయాణం. ఈ మధ్యలోనే నేను నా చెల్లి సీత కలిసి పాడటం మొదలుపెట్టాం. అలా సుమారు 23 ఏళ్లు కలిసి పాడాం.


మొట్టమొదటి జానపదం…
నేను పాడిన మొదటి జానపద గీతం ‘అయ్యో కుయ్యోడో’. జానపదాలు ఒకరి నోటి నుంచి ఒకరి నోటిలోకి చే రి ప్రసిద్ధి చెందాయి. అవి నొటేషన్‌తో రాస్తేనే నిలబడతాయని, ఏదో ఒక విధంగా వాటికి పరిపూర్ణత తీసుకువచ్చి, సుస్థిర స్థానాన్ని కల్పించాలనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే జానపద గేయాల సేకరణ, వాటికి స్వరాలు రచించడం వంటి పనులకు పూనుకున్నాను. దానితో పాటు ఆ గీతాలకు ప్రచారం తీసుకురావటానికి నా వంతు కృషి ప్రారంభించాను. 1931లో రాజమండ్రి నాళం వారి సభలో జానపదాలను పాడాను. అలాగే అన్ని సభల్లోను, రేడియోలోను ఈ జాన పదాలు ప్రసిద్ధి చెందేలా కృషి చేశాను. ఒకసారి కాకినాడ సభలో పాడాను. ఆ రోజుల్లో సభలలో అందరూ కిందే కూర్చునే వారు. మైకులుండేవి కావు. నేను ఒక తబలా ఆధారంగా పాడిన జానపదాలు ఆ రోజు సభంతా మార్మోగింది. జానపదాలకు పూర్తి రాగాలు ఉండవు కనుక మేళకర్తకి చెందినవి అంటూ రాశాను.
జ్ఞాపకాల దొంతరలు…
‘గతానికి స్వాగతం’, ‘నేను – నా రచనలు’ అని రెండు పుస్తకాలు రాశాను. ఆ తరవాత ఆటో బయోగ్రఫీ రాద్దామనుకున్నాను. కాని అందులో చేదు నిజాలు రాయవలసి వస్తుంది. అందుకే రాయలేదు. కేవలం కొన్ని సంఘటనలు మాత్రమే తీసుకుని చెప్పగలిగినన్ని విషయాలను ఈ పుస్తకాలలో పొందుపరిచాను. ఇందులో నా ఎసెన్స్‌ ఆఫ్‌ లైఫ్‌ ఉంటుంది. నా జీవితం ‘పరమపద సోపానపటము’ లా ఉంది. అయితే ఇందులో నిచ్చెనలు, పాములు… ఏవీ లేవు. కాని ఎన్నటికైనా నిజాలు రాసేసి గుండె బరువు తీర్చుకుందామని ఉంది. ఆ పని చేయగలనో లేదో ఆ పరమేశ్వరుడే నిశ్చయించాలి.


దేశ విదేశాలలో….
నా కచ్చేరీలు దేశవిదేశాల వారు ఆస్వాదించారు. సిలోన్, లండన్, పారిస్‌ దేశాలకు వెళ్లాను. పారిస్‌లో నాకు ‘క్వీన్‌ ఆఫ్‌ ఫోక్‌ మ్యూజిక్‌’ అని బిరుదు ఇచ్చారు. 1977లో అమెరికాలో మొట్టమొదటి తానా సభలో పాడటం ప్రారంభించి, అక్కడే 23 కచేరీలు చేశాను. ఆ కచేరీలను 22 శృతులతో పోల్చి, ‘అమెరికాలో నా సంగీత యాత్ర’ అని రాశాను. నయాగరా, బడేగులామలీఖాన్, మంగళంపల్లి బాలమురళి… ఇలా అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, సంగీతంతో పోలుస్తూ నా అనుభవాలు రాశాను. సంగీత పుస్తకాలు తప్పనిసరిగా చదవాలి. నేను రాసిన పుస్తకాలను చిన్న పిల్లలచేత అంటే భావి గాయకుల చేత విడుదల చేయించాను. నా పాటలన్నీ నేను స్వరాలు రాసి పెట్టుకున్నాను. సంగీత నాటక అకాడమీ వాళ్లు దానిని పబ్లిష్‌ చేశారు. ఇప్పుడు పునర్ముద్రణ చేశారు.
సాహిత్య ప్రవేశం కూడా…
‘రాజు ఖడ్గము వదిలి గంటె పట్టి’ అన్నట్టు సంగీతాన్ని పక్కకు నెట్టి సాహిత్యాన్ని అందుకున్నాను. 80 ఏళ్ల వయసులో రెండు పుస్తకాలు రాసి, ముద్రించాలి అనుకున్నాను, రాసేవరకు జబ్బు తెచ్చుకున్నట్లుగా ఫీల్‌ అయ్యాను. రాశాక రిలీఫ్‌ అయ్యాను. రచయిత్రిగా అనవసరంగా పేరు తెచ్చుకున్నాను.
ప్రజాబాహుళ్యంలోకి…
పల్లెల్లో ఉండే జానపదాలను సేకరించాను. వాటికి బాణీలు కట్టాను. జనబాహుళ్యంలోకి తీసుకువచ్చిన ఘనత నాదే. 1938లో ఆకాశవాణిలోకి జానపదాలనుS ప్రవేశపెట్టినది నేనే. ఇదంతా ఒ చిన్న పొగరు అనుకోండి, ఏదయినా అనుకోండి. ఈ విషయం అందరికీ తెలియాలి. అందుకే ప్రస్తావస్తున్నాను. ఇంత చేసినా నాకు ఒక చిన్న అసంతృప్తి మిగిలిపోయింది. నాకు రావలసిన గుర్తింపు రాలేదు. అందుకు కారణాలు ఏమిటో నాకు తెలియదు.

