రామనుజ వైభవం-5
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
యామునాచార్యుల నిర్యాణంతో శ్రీరంగం క్షేత్ర గురుపీఠం చిన్నబోయింది. వారి కుమారుడు వరరంగాచార్యులు తండ్రిగారి వారసత్వంతో స్వామికి కైంకర్యాదులు నిర్వహిస్తున్నప్పటికీ ఏదో తెలియని లోటు వేధిస్తోంది. యామునుల వారి లేని లోటు భర్తీ కావడానికి రామానుజులే ప్రత్యామ్నాయమని, ఆయనను కంచి నుంచి రప్పించగలగాలని పంచాచార్యులుగా ప్రసిద్ధులైన యామునాచార్యుల శిష్యులు (వరరంగచార్యులు సహా మహాపూర్ణులు, గోష్ఠీపూర్ణులు, శ్రీశైల పూర్ణులు, మాలాధరనంబి) తీర్మానించి, ఇతర వైష్ణవ ప్రముఖులతో సమాలోచనలు చేశారు. ‘బుద్ధికి బృహస్పతి, తేజస్సుకు సూర్యుడు, భక్తికి ప్రహ్లాదుడు, క్షమకు పృథివి అయిన రామానుజాచార్యులు మాత్రమే యామునాచార్యులు స్థాపిత మఠానికి అధిపతిగా తగినవారని, పైగా యామునుల వారు అంతిమ సమయంలో ముడిచిన వేళ్లు యథాస్థితికి తేగలగిన వారని అభిప్రాయడ్డారు. గతంలో యామనాచార్యుల కాంచీపురం సందర్శనం సందర్భంగా రామానుజులను చూసి, ఆయనను ‘భవిష్యదాచార్యులు’గా సంబోధించడాన్ని గుర్తు చేసుకున్నారు. కనుక వారిని ఒప్పించి, రప్పించే బాధ్యతను గురుపుత్రుడు వరరంగాచార్యులకే అప్పగించారు. వారి సూచన మేరకు కంచికి చేరిన ఆయన ‘యతిరాజు’లకు నమస్కరించి ‘యమునాచార్య అస్తమయంతో శ్రీరంగ దివ్యక్షేత్రం నిస్తేజమైంది. పూర్వవైభవ పునరుద్ధరణకు శ్రీ యామునముని పాలించిన గురుపీఠాన్ని మీరు అధిష్ఠించాలని మనవి’ అని విన్నవించారు. దానికి,’ నేను యామునాచార్యుల వారి ఏకలవ్య శిష్యుడినైనప్పటికీ కంచి వరద రాజపెరుమాళ్ దాసుడను. స్వామి అనుమతి లేనిదే ఈ క్షేత్రాన్నివీడలేను. ఆయన రక్షణలోజీవితం సుఖంగా సాగిపోతోంది. గురుపుత్రులైన మీరూ, మా గురువుల సతీర్థులు కనుక పూజ నీయులు. అయినప్పటికీ మీ ఆహ్వానాన్ని మన్నించలేకపోతున్నాను’అని మృదువుగా బదులిచ్చారు.
వరదుని మెప్పించిన వరముని
రామానుజుల సమాధానంతో ధర్మసంకటంలో పడిన వరమునికి వరుదుని వేడడమే శరణ్యమనిపించింది.రంగనాథుడి సంకల్పానికి వరదుడు వికల్పం కలుగనీయబోడనే విశ్వాసంతో స్వామిని అర్థించారు.వేదాంత రహస్యములను సంపూర్ణంగా ఎరిగిన ఆయన మధుర గాయకుడు కూడా. కాంచీపురాధీశుడు వరదరాజస్వామి సంగీత ప్రియుడు కనుక ఆయనను తన సంగీత విద్యతో ప్రసన్నం చేసుకోవాలను కున్నారు.తమ గాత్ర మాధుర్యంతో మెప్పించి,‘శ్రీరామానుజులును శ్రీరంగం ప్రయాణానికి అనుమతించి యామునార్యమఠం సంరక్షణకు ఆశీర్వదించు’ అని విన్నవించారు. దానికి పేరిందేవీపతి ఆమోదం లభించింది. శ్రీరంగనాథునికి కోరిక, వరదరాజ అనుమతి మేరకు రామానుజులు విచారతప్త హృదయంతోనే కంచి నుంచి వీడ్కోలు తీసుకున్నారు. అది ఆయన జీవిత ప్రస్థానంలో మరో కీలక మలుపు. పెరిగింది వరదరాజస్వామి ఒడిలోనే అయినా, యతిసార్వభౌముడిగా ఆధ్యాత్మిక పాలనను సాగించింది రంగనాథ సన్నిధి నుంచే.
