సివిల్స్ లో మీ ల‌క్ష్యం ఎంపికే కావాలి: రేవంత్ రెడ్డి

Date:

మెయిన్స్‌ లో విజ‌యం సాధించిన వారికి రూ.ల‌క్ష అందజేస్తాం…
మా ప్రాధాన్యం విద్యా, ఉద్యోగాలు…. వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమం..
రాబోయే ఒలింపిక్స్‌ లో రాష్ట్ర యువ‌త ప‌త‌కాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ
15 రోజుల్లో అన్ని వ‌ర్సిటీల‌కు వీసీలు, ప్రొఫెస‌ర్ల నియామ‌కం..ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
సివిల్స్ మెయిన్స్‌ కు క్వాలిఫై అయిన 135 మందికి రూ.ల‌క్ష చొప్పున చెక్కుల అంద‌జేత‌…
హైదరాబాద్, ఆగస్టు 26 :
ద్రౌప‌ది స్వ‌యంవ‌రం స‌మ‌యంలో అర్జునుడి ల‌క్ష్యం చేప క‌న్నుపై కేంద్రీకృత‌మైన‌ట్లే సివిల్స్‌లో ఎంపిక కావ‌డ‌మ‌నే ఏకైక ల‌క్ష్య‌మే మీకు ఉండాల‌ని, కుటుంబ‌, ఆర్థిక‌, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని సివిల్స్ మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన వారిని ఉద్దేశించి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన 135 మందికి రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం కింద రూ.ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించే కార్య‌క్ర‌మం స‌చివాల‌యంలో సోమ‌వారం సాయంత్రం నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌ధాన అంశం నిరుద్యోగ‌మేన‌ని,నిరుద్యోగులు, విద్యార్థుల ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింద‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టామ‌ని, గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, డీఎస్సీతో క‌లిపి మ‌రో 35 వేల ఉద్యోగాల క‌ల్ప‌న‌కు నోటిఫికేష‌న్లు ఇచ్చి త‌మ చిత్త‌శుద్ధిని చాటుకున్నామ‌ని తెలిపారు.

గ‌త ప్ర‌భుత్వం తెలంగాణ‌లో విద్యా రంగాన్ని నిర్ల‌క్ష్యం చేసింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. వ‌స‌తి గృహాల‌ను అద్దె భ‌వ‌నాల్లో నిర్వ‌హించార‌ని, వంద‌ల మంది విద్యార్థులుంటే ఒక‌ట్రెండు బాత్‌రూంల‌తో స‌రి పెట్టార‌ని మండిప‌డ్డారు. తాము మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌స‌తిగృహాల‌న్నీ ఒకే కాంపౌండ్‌లో ఉండేలా, 20 నుంచి 25 ఎక‌రాల్లో రాష్ట్రంలో వంద నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూల్స్ పేరుతో నిర్మిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం బ‌డ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. మేం కేంబ్రిడ్జిలో, ఆక్స్‌ఫ‌ర్డ్‌లో, ఉస్మానియాలో చ‌దువుకున్నామ‌ని, వాటిలో చదువుకున్నవారు గ‌ర్వంగా చెప్పుకుంటార‌ని, భ‌విష్య‌త్‌లో తాము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌లో చ‌దువుకున్నామ‌ని విద్యార్థులు చెప్పుకునేలా వాటిని తీర్చిదిద్దుతామ‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

మ‌న విద్య స‌ర్టిఫికేట్ల‌కే ప‌రిమిత‌మ‌వుతోంద‌ని, వేలాది మంది ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసినా కంపెనీల‌కు అవ‌స‌ర‌మైన నైపుణ్యాల‌కు వారిలో ఉండ‌డం లేద‌ని, మ‌రోవైపు కంపెనీల‌కు అవ‌స‌ర‌మైన నైపుణ్యం ఉన్న వారు ల‌భించ‌క సంస్థ‌లు ఇబ్బందులు ప‌డుతున్నాయ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి, నిరుద్యోగ స‌మ‌స్య నిర్మూల‌న‌కు యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీని ప్రారంభించి దానికి పారిశ్రామిక‌వేత్త‌లు ఆనంద్ మ‌హేంద్ర‌, శ్రీ‌నివాస‌రాజుల‌ను ఛైర్మ‌న్‌, వైస్ ఛైర్మ‌న్‌లుగా నియ‌మించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మార్కెట్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా నిపుణులను త‌యారు చేసేందుకు వీలుగా ఆ యూనివ‌ర్సిటీలో సిల‌బ‌స్‌, శిక్ష‌ణ, నిర్వ‌హ‌ణ‌కు నిధుల స‌మీక‌ర‌ణ‌ అంతా ఛైర్మ‌న్‌, వైస్ ఛైర్మ‌న్‌, బోర్డు స‌భ్యులే చూసుకుంటార‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం కేవ‌లం ఫెసిలిటేట‌ర్‌గా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. స్కిల్ యూనివ‌ర్సిటీలో అన్ని స‌ర్టిఫికేట్‌, డిప్ల‌మో కోర్సులు ఉంటాయ‌ని, ఈ ఏడాది విద్యా సంవ‌త్స‌రం వృథా కాకుండా 2 వేల మందికి శిక్ష‌ణ ప్రారంభిస్తున్నామ‌ని, వ‌చ్చే ఏడాది నుంచి 20 వేల మందికి యూనివ‌ర్సిటీ శిక్ష‌ణ ఇస్తుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.


