రైలు పట్టాలపై పడుకున్న నాగసూరు వీరరాఘవయ్య
2025 సెప్టెంబర్ 24 ఆయన 143 వ జయంతి
(డా. నాగసూరి వేణుగోపాల్, 9440732392)
బ్రిటిష్ బానిసత్వ సంకెళ్లను తుంచాలని వందేళ్ళ క్రితం ఉవ్వెత్తున లేచిన సమరం, దేశంలోని ప్రతి వ్యక్తినీ కదిలించింది. కనుకనే ఆ ఉద్యమంలో పాల్గొనాలని ఉన్నపళంగా ముందుకు దూకారు, కానీ ఆస్తులు మిగులుచుకోవాలని; తమకు పేరు రావాలని; ఆరోగ్యం, కుటుంబం చితికి పోతాయని వారాలోచించలేదు. కనుకనే మన దేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో నమోదు కాని అజ్ఞాత అమరవీరులెందరో కనబడతారు.
దేశంలోనే గాంధీజీ సూత్రాలతో 1921సం.ఏప్రిల్ 7న మొదలైన రెండవ ఆశ్రమం ‘పినాకినీ ఆశ్రమం’. తద్వారా తెలుగు ప్రాంతానికి గాంధేయ ఉద్యమానికి ఒక వెలుగు ద్వారంగా నిలిచే నెల్లూరు ప్రాంతం నుంచి ఎగిసి పడిన త్యాగ, సంస్కరణ, ధైర్య శిఖరం నాగసూరు వీరరాఘవయ్య. గాంధీజీ ప్రయాణిస్తున్న రైలు తమ ప్రాంతమైన బిట్రగుంట స్టేషన్లో ఆగడం లేదని తెలుసుకున్న వీర రాఘవయ్య, అక్కడ పట్టాల మీద పడుకోవడంతో గాంధీజీ రైలు 1929లో ఆనాడు ఆగింది.
వీరి ఇంటి పేరు ‘నాగసూరు’ అని, అలాగే మరికొన్ని సందర్భాలలో ‘నాగసూరి’ అని కూడా రాయబడటం ఇక్కడ గమనించాల్సిన విషయం. కావలి పట్టణంలో మీదు మిక్కిలి ధనవంతుల ఇంట వీరరాఘవయ్య 1882 సెప్టెంబరు 24న రాఘవులు శ్రేష్ఠి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.
జాతీయోద్యమానికి అలుపు లేకుండా, వెరవకుండా వ్యయం చేసిన వీరరాఘవయ్య స్వాతంత్య్ర స్ఫూర్తి, గాంధీజీ ఆలోచనలు రంగరించుకున్న మంచి వక్త. టంగుటూరి ప్రకాశం పంతులుకు వీరరాఘవయ్య మంచి మిత్రుడు కనుక ఆంధ్రకేసరి ఆ ఇంటికి క్రమం తప్పకుండా విచ్చేసిన అతిథి. బత్తిన పెరుమాళ్ళు నాయుడు, కటికనేని సోదరులు, బెజవాడ గోపాలరెడ్డి, నాగసూరు వీరరాఘవయ్య గార్లకు ఎవరు అన్నం పెట్టినా శిక్షార్హులు అని ఆనాటి బ్రిటీషు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందంటే వారి పోరాట స్థాయి ఏమిటో మనకు బోధపడాలి.
గాంధీజీ తలపెట్టిన అనేక సంస్కరణ కార్యక్రమాలలో శ్రద్ధగా పాల్గొన్న నాగసూరు వీరరాఘవయ్య 203 వితంతు వివాహాలు జరిపించారని తెలుసుకోవడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. అప్పట్లో వితంతువులైన తమ కూతుళ్ళకు పునర్వివాహం చేయడానికి తల్లిదండ్రులు వెనకాడేవారు. అలాంటి వారి బాలికలకి తమ ఇంట్లో ఆశ్రయమిచ్చి, తగిన వరుడు లభించినపుడు వీరరాఘవయ్య పునర్వివాహాలు చేయించేవారు. అస్పృశ్యతా నివారణ, హరిజనోద్ధరణ మొదలైన కార్యక్రమాలు ఆయనకు చాలా మక్కువ.
ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. కులాలకతీతంగా వెళ్లి, వితంతు వివాహాలు చేయిస్తున్నారని ఆయన కుల ప్రముఖులు భావించారట. ఈయనను, ఈ కార్యక్రమాలను వెలివేయాలని ఆ సమావేశంలో పెద్దలు వాదించడం మొదలుపెట్టగా చివరిలో ఒక ఆయన లేచి, ” ఇక్కడ సమావేశమైన ఎవరింటికైనా వీరరాఘవయ్య వచ్చారా? లేదు కదా, ఆయనే మనలను వెలివేశారని మనం తెలుసుకోవా”లని అనడంతో ఆ సమావేశం వీగిపోయిందని అంటారు.
ఈ. ఎస్. రెడ్డిగా ప్రఖ్యాతులైన ఏనుగ శ్రీనివాసులు రెడ్డి (1924-2020) పేరెన్నిక కన్న గాంధేయవాది, ఐక్యరాజ్యసమితి జాతి వివక్ష వ్యతిరేక కార్యకలాపాలలో ఎంతో కృషి చేసిన ఇండియన్ డిప్లమాట్. 1963-1965 మధ్యకాలంలో ఐక్యరాజ్యసమితి జాతి వివక్ష వ్యతిరేక బృందానికి కార్యదర్శిగా పనిచేసిన ఈ ఎస్ రెడ్డి; యు ఎన్ ట్రస్ట్ ఫండ్ ఫర్ సౌత్ ఆఫ్రికా డైరెక్టర్ గా సేవలందించడమే కాకుండా, దక్షిణాఫ్రికా కారాగారంలో మగ్గిన నాయకుడు నెల్సన్ మండేలా విడుదలకు సహా కృషి చేశారు.