జానపదులలాగానే…
జానపద గీతాలన్నీ జానపదులు పాడినట్లే పాడగలను. కాని వాటిని వేదికల మీద పాడటానికి అనువుగా చిన్న చిన్న అలంకరణలు చేశాను. త్యాగరాజు ఎలా పాడాడో తెలీదు. కానీ ‘నగుమోములాంటివి’ మంగళంపల్లి బాలమురళి పాడిన తరవాత, ఇలాగే పాడితే బాగుంది అని అందరూ భావించారు. అలాగే నేను జానపదాలను బాగా పాడి, బాగుందనిపించి, సభల్లో ప్రవేశపెట్టాను. అప్పుడు ఎన్నో కామెంట్స్‌ వచ్చాయి. క్షేత్రయ్య పదాల బాణీలో ‘‘కోటి రత్నపు ముద్దు కోమలాంగి’’ అనే గీతాన్ని పాడాను. ఆ పాటని ముందుగా అమ్మకి వినిపించాను. అమ్మ తనకు నచ్చిందని చెప్పింది. ఈ గీతాన్ని నాళం వారి సభలో పాడినప్పుడు ఒక కవయిత్రి నా పాట విని, మా అమ్మ వెంకటరత్నమ్మతో ‘‘కవి కుటుంబంలో పుట్టిన మీరు మీ అమ్మాయి చేత చెత్తపాట పాడిస్తున్నారేమిటి’’ అని వెటకారమాడితే, దానికి మా అమ్మ ఘాటైన సమాధానం ఇచ్చారు. ఎప్పుడయితే అమ్మ నన్ను బలపరిచిందో అప్పటి నుంచి వెనుదిరగలేదు. 80 ఏళ్లుగా పాడుతూనే ఉన్నాను. తొమ్మిది పదులు నిండాక కూడా నేను ప్రత్యక్షంగా వేదికల మీద పాడాను. మొదటినుంచి నన్ను ప్రోత్సహించింది బాలాంత్రపు రజనీకాంతరావు గారు.

ఎంతో కష్టం…
జానపదుల దగ్గర నుంచి పాటలను సేకరించటం సామాన్యులకు చాలా కష్టం. జానపదులు పాడుతుంటే గబగబ రాసుకుంటూ నేర్చుకోవాలి. నేను వాళ్లు పాడుతుంటే జాగ్రత్తగా గమనిస్తూ, వారి ట్యూన్‌కి తగ్గట్టుగా స్వరం రాశాను. వాళ్ల నోటి నుంచి వచ్చిన పాట మన నోటి దగ్గరకు వచ్చేసరికి చిన్న చిన్న మార్పులు చేయాల్సిన అవసరం గమనించాను. ఏ పాటయినా బాగా పాడాలంటే కావలసిన మార్పులు చేసి పాడచ్చు అన్నాడు బాలమురళి. నేను ఆ మార్పులు చేశాను. ఆకాశవాణి వారి దగ్గర టేపులు ఉంటాయి కనుక, వారు సేకరించటం చాలా తేలిక. వారికి మైకులు, సేకరించటానికి తగినంత డబ్బు కూడా ఇస్తారు. కాని ఆ పని నా ద్వారా జరగాలని ఉండటంతో, నేను ఎన్నో కష్టనష్టాలకోర్చి సేకరించి, వ్యాప్తిలోకి తీసుకువచ్చాను.

