అన్నమయ్య అన్నది-32
(రోచిష్మాన్, 9444012279
“ఒక్కఁడే మోక్షకర్త వొక్కటే శరణాగతి
దిక్కని హరిఁ గొల్చి బదికిరి తొంటివారు”
ఒక్కడే మోక్షానికి కర్త లేదా మోక్షమివ్వగలిగే వాడు; ఒక్కటే శరణాగతి. నువ్వే దిక్కు అని హరిని కొలిచి బతికారు ముందటి వారు లేదా పూర్వులు అంటూ సరైన విషయాన్ని చెప్పేందుకు ఈ సంకీర్తనను సమకూర్చారు అన్నమయ్య.
“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ / అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచః” అని భగవద్గీత (అధ్యాయం 18 శ్లోకం 66) ఉవాచ. అంటే వివేకమంతా లేదా పాండిత్యమంతా లేదా వేదవిద్య అంతా (సర్వ ధర్మాన్) వదిలెయ్యదగినది (పరిత్యజ్య); నన్ను ఒక్కడినే (మామేకం) శరణు పొండానికి రా (శరణం వ్రజ); నేను (అహం) నిన్ను (త్వా) పాపాలన్నిటి నుంచీ (సర్వపాపేభ్యః) విడిపిస్తాను (మోక్ష యిష్యామి); దుఃఖించకు (మా శుచః) అని అర్థం. ఈ శ్లోకం కొంత దోషాన్వయంతో చలామణిలో ఉంది. ఇక్కడ చెప్పుకున్న ఈ సరైన అర్థమే ఒక్కడే మోక్షానికి కర్త అనీ, ఒక్కటే శరణాగతి అనీ అన్నమయ్య చేత పునరుద్ఘాటింపజేసింది.
ఒక్కడే మోక్షానికి కర్త ఒక్కటే శరణాగతి అని అన్నమయ్య చెప్పడానికి మఱో భగవద్గీత (అధ్యాయం 9 18వ) శ్లోకం కూడా కారణం అయింది. అది: “గతిర్భక్తా ప్రభుస్సాక్షీ నివాస శ్శరణం సుహృత్ / ప్రభవః ప్రళయస్స్థానం నిధానం బీజ మవ్యయం” అంటే చలనం, భరించేవాడూ, ప్రభువు, సాక్షి, నివాసం, మిత్రుడు, ఉత్పత్తికి కారణం, చోటు, ప్రళయం, సొమ్ము, శాశ్వతమైన హేతువు నేనే (పరమాత్మే) అని అర్థం.
“నానా దేవతలున్నారు నానా లోకములున్నవి
నానా వ్రతాలున్నవి నడిచేటివి
జ్ఞానికిఁ గామ్య కర్మాలు జరిపి పొందేదేమి
అనుకొన్న వేదోక్తాలైనా మాయఁ గాక”
ఎందఱో దేవతలు ఉన్నారు, ఎన్నో లోకాలు (అంటే 14 లోకాలు) ఉన్నాయి, చాల వ్రతాలు ఉన్నాయి జరుగుతున్నాయి; జ్ఞాని అయిన వాడు కామ్య కర్మలు (కామ్య కర్మలు అంటే స్వర్గం కోసం, వాంఛలు నెరవేరడం కోసం చేసే కర్మలు లేదా పనులు) చేసి పొందేదేమిటి? చెప్పుకొనే (అనుకొన్న) వేదాల మాటలు కూడా మాయ కాకపోతే (మాయే కాక) అని అంటున్నారు అన్నమయ్య.
భగవద్గీత(అధ్యాయం 2 శ్లోకం 45)లో ఇలా ప్రవచించబడింది: “త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో …”. అంటే వేదాలు కర్మలకు చెందిన (సత్వ , రజో, తమో) మూడు గుణాల విషయాలతోనూ ఉండేవి అని అర్థం. అన్నమయ్య ఈ భగవద్గీత విషయాన్నే ఇక్కడ చెబుతున్నారు.
“ఒకడు దప్పికిఁ ద్రావు వొక్కఁడు కడవ నించు
ఒక్కఁడీఁదులాడు మడు గొక్కటి యందే
చక్క జ్ఞానియైన వాఁడు సారార్థము వేదమందు
తక్కక చేకొనుఁగాక తలకెత్తుకొనునా”
ఒకడు దాహానికి తాగుతాడు, ఒకడు కడవ నింపుకుంటాడు ఒకడు ఈదుతాడు ఒకే నీటిమడుగులో. చక్కని జ్ఞాని అయిన వాడు శ్రేష్ఠమైన విషయాన్ని (సారార్థము) వేదం నుంచి
తప్పక (తక్కక) స్వీకరిస్తాడు (చేకొను) తప్పితే (కాక) నెత్తిన వేసుకొంటాడా? అని అన్నమయ్య అంటున్నారు.
