సీఎం రేవంత్ గారూ…ఇది మా కాలనీ ముచ్చట

Date:

జాలేస్తే ఆదుకోండి… లేదంటే నవ్వుకుని వదిలెయ్యండి
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

ముఖ్యమంత్రి గారు… తక్కువ ధరకు వచ్చాయన్న ఆశతో ఫ్లాట్స్ కొన్న మాకు అది దురాశ అయ్యిందని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మేము కూడా మునిసిపాలిటీలో భాగమేనని అనుకున్నప్పటికీ కాదని అవగతమవుతోంది. అందరిలాగే గడిచిన మూడేళ్ళుగా ఆస్తి పన్ను కడుతున్నాము కాబట్టి మునిసిపల్ అధికారులు మేము అడగక్కరలేకుండానే మాకు సకల కాదు కాదు కనీస సౌకర్యాలు సమకూరుస్తారన్న మా ఆశ పేరాశ అయ్యిందని ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. హెచ్.ఎం.డి.ఏ. లే అవుట్, రేరా అనుమతులు ఉన్నాయన్న బోర్డులు చూసి మేము కట్టుకున్న ఆశల సౌధాలు, మేము నడవడానికి కూడా వీలు లేకుండా వర్షపు నీటిలో మునిగిపోయిన రోడ్లపై, కొనఊపిరితో తేలియాడుతున్నాయి. పెద్ద పెద్ద కార్లలో తిరిగే అధికారులకు, మా ప్రతినిధులం అని చెప్పుకునే రాజకీయ నాయకులకు అవి కనిపించవు. వారికి మేము కేవలం వోటర్లము మాత్రమే. ఎన్నికలు వచ్చినప్పుడు గుర్తుకు వస్తాము. అప్పుడు మాత్రమే వారు మా దగ్గరకు వస్తారు. లేదా జాతీయ పండగలకు మేము పిలిస్తేనే వస్తారు. పైపై మాటలతో మా చేత చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోతారు.

అనుమతులిస్తారు… విస్మరిస్తారు

హెచ్.ఎం.డి.ఏ., రేరా అధికారులకు ఆ బోర్డులు పెట్టుకోవడానికి అనుమతించిన సందర్భం అస్సలు గుర్తుకు రాదు. అక్కడితో వారి పని అయిపోయినట్టే. ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చే సందర్భంలో మాత్రం… ఆ అపార్ట్మెంట్ ముందు రోడ్డు ఉందా అని చూస్తారు తప్ప, దాని నాణ్యత పట్టదు. పేడతో కళ్ళాపి జల్లినట్టు, కాంక్రీటు వాహనంతో తమ బిల్డింగ్ ముందు సగం చల్లేసిన సంగతి వారు గుర్తించరు. ఇరవై ఐదు శాతం కామన్ ఏరియా సూత్రం కచ్చితంగా పాటించారా లేదా గమనిస్తారు. ఎందుకంటే అది వినియోగదారునికి ఏమాత్రం ఉపయోగం లేదు కాబట్టి. ఏ బిల్డింగు ఆవరణలోనూ పచ్చదనం కనిపించదు. ఓ.సి. వచ్చిన తరవాత ముందు ఉన్న పచ్చదనం కనుమరుగవుతుంది. ఆ స్థానంలో చాలీచాలని పార్కింగును భర్తీ చేయడానికి రేకుల షెడ్లు వెలుస్తాయి. టి.డి.ఆర్. పేరిట ఒక అంతస్తు ఎక్కువ కట్టుకోవడానికి అనుమతిచ్చిన మునిసిపల్ అధికారులకు దీనివల్ల ఎలాంటి ఇబ్బందీ లేకపోవడమే దీనికి కారణం. ఇది కొనుగోలుదారులకు అసౌకర్యం. కారణం కొన్ని అంశాలపైనా వారికి అవగాహన లేకపోవడం.

