జీ.కె. వెంకటే(శ్)ష్ పాట
—- గజలియత్ పాట —
(రోచిష్మాన్, 9444012279)
1963లో వచ్చిన కన్నడం సినిమా కులవధు. కులవధు సినిమాలోని పాట “ఒలవిన ప్రియ లతే అవళదే చింతే…”
ఈ పాట ఒక గజలియత్ పాట; అంటే సంగీతం పరంగా గజల్ తనం ఉన్న పాట.
దక్షిణాది సినిమాలో 1960వ దశాబ్ది నుంచి గజలియత్ పాటలు మొదలయ్యాయి. తొలిగా కె.వీ. మహాదేవన్ (మహదేవన్ కాదు) దక్షిణాదిలో
తమిళ్ష్‌లో గజలియత్ పాట చేశారు. తరువాత విశ్వనాద(థ)న్, రాజన్-నాగేంద్ర, బీ. శంకర్, జీ.కె. వెంకటేష్, ఎమ్.ఎస్. శ్రీరాం, ఇళైయరాజా (ఇళయరాజా కాదు), విద్యాసాగర్, వంటి సంగీత దర్శకులు గజలీయత్ పాటలు చేశారు.
తెలుగు వ్యక్తులైన పీ.బీ. శ్రీనివాస్, జీ.కె. వెంకటేష్ ఇద్దరికీ గజల్ సంగీతంపై ఇతర తెలుగువాళ్ల కన్నా సరైన, మేలైన అవగాహన ఉంది. మేలైన అవగాహనతో కన్నడంలో వచ్చిన గజలియత్ పాట ఈ “ఒలవిన ప్రియ లతే అవళదే చింతే…”
విలంబం, సాంద్రత, బిగి, పొంకం ఇవి గజల్ తరహా సంగీతంలో ప్రధానంగా ఉండాల్సినవి. ఈ “ఒలవిన ప్రియ లతే అవళదే చింతే…” పాటలో అవి చక్కగా అమరాయి. విలంబం, బిగి, musical gap, balance, స్వర సమం ఈ పాటలో నెలకొన్నాయి. ఈమని శంకరశాస్త్రి వీణా వాదనలో, షహిన్‌షాహ్-ఎ-గజల్ గాయ్‌కీ మెహ్‌దీహసన్ (షెహన్ షా కాదు)గానంలో, రఫీ గానంలో, లతా మంగేష్కర్ గానంలో ఈ అంశాలు మేలుగా కొలువుతీరి ఉంటాయి.
మిశ్ర శుద్ధధన్యాసి రాగంలో ఈ పాట ఉందని అనిపిస్తోంది. ఈ పాట రాగం ఖమాజ్ అని నెట్లో AI చూసిస్తోంది. నెట్ ఆధారంగా నన్ను తప్పుపడతారా? వద్దు.. వద్దొద్దు… మీ ఎఱుకతో నన్ను తప్పుపడితే నన్ను నేను దిద్దుకుంటాను అని మాట ఇస్తున్నాను.
గొప్ప బాణికి మేలైన వాద్య సంగీతం చేశారు జీ.కె. వెంకటేష్. రుద్రవీణ(?)ను చాల గొప్పగా వాడారు. Leading notes, reliefs, bridge passages వీటితో ఈ పాట ఉన్నతంగా ఉంటుంది. జీ.కె. వెంకటేష్ ప్రజ్ఞకు ఈ పాట ఒక మచ్చుతునక!
తెలుగువారైన జీ.కె. వెంకటేష్ తెలుగులో మాత్రం ఎందుకు రాణించలేదు? తెలుగు అభిజ్ఞత, రసజ్ఞతా మేధ ఘంటసాల, పెండ్యాల దగ్గరే ఆగిపోయి, ఇరుక్కుపోయి ఉన్నందుకా? (ఇంకా కూడా అదే పరిస్థితి కదా?)
తెలుగు పరిధిని దాటిన సంగీత మేధ ఉన్నవారు జీ.కె. వెంకటేష్. కన్నడంలో ఎన్నో గొప్ప పాటలు చేశారు ఆయన. ఒక ప్రత్యేకమైన శైలిలో ప్రశస్తమైన పాటలు చేశారు జీ .కె. వెంకటేష్. అంత ఇళైయరాజా కూడా జీ.కె.వీ. ప్రభావితుడే.
తన ఆత్మీయురాలైన ఆమె దూరమైపోయిన సందర్భంలో అతడు శోకంతో పాడుకునే పాట ఇది. కన్నడం తెలియని వాళ్లకు కూడా, ఏ దేశం వాళ్లకైనా కూడా ఇది ఒక శోకగీతం అని అవగతం అయ్యే పాట. సంగీతం, గానం అంత గొప్పగా ఉన్నాయి ఈ పాటలో.
Mood-perfection, modulation-excellence,
clear voice resonance, rounded even voice, rounded even singing, balance, స్వర సమం ఈ జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పీ.బీ. శ్రీనివాస్ గొప్పగా పాడారు.
బాగా పాడడం, భావంతో పాడడం అన్నవి మౌలికమైన అంశాలు. దక్షిణాది గాయకులు ఈ మౌలికమైన అంశాల దగ్గరే కొట్టుమిట్టాడుతున్న 60వ దశాబ్దిలో దక్షిణాదిలో ఆ జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పీ.బీ. శ్రీనివాస్ ఈ పాటను పాడారు. ముఖ్యంగా ఈ పాట ఒక mood- personfication.
(ఈ పాటలో రాజ్‌కుమార్ అభినయం మరో గొప్ప విశేషం)
ఇరు తెలుగు కళాకారుల విశేషమైన సంగీతజ్ఞతతో సాకారమైన గొప్ప కన్నడం పాట ఇది.
వినండి…

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

