‘ఫెమీనా’ మంథ్లీ ఎడిటర్ విమలా పాటిల్
(డా నాగసూరి వేణుగోపాల్, 30 సెప్టెంబర్ 2024)
విమలాపాటిల్ 2024 సెప్టెంబర్ 29న గతించారు. నిజానికి విమలాపాటిల్ పేరు నా దృష్టిలో చాలా పెద్ద పేరు. నాకు గుర్తున్నంత కాలమూ ఆమే ఫెమినా ఎడిటరే…ఆమె 1973 నుంచి 1993 దాకా టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆంగ్ల మాసపత్రిక ఫెమీనా ఎడిటరు. ఆ టైమ్ లో జర్నలిజం మీద ఆసక్తితో ప్రతి పత్రికనూ పరిశీలించే ఓపిక, ఉత్సుకత ఉండేవి కనుక. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లైబ్రరీలో 1985-87 కాలంలో ఆ పత్రిక చాలా సంచికలను నేను చూశాను.

ఆమె మూడో పేజీలోనో, ఐదో పేజీలోనో సైన్డ్ ఎడిటోరియల్ రాసేవారు, ఆ సంతకం కూడా ఇంకా నాకు గుర్తు! అప్పట్లో వెలువడిన అన్ని భాషల మహిళా మాసపత్రికలకూ మాతృక వంటిది ఫెమినా అనుకున్నా ఆశ్చర్యం లేదు! ఫెమీనా అనే పేరు భలే బాగా అతికింది, క్యాచీగా ఉంది!
ఇంటర్నెట్లో ఆమె గురించి ఎలాంటి సమాచారం ఉందో కూడా కాస్త అన్వేషించాను. 1933 లో జన్మించిన ఈ బొంబాయి మహిళ లండన్ లో చదివి అక్కడే కొంతకాలం ట్రైనీ జర్నలిస్టుగా కూడా పనిచేశారని తెలుస్తోంది. ఆమె భారతదేశం వచ్చిన తర్వాత 'ఫెమీనా' తొలి సంచిక నుంచి అందులో పని చేయడమే కాకుండా 1973 లో సంపాదక పదవికి వెళ్లి అందులో రెండు దశాబ్దాల పాటు పనిచేయడం విశేషం. కొన్నిచోట్ల 1959 నుంచి ఆమె ఎడిటర్ అని రాశారు. కానీ ఫెమీనా గురించి ఆ సంస్థ అధికారిక సమాచారం ద్వారా తెలిసింది ఏంటంటే ఆమె 1973 నుంచి మాత్రమే ఎడిటర్ గా పనిచేశారని. సెన్సేషన్ కు పోకుండా, చీప్ ట్రిక్స్ లేకుండా స్త్రీలకు సంబంధించిన చాలా విషయాలు అప్పట్లో ఆ పత్రికలో ఉండేవి. నిజానికి మొదట్లో ఈ పత్రిక కుటుంబం, సమాజం అనే దృష్టితో సాగింది. గ్లోబలైజేషన్ తర్వాత లేదా దానికి కాస్త ముందు అది స్త్రీల పర్సనల్ కేర్ పత్రికగా మారింది. ఆ జంక్చర్ లోనే మిస్ ఫెమీనా వగైరా పోటీలు రావడం మొదలైంది.
గాంధీజీని, నెహ్రూని చూసిన తరానికి చెందిన విమలాపాటిల్ బొంబాయిలో పుట్టి పెరిగి లండన్ లో చదవడంతో సమగ్రమైన దృక్పథం ఉన్న తరానికి చెందిన మహిళామణి. ఆమె గతించారని ప్రముఖ పత్రికల్లో రాకపోవడం, కేవలం వాట్సాప్ ద్వారా కొందరు జర్నలిస్టులకి తెలవడం, తర్వాత అది మన దాకా రావడం సాధ్యమైంది. అప్పట్లో ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, తమిళ భాషల్లో ఈ పత్రిక నడిచిందని తెలుస్తోంది. అయితే ఇంగ్లీష్ పత్రికకు దేశవ్యాప్తంగా విజిబిలిటీ ఉండేది, కనుకనే నాలాంటి వాళ్లకు ఆ పత్రిక కనబడగలిగింది. అంతే కాకుండా 20 ఏళ్లు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' గ్రూపులో ఎడిటర్ గా మనగలడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఇప్పుడు తమాషా ఏమిటంటే ఆమె గతించారనే వార్త మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో అసలు కనబడకపోవడం!

(వ్యాస రచయిత ఆలిండియా రేడియో రిటైర్డ్ డైరెక్టర్)