మేము కడుతున్న పన్నులు ఎక్కడికి పోతున్నాయి? ఇదొక సమాధానంలేని ప్రశ్న. బిల్డర్ల కాసులకు కక్కుర్తి పడే వ్యవస్థ ఉన్నంతవరకూ ఎవరికీ న్యాయం జరగదు. కానీ అమాయకుడైన ఓటరును చిన్ని చిన్ని పనులతో తమవైపు ఉండేలా చూసుకుంటారు వారు. ఇబ్బందులు చెప్పడానికి వెడితే… అక్కడ నిన్నెవరు కొనుక్కోమన్నారు అంటూ దురుసుగా ప్రశ్నిస్తారు. అదేమిటి అని అడిగితే… నువ్వు చదువుకోలేదా ఉద్యోగం కూడా చేస్తున్నావుగా అంటూ నిలదీస్తారు.

వర్షాకాలంలోనూ గొంతెండుతోందన్నా…

మిషన్ భగీరథ పథకం రద్దు కొత్త కాలనీలకు నీళ్లు ఇవ్వడానికి అడ్డుకట్ట వేసింది. అయ్యా వర్షాకాలంలో కూడా ట్యాంకర్ల నీళ్లు కొనుగోలు చేసుకోవలసి వస్తోంది… గుక్కెడు నీళ్లు రావడానికి నీటి సరఫరా చెయ్యండి మహాప్రభో అని అధికారుల పాదాల ముందు మోకరిల్లి అడిగినా ప్రొసీజర్ అంటే పధ్ధతి ప్రకారమే చేస్తామంటారు సంబంధిత అధికారులు. మా సమస్య తీరేదెలా? రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానానికి మొరపెట్టుకున్నప్పటికీ ఆ విజ్ఞాపన పత్రం సంబంధిత విభాగానికి చేరుతుంది. అయ్యా మా సమస్య ఎంత వరకూ వచ్చిందని అడిగితే… మీరు ఎవరికి రాసుకున్నా పని చేయాల్సింది మేమే… మీరు మా కాళ్ళ దగ్గరకు రావాల్సిందే అంటూ సంబంధిత విభాగం వ్యంగ్యాస్త్రాన్ని సాధిస్తుంది.

భూగర్భ జలాలను పీల్చేస్తున్నా గేటెడ్ కమ్యూనిటీలు

రెండు వైపులా ఉన్న రెండు రాకాసుల్లాంటి గేటెడ్ కమ్యూనిటీలు వాటికి దిగువన ఉన్న మా కాలనీ భూగర్భ జలాలను కసితీరా పీల్చేస్తున్నాయి. ఆఖరుకు అక్కడి నుంచి జాలువారే వర్షపు నీరు, మురికి నీరు మాకు తులసి తీర్థాలు అవుతున్నాయి. మా కాలనీకి ఉన్నంత మంచి రోడ్లు మరే కాలనీకి ఉండవు. కారులో వెడుతుంటే అవి పిల్లలకు ఉయ్యాలలు ఊపుతాయి. గర్భిణులకు సుఖప్రసవం చేసేస్తాయి. మా రోడ్లు మేమే వేసుకుందామంటే, లోపల జరుగుతున్న నిర్మాణాలు అడ్డుపడుతున్నాయి. అడిగితే అమ్మయినా పెట్టదనే సామెత గుర్తుతెచ్చుకుని మా విన్నపం సమర్పిస్తే డబ్బులేడున్నాయ్ అనేది ఒకరు… వాటర్ లైన్లు వెయ్యకుండా రోడ్లెయ్యం అనేది ఒకరు… నిధులే లేవని చేతులెత్తేసేది మరొకరు. ఈ ముగ్గురి మధ్య మా కాలనీ లాంటి అనేక కాలనీలు నలిగిపోతున్నాయి. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం కన్నీటి తుడుపుగా రెండు వీధి దీపాలో… రెండు తట్టల మట్టో పడేసి పోతారు. బిల్డర్లు రోడ్లెయ్యాలంటారు తప్ప… వారు ఎలా వాటిని వేసారో చూడరు. డ్రైనేజీ అంశంలో మా బిల్డర్లు ముందుకు వచ్చారు కాబట్టి మాకు ఆ సమస్య లేకపోయింది. లేకుంటే బోర్లలో ఇంకిన మురుగునీరు మాకు దిక్కయ్యేది.

