లోపలకి వెళ్లు…
అన్నమయ్య అన్నది-31
(రోచిష్మాన్, 9444012279)
“వెలుపల వెదికితే వెస నాత్మఁ గనునా
పలుమాఱు నిదే యభ్యాసము గావలెను”
బయట లేదా బాహ్యంలో వేగంగా (వెస) వెతికితే ఆత్మ కనిపిస్తుందా (కనునా)? మాటిమాటికి (పలుమాఱు) ఈ మాటనే (నిదే) వల్లెవేసుకుంటూ ఉండాలి (అభ్యాసము గావలెను) అంటూ సంకీర్తనను అందిస్తున్నారు అన్నమ్మయ్య.
బాహ్యంలో ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు కాబట్టి అదేపనిగా ఆ విషయాన్ని వల్లెవేసుకుంటూ ఉండాలి. ఆత్మ బాహ్యంలో ఉందని, ఉంటుందని భ్రమిస్తూ వృథా ప్రయత్నాలు చేస్తూ విఫలం అయిపోకూడదు.
భగవంతుణ్ణి అంతర్యామి అంటారు. అంతర్యామి అంటే లోపల ఉన్నవాడు అని అర్థం. తమిళ్ష్ భాషలో భగవంతుణ్ణి “కడవుళ్” అంటారు. కడవుళ్ అంటే (కడ= వెళ్లు, ఉళ్ = లోపల) లోపలికి వెళ్లు అని అర్థం. భగవంతుడి కోసం తిరగాల్సింది, వెతకాల్సింది, బయట కాదు; భగవంతుడి కోసం మనం మనలోకి వెళ్లాలి.
“నేను నా టెలస్కోప్(telescope)తో స్వర్గాలను గాలించాను కానీ భగవంతుణ్ణి కనుక్కోలేదు” అని లలన్ద్ (Lalande 1732-1807) అన్న ఫ్రెంఛ్ ఖగోళ శాస్త్రవేత్త చెప్పిన మాటను ఉటంకిస్తూ బ్రిటిష్ ఆధ్యాత్మిక రచయిత పోల్ బ్రంటన్ (Paul Brunton 1898-1981) ఇలా అంటాడు: “టెలస్కోప్‌ను పక్కన పెట్టి లలన్ద్ తన మనసును నిశ్చలం చేసుకుని ఉండాల్సింది. అక్కడ భగవంతుడు కనుక్కోబడేవాడు”. పోల్ బ్రంటన్ సరిగ్గా చెప్పాడు.
“ఇన్ని చింతలు మఱచి యింద్రియాలఁ గుదియించి
పన్ని యుండిన హృదయ పద్మమందును
ఎన్న నంగుష్ఠ మాత్రపుటీశ్వరు పాదాల కింద
తన్ను నణుమాత్రముగఁ దలఁచఁగవలెను”
అన్ని చింతలను మఱిచిపోయి ఇంద్రియాల్ని నిగ్రహించి, సిద్ధంగా ఉన్న (పన్ని యుండిన) హృదయ పద్మం లోపల చెప్పాలంటే (ఎన్న) అంగుళం (అంగుష్ఠ) మాత్రమే ఉండే ఈశ్వరుడి పాదాల కింద తనను ఒక అణువుగా తలుచుకుంటూ ఉండాలి (తలఁచగవలెను) అని బోధిస్తున్నారు అన్నమయ్య.
అష్టావక్రగీత (ప్రకరణం 2 శ్లోకం16) ఇలా చెబుతోంది: “ద్వైతమూలమహో దుఃఖం నాన్యత్తస్యాస్తి భేషజమ్” అంటే దుఃఖం ద్వైతానికి మూలకారణం ఆ ద్వైత మూలకారణమైన దుఃఖానికి విరుద్ధమైన మందులేదు అని అర్థం. అందుకే ఇక్కడ ‘చింతలను మఱిచిపోవాలి’ అని అంటున్నారు అన్నమయ్య.
భగవద్గీత (అధ్యాయం 2 శ్లోకాలు 60, 61)లో ఇలా చెప్పబడ్డది: “యతతో హ్యపి కౌంతేయ పురుషస్య వివశ్చితః / ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః”; “తాని సర్వాణి సంయమ్య యుక్త అసీత మత్పరః / వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా” అంటే కుంతీపుత్రా! మోక్షం కోసం ప్రయత్నిస్తున్న వివేకవంతుడి మనసును కూడా కలతపెట్టగలినట్టి ఇంద్రియాలు హరించి వేస్తున్నాయి… కనుక వాటిని నిగ్రహించుకుని తగినవాడివై నన్ను ఆశ్రయించి ఉండాలి; ఎవరి స్వాధీనంలో ఇంద్రియాలు ఉంటాయో వారి జ్ఞానం నిలకడగా ఉంటుంది అని అర్థం. అందుకే ఇంద్రియాలను కుదించాలి అన్నారు అన్నమయ్య.