మరచిపోలేను…
ఒకసారి హెల్త్‌ వీక్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి. అప్పుడు నేను కళ్యాణి రాగంలో ‘నిధి చాల సుఖమా’ పాడాను. అదే కీర్తన ఒకసారి ఒక పోటీలో పాడాలి. ఎందుకో ఆ రోజు ఆ కీర్తన మర్చిపోయాను. చిన్నప్పటి నుంచి కొత్త పాటలు పాడటమనే సరదా ఉన్న నేను బిడారం వారి పాటను ఇమిటే ట్‌ చేశాను. వెంటనే నన్ను పిలిచి నీకు త్యాగరాజ కీర్తనలు రావా అని అడగగానే, ‘నిధి చాల సుఖమా’ పాడేశాను. అది విని అక్కడికి వచ్చిన ఒక ప్రముఖుడు ‘నీ కూతురు పిట్ట కొంచెం కూత ఘనం’ అని అమ్మతో అన్నారు. తనతో పాటు మద్రాసు పంపిస్తే సినిమాల్లో పాడిస్తాను అన్నారు. ఆడపిల్లను ఒక్కర్తినే పంపడం ఇష్టం లేదని నాన్న వాళ్లు అనడంతో, వారు మా కుటుంబం అంతా మద్రాసు రావడానికి ఏర్పాటు చేశారు. అప్పుడు నా చేత ‘కిట్టమ్మా గోపాలబాలా కిట్టమ్మా’ పాడించారు. ఆ తరవాత నేను పాడిన ‘రయ్యో కొయ్యోడా’ పాట బాగా ఫేమస్‌ అయింది. నా చేత ఎన్నోపాటలు పాడించుకున్నారు. నేను కచేరీ చేసేటప్పుడు వరుసగా కర్ణాటక సంగీతం, భావగీతాలు, చివరలో ఒక జానపద గీతం పాడేదానిని.

ఉద్యోగ పని మీద నా చెల్లి సీత వెడుతున్నప్పుడు నేను కూడా వెళ్లి చాలా సేకరించాను. అన్నీ సేకరించాక వాటి మీద పరిశోధన చేద్దామనుకున్నాను. సి.ఆర్‌.రెడ్డిగారు నా గొంతు మీద పద్యాలు రాశారు. ఆయన రచించిన కవిత్వ తత్త్వ విచారం అనే పుస్తకంలో నా గురించి ప్రస్తావించారు.
నా పేరు చెప్పలేదు…
నాన్నగారు నా చెల్లి సీతకు నా కలెక్షన్‌ అంతా ఇవ్వమన్నారు. నేను, శర్మ బ్రదర్స్‌ కష్టపడి సేకరించినదంతా వాళ్లకిచ్చాను. అయితే ఇచ్చేటప్పుడు ఒక్క షరతు చెప్పాను. కృతజ్ఞతలు చెప్పేటప్పుడు తన పేరు ప్రస్తావించమన్నాను. కాని ఆ పని జరగలేదు. నేను చాలా బాధపడ్డాను. అందరూ అసూయ కూడిన అభిమానంతో ఉండేవారు. ఎక్కువ కాంతిని చూడడం, ఎక్కువ తీసిని తినడం, ఎక్కువ ఖ్యాతిని సహించడం ఎవ్వరి తరమూ కాదు.

1938లో ఆలిండియా రేడియో ప్రారంభోత్సవం నాడు ‘రారమ్మా! రారమ్మా!’ అని ముగింపులో ‘పోయినది దానిమ్మ’ అనే గీతాలను నా చేత పాడించారు. 1939లో ‘ఊర్వశి’ లో పాటలు ప్లేబ్యాక్‌ లేకపోయినా రేడియోవారు నా చేత పాడించారు. ఇదొక క్రెడిట్‌. ‘ఉత్తర రామచరితం’ నాటకంలో లక్ష్మణ మూర్ఛ ఘట్టంలో నేను చదివిన పద్యాలు విని, నాకు ఆకాశవాణిలో 250 రూపాయల జీతంతో ఉద్యోగం ఇస్తానంటే అంగీకరించాను.
నేనే మొట్టమొదటి సంగీత దర్శకురాలిని
ఊర్వశి, విద్యాపతి, శ్రీకృష్ణుడు, నవరసాలు, గోదాదేవి, దక్షయజ్ఞం మొదలయిన దేవులపల్లివారి ఆకాశవాణి నాటకాలలలో నటించాను. ఓ పక్కన నవ్యసాహిత్య పరిషత్‌లో కచ్చేరీలు. అలాగే ‘బ్రహ్మసమాజం’ లో ఆరుబయట వెన్నెలలో పాటలు పాడేవాళ్లం. 1943లో నాన్న నన్ను వెనక్కు తీసుకువెళ్లిపోయారు. అప్పుడు బి.ఏ. పూర్తి చేశాను. 1945లో వివాహం జరిగింది. ‘అనసూయ పెళ్లి కబుర్లు’ అని మావయ్య అందరికీ నా పెళ్లి కబుర్లు చెప్పారు. ‘మధూదయంలో మంచి ముహూర్తం మాధవి లతకు పెళ్లి పెళ్లి’ అనే పాట నా మీదే రాశారు.