వీరి తమ్ముడు మద్రాసులో పారిశ్రామిక వేత్తగా నాకు పరిచయం, వీరి పేరు కూడా ఈ ఎస్ రెడ్డే. 2004-05 ప్రాంతంలో అన్న ఏనుగ శ్రీనివాసులు రెడ్డి, జవహర్ భారతి అధ్యాపకులు ఆర్. సుందర రావు తో కలిసి ‘మెసేజ్ ఆఫ్ మహాత్మా గాంధీ త్రూ ది ప్రిజం ఆఫ్ నెల్లూరు’ అనే పుస్తకాన్ని ఉత్తరాలు, ఉపన్యాసాలు, వ్యాసాలు, కొందరు గాంధీయవాదుల జీవిత చిత్రణలతో కలిపి తెలుగు, ఇంగ్లీషు తెలుగు భాషల్లో వెలువరించారు. ఈ పుస్తకంలో వీరరాఘవయ్య గురించిన సమాచారం తోపాటు, సుమారు 40 మంది స్వాతంత్ర్య సమరయోధుల విశేషాలున్నాయి. వీరరాఘవయ్య గురించి ఆర్.సుందరరావుకు సమాచారం ఇచ్చిన దర్శి (చెంచయ్య తమ్ముడు) రంగయ్య కుమార్తె, నాగసూరి వీరరాఘవయ్య మనవరాలు నాగసూరి వనజ (1941-2024) ఇటీవల నాకు చెప్పిన సంగతులు కూడా ఇందులో జతపరుస్తున్నాను.
విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమ సమయంలో కావలిలో నాయకత్వం వహించి నడివీధులలో విదేశీ వస్త్రాలు, వస్తువులను పెద్ద ఎత్తున తగలబెట్టించిన నాయకుడు వీరరాఘవయ్య. ఒక్క కావలిలోనే కాక నెల్లూరు, గూడూరు, బుచ్చిరెడ్డి పాలెం మొదలైన చోట్ల జరిగిన హరిజన కమిటీ సమావేశాలలో, కాంగ్రెస్ రైతు మహాసభలలో పాల్గొని ఉత్తేజకరంగా ప్రసంగించేవారు కూడా.
1921లో అహమ్మదాబాదులో జరిగిన వార్షిక కాంగ్రెస్ సభలలో కావలి ప్రాంతం నుంచి పాల్గొన్న ఏకైక ప్రతినిధి కూడా ఆయనే. 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని మద్రాసు, కడలూరు, రాయవేలూరు సెంట్రల్ జైళ్ళలో కారాగార శిక్షను అనుభవించారు. గరిమెళ్ళ సత్యనారాయణ, కళా వెంకట్రావు జైలులో ఆయనకు సహచరులు. వెన్నెలకంటి రాఘవయ్య, తిక్కవరపు రామిరెడ్డి, ఓరుగంటి వెంకట సుబ్బయ్య, దేశభట్ల రంగయ్య, బెజవాడ గోపాలరెడ్డి వంటివారు స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన మిత్రులు!
వీరరాఘవయ్య సంస్కరణా దృష్టితో ముడిపడిన దరిశి చెంచయ్య దృష్టాంతం ఒకటి ఉంది. మహామనీషి దరిశి చెంచయ్య విదేశాలకు వెళ్ళి వచ్చినందుకు ఆయనను వైశ్యకులం నుంచి వెలివేశారు. ఆ సందర్భంలో చెంచయ్యను తన ఇంటికి ఆహ్వానించి, ఆ ఊరిలో కుల ప్రముఖులను కూడా విందుకు పిలిచారు. వీరరాఘవయ్యను కాదనగలిగే ధైర్యం లేక వారు వచ్చారు. తర్వాతి కాలంలో చెంచయ్య తమ్ముడు రంగయ్యకు వీరరాఘవయ్య తన కూతురునిచ్చి వివాహం చేశారు.
వీరరాఘవయ్య మూడోకూతురు కట్టా శంకరమ్మ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని, రాయవేలూరు జైలులో శిక్షను అనుభవించారు. 1954 నవంబరు 27న కాలం చేసిన నాగసూరు వీరరాఘవయ్య అనగానే కేవలం కావలి పురజనులకు గుర్తుండే విషయముంది. గాంధీజీ చితాభస్మాన్ని మోసుకు వెళ్తున్న రైలును ఆపడానికి వీరరాఘవయ్య రైలు పట్టాల మీద పడుకున్నారు. అందువల్లనే కావలివాసులు గాంధీజీ చితాభస్మాన్ని దర్శించగలిగారు. అలా బిట్రగుంట స్టేషన్ లో రైలు పట్టాల మీద పడుకున్న విజయగాథ కూడా ఆయనకే సొంతం!
నాగసూరు వీరరాఘవయ్య సదా చిరస్మరణీయులు!

(వ్యాస రచయిత ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్ డైరెక్టర్)