శ్రీరంగంలో అపూర్వ స్వాగతం
రామానుజుల రాక సమాచారం అందుకున్న ఆచార్యులు మహాపూర్ణులు సహా అన్ని వర్గాల వారు ఎదురేగి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. రంగనాథుని దర్శించిన రామానుజులకు ఎంత ఆనందం కలిగిందో, యామునాచార్యుల అస్తమయమప్పుడు తనను దర్శించకుండా అలిగి వెళ్లిన రామానుజుడు ఇలా రావడంతో రంగనాథుడు అంతకంటే ఉబ్బితబ్బిబ్బయ్యారనవచ్చు. తాను రంగనాథుని సన్నిధికి చేరేందుకు సంధాత,గురూత్తములు మహాపూర్ణులన్న భావనతో సాష్టాంగ దండప్రమాణాలు చేసిన రామానుజులతో ‘వత్సా! నీవు సామాన్యుడవు కావు. ఈ కలియుగంలో అజ్ఞానాంధకారంలో కన్నుగానక కొట్టుమిట్టాడున్న జనసమూహ ఉద్ధరణకు అవతరించిన మహనీయుడవు’అని ఆశీర్వదించారు. ‘మీరు నాపై ఉంచిన ఈ మహాభారాన్ని మీ దివ్యాశీస్సులతో నెరవేర్చేందుకు శక్తిమేరకు పాటుపడతాను’అని సవినయంగా విన్నవించారు యతిపతి.
అర్చనా విధానం
శ్రీరంగంలో రంగనాథుని నిత్యార్చనలు,ఉత్సవాలు ఆగమ శాస్త్రానుసారం సక్రమంగా,సజావుగా సాగేందుకు రామానుజులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ నిర్వహణాధికారిగా అకలంగుడనే చోళ సామంతరాజును నియమించారు. సమాజంలోని అన్ని వర్గాల అర్హత, సామర్థ్యాలు, వ్యక్తిగత ఇష్టాలు, ఆసక్తికి అనుగుణంగా భగవతారాధనకు ఏర్పాట్లు చేశారు. అర్చకులు, వేదపారాయణ ఘనాపాఠీలు, స్వామివారికి తిరుమంజనం సమర్పకులు, తీర్థం తెచ్చేవారు,మాలాకారులు, వాద్యకారులు, వాహన సేవకులు, ఊరేగింపుల్లో కాగడాలు, గొడుగు పట్టేవారు,చామర సేవికలు ఇలా…దేవదేవేరీల ఉత్సవాలకు సంబంధించి సేవలకు సర్వ ఏర్పాట్లు చేశారు.శిథిలావస్థలో ఉన్న ఆలయ గోడలను బాగు చేయించారు.జీర్ణాలయాల కారణంగా సమాజం శోభించదని హితవు పలికారు. ఆలయం చుట్టూ పూలతోటల పెంపకం చేపట్టారు. రంగనాథుడిని దర్శించే భక్తులు రామానుజనులనూ ఆయనతో సమానంగా గౌరవించే వారు. ఆయన కూడా తరతమ భేదభావాలు లేకుండా భక్తులకు జ్ఞానబోధచేసేవారు. అయితే ఆయన ఉన్నతాశయాలు, నియమపాలన కొందరు అర్చకులకు నచ్చ లేదు. కంచి నుంచి వచ్చి అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటున్నారనే ఆగ్రహంతో విషప్రయోగంతో వదిలించుకోవాలనేంత వరకు వెళ్లారు.ఇలాంటి దాష్టీకాలు గతంలోనూ అనుభవమే కావడంతో భయపడలేదు. అనుకున్నది సాధించడమే తప్ప వెనుతిరగడం తెలియని రామానుజ అలాంటి విషమ పరిస్థితులను అధిగమించారు. ఆయన ప్రవేశపెట్టిన అర్చన విధానం 1311వ సంవత్సరం వరకు నిరంతరంగా కొనసాగిందని అప్పటి శాసనాలనుబట్టి తెలుస్తోంది. ఈస్టిండియా కంపెనీ హయాంలో పాలకమండలి ఏర్పాటైంది. (వ్యాస రచయిత ప్రముఖ జర్నలిస్ట్)