ఇంటర్వ్యూ సందర్భంగా వింజమూరి అనసూయ చెప్పిన మరికొన్ని ముఖ్య అంశాలు ఆమె పలుకులోనే…

’ స్టెల్లామేరీస్‌లో మ్యూజిక్‌ లెక్చరర్‌గా చేశాను.
’ ‘కళాక్షేత్ర’లో పనిచేయడానికి అవకాశం వచ్చింది, కానీ వదిలేశాను
’ అన్నమయ్య పాటలను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు బయటకి తీసుకొచ్చారు. ఆ పాటలకు నన్ను ట్యూన్‌ చేసి పాడమన్నారు. అందుకోసం తాళ్లపాక రమ్మన్నారు. ఆ టైమ్‌లో మా ఆయనకి చెయ్యి విరిగింది. మా అమ్మాయికి బాగా జ్వరంగా ఉంది. నేను వెళ్లలేకపోయాను. అప్పుడు మల్లిక్‌ వెళ్లారు.
’ పాడగలిగినా ప్లే బ్యాక్‌కి వెళ్లలేదు.
’ ట్యూన్‌ చేయగలిగినా చేయలేదు.
’ యాక్ట్‌ చేయగలిగినా చేయలేదు.
అయినా వాటి గురించి బాధపడి లాభం లేదు. ఇప్పుడు చేయవలసినవి చాలా ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి తొందరపడుతున్నాను చేయడానికి.
’ నేను ఇన్ని చేసినా రావలసినంత గుర్తింపు రాలేదనిపిస్తోంది.
’ నాకు తెలిసుండి దక్షిణభారతంలో నేనే మొట్టమొదటి సంగీతదర్శకురాలిని. హార్మనీ పట్టుకుని వాయిస్తూ పాడతాను.
’ ప్రభుత్వం నన్ను ఎందుకు గుర్తించలేదో నాకు తెలీదు. నేను జానపదాలు పాడటం మొదలుపెట్టిన 30 సంవత్సరాలకి 1964లో ఆకాÔ¶ వాణిలో జానపద విభాగం పెట్టారు.
’ 1977లో అమెరికా వెళ్లిపోయాను.
’ నేను పాడిన పాటలకు నూటికి నూరు మార్కులు వస్తాయి. కాని 50 మార్కులు మాత్రమే తీసుకున్నాను.
’ స్త్రీల పాటలు పాడాను.
’ సెంట్రల్‌ గవర్నమెంటు వారు ఫెలోషిప్‌ ఇచ్చారు.
’ పెళ్లిపాటలు, సరదా పాటలు, మేలుకొలుపులు, లాలిపాటలు, గొబ్బిపాటలు, కోలాటం, మంగళహారతులు పండుగలు, పూజలు అన్నిటినీ మ్యూజిక్‌ నొటేషన్‌తో చేశాను.
’ సంగీతం గొప్ప గనిలాంటిది. ఎంత తవ్వితే అంత వస్తుంది.

వింజమూరి వీలునామా…
నాకు అలంకరణ అంటే బాగా సరదా. నన్ను ఎర్రచీరతో అలంకరించి, తల నిండా పూలు పెట్టి నా అంతిమయాత్ర సాగించాలని నా వీలునామాలో రాసుకున్నాను.
(వింజమూరి అనసూయ 1919 మే 12లో పుట్టారు. 2019 మార్చ్ 23 అస్తమించారు. అంటే ఇంచుమించు వంద సంవత్సరాలు జీవించినట్లు)

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...

Onam the festival of Colors and Flowers

(Shankar Raj) Kerala in many ways is a strange state....

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...