పన్నులు కడుతున్నప్పటికీ…

మీకు ఏదైనా పని చెయ్యడానికి మాకు మీ కాలనీ నుంచి పన్నులే రావట్లేదు అన్న ఒక పెద్ద మనిషి ఇప్పుడు అయిపు అజా లేరు. ఎందుకంటే మేము మూడేళ్ళ నుంచి క్రమం తప్పకుండా ఆస్తి పన్ను కడుతున్నాం కాబట్టి. ఇప్పుడు వెళ్లి అడుగుదామంటే, ఆయన ఏమంటారోనని భయం. బయటకు వెళ్లాలంటే ఎక్కడ జారి పడతామోననే భయం. చీకటిలో ఏ పురుగు కుడుతుందోననే భీతి. పిల్లలకు ఆడుకునే పార్కు కూడా లేదు. వర్షం కురిస్తే అక్కడ కూడా నీళ్ళే. నీరు పల్లమెరుగు అనే సామెత మాకు వర్తించదు. దీనికి కారణం పక్క కాలనీలు. వర్షం నీరు కూడా పల్లంలో ఉన్న ఆ కాలనీకి రాకూడదు అనేది వారి ఆంక్ష. ఒకసారి వచ్చిందని మా కాలనీలోకి వచ్చి మ్యాన్ హోల్స్ పగులగొట్టారు.

అతి చిన్న బిల్డర్ ఒకరు, పెద్ద బిల్డర్ ఒకరు తమ నిర్మాణాల ముందు చక్కని రోడ్డు పూర్తిగా నిర్మించుకున్నారు. పెద్ద సంఖ్యలో భవనాలు కట్టిన వారు కళ్ళాపి జల్లినట్టు కాంక్రీట్ వేశారు. కొందరు తమ ఫ్లాట్స్ అమ్ముడుపోవడానికి పక్క రోడ్లు వేశారు. ఆ ఒక్క వీధి తప్ప మిగిలిన రోడ్లన్నీ దుర్భరంగానే ఉన్నాయి.

ఇది మా కాలనీ దుస్థితి. గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులంతా ఇప్పుడు మీ పార్టీలో చేరిపోయారు. పాపం అధికారులు మాత్రం ఏం చేయగలరు? వారి ఆదేశాలను పాటించడం తప్ప? మీ పార్టీలోకి గెంతిన నాయకులకు మీరైనా చెప్పి మా లాంటి కాలనీలను ఆదుకుంటారని ఆశిస్తున్నాం.

మాకు ఒనగూరిన మేలు ఏదైనా ఉందంటే…. పార్కులో వేసిన హై మాస్ట్ దీపం ఒక్కటే. ఇదొక్కటే కాలనీలో వెలుగులు విరజిమ్ముతోంది. ఇందుకు మా మునిసిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారికి కృతజ్ఞులం. వీధి దీపాలు ఎప్పుడు వెలుగుతాయో తెలీదు. పూర్తిగా లైట్లు లేవంటే మున్సిపాలిటీలో దీపాల స్టాక్ లేదంటారు.

ఇట్లు
శిల్ప విలేజ్ కాలనీ వాసులు
, అమీన్ పూర్

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

AGOMONI: A Rising Socio-Cultural Force in Suncity

(Dr Shankar Chatterjee) Agomoni Cultural Association established itself as a significant...

First Alumni Meet at a Engineering College in Telangana

Kshatriya College of Engineering (KCEA), Nizamabad District (Dr Shankar...

స్వామి పులకరింత భక్తుని కంట…

ఏడుకొండల స్వామి అనుగ్రహ ఫలితం(డాక్టర్ వైజయంతి పురాణపండ)ఏమయ్యోయ్‌! నిన్నే! పిలిస్తే పలకవేం! ఏమయ్యోయ్‌...

Nations have permanent interests not enemies or friends

India should not expect too much from Trump (Dr Pentapati...