అన్నమయ్య అన్నది -24
(రోచిష్మాన్, 9444012279)
“ఇతరుల దూఱనేల యెవ్వరూ నేమి సేతురు
మతి వారూఁ దమ వంటి మనుజులే కాక”
ఇతరుల్ని నిందించడం ఎందుకు? ఎవరేం చేస్తారు? తలపు పరంగా (మతి) వాళ్లూ తమ వంటి మనుషులే కదా? అంటూ సార్వజనీనమైన, సార్వకాలికమైన, ఒక మేలైన సంకీర్తనను మన మెదళ్లకు, మనసులకు అందించారు అన్నమయ్య.
చైనీస్ కవి, తాత్త్వికుడు లావ్ – చు (Lao -Tzu) “నువ్వు మఱొకర్ని నిందిస్తూంటే ఆ నిందించడానికి ముగింపు అన్నదే ఉండదు” అని చెప్పారు. అన్నమయ్య ఇలా పల్లవించాక మన మంచి, చెడులకు ఇతరులు కారణం కాదు అన్న తెలివిడినిస్తున్నారు ఇదిగో …
“చేరి మేలు సేయఁ గీడు సేయ నెవ్వరు గర్తలు
ధారుణిలో నరులకు దైవమే కాక
సారెఁ దన వెంట వెంటఁ జనుదెంచే వారెవ్వరు
బోరునఁ జేసిన పాప పుణ్యాలే కాక”
దగ్గరై (చేరి) మేలును, కీడును చెయ్యడానికి ఎవరు కర్తలు? ధరిణిలోని మనుషులకు దైవమే కాకపోతే; పోయే (సారె) తన వెంట వచ్చే (చునుదెంచే) వారెవరు? ఎక్కువగా చేసిన పాప పుణ్యాలే కాకపోతే అంటూ మనకు జరిగే మంచి చెడులకు దైవమే కారణం అనీ, మనం పోయేడప్పుడు మన పాపపుణ్యాలు మాత్రమే మనతో వచ్చేవి అనీ అన్నమయ్య మనకు అవగాహననిస్తున్నారు; మనం అవగతం చేసుకోవాలి.
మనిషిని తెప్పరిల్లే స్థితిలోకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు అన్నమయ్య ఈ సంకీర్తనతో. మనిషికి సాంత్వనను, శాంతిని ఇచ్చేందుకే అన్నమయ్య ఈ మాటలు చెప్పారు. చాల విలువైన చింతనను పొలుపుగా అందించారు అన్నమయ్య.
“తొడఁగి పొగడించాను దూషించా ముఖ్యులెవ్వరు
గుడికొన్న తనలోని గుణాలే కాక
కడుఁగీర్తి నపకీర్తి గట్టెడి వారెవ్వరు
నడచేటి తన వర్తనములే కాక”
మొదలుపెట్టి (తొగఁడి) పొగడడానికీ దూషించడానికీ ముఖ్యమైన వాళ్లు ఎవరు? కమ్ముకొన్న (గుడికొన్న) తనలోని గుణాలే కాకపోతే; అత్యంత కీర్తిని, అపకీర్తిని కలిగించే వారెవరు? సాగే (నడచేటి)తన ప్రవర్తనే కాకపోతే అంటూ మనల్ని మార్చగలిగే ఎంతో మంచి విషయాన్ని మహోన్నతంగా చెప్పారు మహనీయులు అన్నమయ్య.
పూనుకుని పొగడడానికి, దూషించడానికి ముఖ్యమైన వాళ్లేవరూ లేరు; ‘మన గుణాలవల్లే మనకు పొగడ్తలు, తెగడ్తలు వస్తాయి’ అని తెలియజెబుతున్నారు అన్నమయ్య. ఈ తెలివిడి మనుషులకు తప్పకుండా రావాలి, కావాలి. ‘మనకు అత్యంత కీర్తినో, అపకీర్తినో కలిగించేది మన ప్రవర్తనే తప్ప మఱొకరు కాదు’. ఈ సత్యాన్ని సరళంగానూ, సూటిగానూ చెబుతున్నారు అన్నమయ్య.
“ఘనబంధ మోక్షాలకుఁ గారణ మిఁక నెవ్వరు
ననిచిన జ్ఞానాజ్ఞానములే కాక
తనకు శ్రీవేంకటేశుఁ దలపించే వారెవ్వరు
కొనమొద లెఱిఁగిన గురుఁడే కాక”
దృఢమైన బంధాలకూ, విముక్తికీ కారణం ఇంకెవరు? కలిగిన (ననిచిన) జ్ఞాన, అజ్ఞానాలే కాకపోతే; ఒక వ్యక్తికి పరమాత్మను (శ్రీవేంకటేశు) తలపించే వారెవరు? ఆది అంతాలు తెలిసిన గురువే కాకపోతే అంటూ మనం సదా మననం చేసుకోవాల్సిన ఎఱుకను మిన్నగా చెప్పారు అన్నమయ్య.
అజ్ఞానం బంధనం; జ్ఞానం విముక్తినిస్తుంది. ఆదిశంకరాచార్య ఆత్మబోధ (శ్లోకం 2)లో “జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి” అని తెలియజెప్పారు. అంటే జ్ఞానంవల్ల తప్పితే మోక్షం సిద్ధించదు అని అర్థం. “దేహస్య మోక్షో నో మోక్షో న దండస్య కమండలోః / అవిద్యా హృదయ గ్రంథి మోక్షో మోక్షో యతస్తతః” అని భాగవతంలో చెప్పబడ్డది. అంటే దేహం నశించడమే మోక్షం కాదు; దండాన్నీ , కమండలాన్నీ త్యజించడమూ మోక్షం కాదు. అవిద్య అనే హృదయ గ్రంథి నుంచి విముక్తమవడమే మోక్షం అని అర్థం.
అన్నమయ్య కూడా ఇక్కడ ఆ విషయాన్నే చెబుతున్నారు. ఒక వ్యక్తికి శ్రీవేంకటేశ్వరుణ్ణి అంటే పరమాత్మను తలపుకు తెచ్చేది గురువు మాత్రమే. గురువు అన్న శబ్దంలో ‘గు’ అంటే చీకటి అని, ‘రు’ అంటే వెలుగు అని, చీకటిని పోగొట్టేది గురువు అని వివరణ. “ముక్తిదారి జూపు మూలమ్ము గురుడురా” అనీ, “గురుని గూర్ప ముక్తి కరతలామలకమౌ” అనీ వేమన అన్నారు. ఆది, అంతాలు తెలిసిన గురువు మాత్రమే పరమాత్మను తలలోకి ఎక్కిస్తాడని అన్నమయ్య అమోఘంగా చెప్పారు.
ఒక మనిషి తన జీవితంలోని అశాంతిని పోగొట్టుకోవడానికి ఈ అన్నమయ్య సంకీర్తన ఎంతో అవసరం. ఈ సంకీర్తనను అవగతమూ, ఆకళింపూ చేసుకుంటే మనం మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఇలాంటి సంకీర్తనను మనకిచ్చినందుకు అన్నమయ్యకు మనసులో నమస్కరించుకుని కృతజ్ఞత తెలుపుకుందాం.
మనం ప్రశాంతంగా బతికేందుకై, మన మస్తిష్కాలకు, మనసులకు అవసరమైనదై, ఓ మహితమైన సంకీర్తనై ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

