తెలంగాణ ప్రధాన న్యాయమూర్తితో సీఎం రేవంత్
హైదరాబాబాద్, సెప్టెంబర్ 20 : వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాలలో కోర్టులకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి తెలిపారు. శనివారం ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో భేటీ అయ్యారు.

ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, లా సెక్రటరీ పాపి రెడ్డి, జస్టిస్ పి. సామ్ కోశి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కొత్త జిల్లాల్లో అవసరమైన చోట కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు సీజే సూచించారు. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలను ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

ప్రాధాన్యత వారీగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాలలో కోర్టులకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు.