కర్మలకు చెందిన (సత్వ , రజో, తమో) మూడు గుణాల విషయాలతోనూ ఉండే వేదంలో గ్రహించాల్సిన శ్రేష్ఠమైన విషయం ఏమిటి? భగవద్గీత (అధ్యాయం 2 శ్లోకం 45)లోనే “నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్” అనీ ప్రవచించబడింది. అంటే నువ్వు ఈ మూడు గుణాలు లేనివాడివిగానూ, ద్వంద్వాలు లేని వాడివిగానూ, నిత్య సత్వ స్థితి కలవాడివిగానూ, యోగ క్షేమాలు లేని వాడివిగానూ ఆత్మ (అంటే ఆత్మజ్ఞానం) కలవాడివిగానూ ఉండు అని అర్థం. స్వీకరించాల్సిన వేద సారార్థం ఇదే.
“ఇది భగవద్గీతార్థ మిది యర్జునుని తోను
ఎదుటనే వుపదేశ మిచ్చెఁ గృష్ణుఁడు,
వెదకి వినరో శ్రీ వేంకటేశు దాసులాల
బ్రదుకుఁద్రోవ మనకు పాటించి చేకొనరో”
ఇది భగవద్గీతలోని అర్థం; అర్జునుడికి కృష్ణుడు ఎదురుగా ఉపదేశించాడు. శ్రీ వేంకటేశ్వరుని దాసుల్లారా, తెలుసుకొని వినండి. ఇదే బతుకు తోవ మనకు. దానిని అనుసరించి స్వీకరించండి అంటూ సంకీర్తనను ముగించారు అన్నమయ్య.
ఈ సంకీర్తన పల్లవి, రెండు చరణాల్లో అన్నమయ్య చెప్పినది కృషుడు అర్జునుడికి భగవద్గీతలో చెప్పినది. దీన్ని తెలుసుకొని ఆ చెప్పిన దాన్ని వినండి; ఎందుకంటే ఇదే బతుకు తోవ కాబట్టి అని చాల గొప్పగా చెప్పారు అన్నమయ్య.
“గీతాశాస్త్ర మిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ / విష్ణోః పద మవాప్నోతి భయ శోకాది వర్జితః” అని మహాభారతంలో చెప్పబడ్డది. అంటే ఈ గీతాశాస్త్రం పుణ్యకరమైనది. దీన్ని ఎవరు ప్రయత్నించి చదువుతారో వారు భయ, శోకాలు లేని విష్ణుపథాన్ని పొందుతారు అని అర్థం. అక్కడ ప్రయత్నించి అని చెప్పనట్టుగానే అన్నమయ్య కూడా ఇక్కడ వెతికి వినండి అని అన్నారు.
భగవద్గీత అంటే భగవంతుడి గీతం అని తప్పుడు అర్థం చలామణిలో ఉంది. భగవద్గీతను ‘Song Cestial’ అనే Edwin Arnold వంటి వారు అంతర్జాతీయంగా రాశారు. అది సరి కాదు. గీత అన్న పదానికి ‘ఆధ్యాత్మిక విషయమై ప్రశ్న జవాబుల రూపంలో ఉండే గ్రంథం’ అని అర్థం. ప్రశ్న జవాబుల రూపంలో ఆధ్యాత్మిక విషయంగా ఉన్న గ్రంథాలు ఉన్నాయి. అష్టావక్రగీత, అవధూతగీత, వశిష్టగీత, బుధగీత, రామగీత, శివగీత, వ్యాసగీత ఇలా 30కి పైగా గీతలు ఉన్నాయి. భగవద్గీతలోనే (అధ్యాయం 18 శ్లోకం 70)లో ఇలా ఉంది: ” అధ్యేష్యతే చ యం ఇమం ధర్మ్యం సంవాద మావయోః” అంటే ధర్మం తప్పని మన ఇద్దఱి ఈ సంవాదం… అని అర్థం. గమనించండి అక్కడ సంవాదం (పరస్పర సంభాషణ లేదా చర్చ) అనే చెప్పబడింది. మహాభారతంలో ఇది భగవద్గీత అని లేదు. తరువాతి కాలంలో కృష్ణ భగవానుడి గీత కాబట్టి భగవద్గీత అయి స్థిరపడింది. విశ్వంలోనే అద్వితీయమైన, అత్యున్నతమైన ఒక పాఠం అయింది భగవద్గీత.
భగవద్గీతలోని విషయాన్ని పునరుద్ఘాటిస్తూ భగవద్విషయమై మనకు భవ్యమైన ఆలోచనను, సూచనను, బోధనను ఇస్తూ భాసిల్లుతూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