ఇంద్రియ సాధనవల్ల ఆత్మను తెలుసుకోలేరు అన్న తెలివిడిని ఇస్తూ అష్టావక్రగీత (ప్రకరణం 18 శ్లోకం 35) ఇలా చెబుతోంది: “శుద్ధం బుద్ధం ప్రియం పూర్ణం నిష్ప్రపంచం నిరామయం / ఆత్మానం తం న జానన్తి తత్రాభ్యాస పరా జనాః” అంటే ఆ (ఇంద్రియ సంబంధంగా) అభ్యాస పరులైన జనులు శుద్ధం, జ్ఞానం, ప్రియం, పూర్ణం అయిన, అవిద్యాకల్పితం కానిది, నిర్దోషం అయిన ఆత్మను తెలుసుకోలేరు అని అర్థం.
“అంగుష్ఠ మాత్రః పురుషోऽన్తరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః” అని కఠోపనిషత్ చెప్పింది. అంటే మనుషుల హృదయాలలో పరమాత్మ సర్వదా అంగుష్ఠ మాత్రుడై నివశిస్తాడు అని అర్థం. ఆ మాటనే ఇక్కడ ఉటంకించారు అన్నమయ్య.
“పలుదేహపుఁ గాళ్లఁ బరువులు వారక
బలుదేహపు టింటిలోపల చొచ్చి
చలి వేఁడిఁ బొరలకే సర్వేశు పాదాల కింద
తలకొన్న తన్నుఁ దానే తలఁచఁగవలెను”
పలు దేహాల కాళ్లతో పరుగులెత్తకుండా పలు దేహాల ఇంటి లోపలకు వెళ్లి చలి, వేడి వీటిలో దొల్లకుండా సర్వేశ్వరుడి పాదాల కింద ఉండి (తలకొన్న) తనను తానే తలుచుకుంటూ ఉండాలి అని అంటూ బోధను కొనసాగిస్తున్నారు అన్నమయ్య.
భగవద్గీత (అధ్యాయం 9 శ్లోకం 8)లో “ప్రకృతిం స్వామ వష్టభ్య విసృజామి పునః పునః / భూత గ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృతేర్వశాత్” అని చెప్పబడ్డది అంటే కారణ విశేషాన్ని అనుసరించి ఈ సకల భూత సమూహాలను నేను నాదైన విధానంలో మళ్లీ మళ్లీ సృష్టిస్తున్నాను అని అర్థం. సర్వేశ్వరుడి పాదాల కింద ఉన్నట్టు తనను తానే తలుచుకుంటూ ఉంటే పలుదేహాల కాళ్లతో పరుగులెత్తకుండా పలు దేహాల ఇంటిలోకి వెళ్లి చలి, వేడి వీటిలో దొల్లుతూ ఉండే స్థితి తప్పిపోతుంది; అలా ఉండమని అంటున్నారు అన్నమయ్య.
“కైకొన్న భక్తితో నిక్కపు శరణాగతితో
చేకొని విన్నపములు చేసుకొంటాను
ఏకాంతాన శ్రీ వేంకటేశ్వరు పాదాల కింద
దాకొని తన్నుఁ దానే తలఁచఁగవలెను”
పాటించిన (కైకొన్న) భక్తితో నిజమైన శరణాగతితో పూనుకుని (చేకొని) విన్నపాలు చేసుకుంటూ ఏకాంతంలో శ్రీ వేంకటేశ్వరుడి పాదాల కింద చేరి (దాకొని) తనను తానే తలుచుకుంటూ ఉండాలి అంటూ సంకీర్తనను ముగించారు అన్నమయ్య.
తనను తానే తలుకుంటూ ఉండడం అంటే ‘ఆత్మ విచారం’. ఈ ఆత్మ విచారం చేస్తూ ఉండడం ఒక ఉత్కృష్టమైన స్థితి. రమణ మహర్షి తాను అనుభవించి మనకు సూచించిన గతి అదే. అన్నమయ్య ఈ సంకీర్తనలో ఆత్మ విచారం చేసుకుంటూ ఉండాలని చెబుతున్నారు.
భక్తి ఏకాంతాత్మకం. ఏకాంత భక్తి ఉండాలి. రామానుజులు ఇలా చెప్పారు: “యాః క్రియా స్సంప్రయుక్తా స్స్యురేకాంతగత బుద్ధిభిః / తా స్సర్వా శ్శిరసా దేవః ప్రతి గృహ్ణాతి వై స్వయం” అంటే ఏకాంత భక్తి ఉన్న వాళ్ల చేత ఈశ్వరుడి కోసం ఏ యే క్రియలు సమర్పించబడుతూ ఉన్నాయో వాటి అన్నిటినీ భగవంతుడు శిరస్సుతో అంగీకరిస్తున్నాడు అని అర్థం. ఏకాంతంగానే భగవంతుణ్ణి చేరడానికి వెళ్లాలి.
ఆ భగవంతుణ్ణి తన లోపల వెతకాలి అనీ, ఆత్మ విచారం చేసుకుంటూ ఉండాలి అనీ, ఏకాంత భక్తితో పరమాత్మ పాదాలను చేరాలి అనీ చెబుతూ మనకు ఒక ఉద్బోధ, సద్బోధ అయి ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