దేశానికి త‌ల‌మానికంగా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ
మొన్న‌టి ఒలింపిక్స్‌ లో చిన్న చిన్న దేశాలు ప‌దుల సంఖ్య‌లో ప‌త‌కాలు సాధిస్తే… 140 కోట్ల జ‌నాభా ఉన్న మ‌న దేశం మాత్రం ఆశించిన స్థాయిలో ప‌త‌కాలు సాధించ‌లేద‌ని, ఇది ఒక ర‌కంగా మ‌న‌కు అవ‌మాన‌క‌ర‌మేన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవ‌ల ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న‌లో ఓ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి వెళ్లాన‌ని, ఆ యూనివ‌ర్సిటీలో శిక్ష‌ణ పొందిన వారు 19 ప‌త‌కాలు సాధిస్తే, ఒక క్రీడాకారిణి ఏకంగా మూడు స్వ‌ర్ణ ప‌త‌కాలు సాధించింద‌న్నారు. రాబోయే ఒలింపిక్స్‌లో మ‌న యువ‌త పెద్ద సంఖ్య‌లో ప‌త‌కాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి రూప‌క‌ల్ప‌న చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ యూనివ‌ర్సిటీ నుంచి అత్య‌ధిక ప‌త‌కాల సాధ‌న ద్వారా తెలంగాణ దేశానికే త‌ల‌మానికంగా నిల‌వాల‌ని తాను ఆకాంక్షిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు.


అన్న‌గా అండ‌గా నిలుస్తా….
విద్యార్థులకు, విద్యా రంగానికి తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నా కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తుంటే ప‌రీక్ష‌లు వాయిదా వేయించాల‌ని విద్యార్థుల‌తో ఆందోళ‌ల‌తో చేయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. పోటీ ప‌రీక్ష‌లు వాయిదా వేస్తే ప్ర‌భుత్వానికి న‌ష్టం ఉండ‌ద‌ని, కానీ వాటికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు న‌ష్ట‌పోతార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌తంలో విద్యార్థుల‌ను రెచ్చ‌గొట్టి, వారి ప్రాణాలు తీసి రాజ‌కీయ ల‌బ్ధి పొంది అధికారంలోకి వ‌చ్చార‌ని ముఖ్య‌మంత్రి మండిప‌డ్డారు. ప‌దేళ్ల పాటు ఉద్యోగ క‌ల్ప‌న‌ను ప‌ట్టించుకోనివారు, త‌మ ఉద్యోగాలు పోగానే మ‌ళ్లీ విద్యార్థుల‌ను రెచ్చ‌గొట్టే ప‌నికి పూనుకున్నార‌ని ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. అందుకే ప‌రీక్ష‌ల వాయిదా చేయాలంటూ విద్యార్థుల‌ను రెచ్చ‌గొట్టే బావ‌బామ్మ‌ర్ధి వాళ్లే ఆమ‌ర‌ణ దీక్ష చేయాల‌ని సూచించాన‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ప‌ది, ప‌దిహేను రోజుల్లోనే రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల‌కు వైస్ ఛాన్స‌ల‌ర్లు, ఫ్రొఫెస‌ర్లు, అసిస్టెంట్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్ల నియామ‌కం చేప‌డ‌తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. విద్యార్థుల‌, నిరుద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని, అన్న‌గా తాను అండ‌గా నిల‌బ‌డతాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అభ‌యం ఇచ్చారు. కొంద‌రి మాయ‌మాట‌ల ప్ర‌భావంలో ప‌డి నిర‌స‌న‌లు, ధ‌ర్నాల‌కు దిగొద్ద‌ని, కొంద‌రి కుట్ర‌ల‌కు పావులుగా మారొద్ద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.


ప్ర‌భుత్వం ఏం చెబుతోంది.. ఏం చేస్తోంది.. వాళ్లేం చెబుతున్నారు.. ఏం చేస్తున్నార‌నే దానిపై సొంతంగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్ర‌భుత్వం దృష్టికి ఏ స‌మ‌స్య‌లు తీసుకువ‌చ్చినా సానుకూల దృక్ఫ‌థంతో ప‌రిష్క‌రిస్తాన‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్ర‌తిష్ట‌ను పెంచాలి…
ఎస్సై నియామ‌కాలు చేప‌డితే స‌గం మంది ఉమ్మ‌డి న‌ల్గొండ నుంచే ఎంపిక అవుతున్నార‌ని, అందుకు కార‌ణం ముందుగా అక్క‌డి నుంచి ఎంపికైన వారి స్ఫూర్తేన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌స్తుతం సివిల్స్ ప్రిలిమ్స్ పూర్తి చేసిన వారంతా మెయిన్స్‌కు, ఆ త‌ర్వాత ఇంట‌ర్వ్యూకు అర్హ‌త సాధించాల‌ని, అంతిమంగా సివిల్స్‌కు ఎంపిక కావాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధిలో ముందున్నా సివిల్స్ సాధ‌న‌లో మ‌న‌కంటే ఎంతో వెనుక‌బ‌డిన బిహార్‌, రాజ‌స్థాన్‌ల‌తో పోల్చితే వెనుక‌బ‌డి ఉన్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన వారికి రూ.ల‌క్ష సాయం అందించామ‌ని, మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంట‌ర్వ్యూకు అర్హ‌త సాధిస్తే మ‌రో రూ.ల‌క్ష అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చే రూ.ల‌క్ష పెద్ద మొత్తం కాక‌పోవ‌చ్చ‌ని, కానీ ఈ ప్ర‌భుత్వం మీ వెనుక ఉంద‌నే ఆత్మ‌విశ్వాసం క‌ల్పించ‌డానికి భ‌రోసా ఇస్తున్నామ‌ని తెలిపారు. సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హ‌త సాధించిన వారు, మెయిన్స్‌, ఇంట‌ర్య్వూ.. ఎంపిక వ‌ర‌కు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా త‌న‌కు, మంత్రుల‌కు తెలియ‌జేయాల‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాటిని ప‌రిష్క‌రిస్తామ‌ని ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు.

తెలంగాణ నుంచి పెద్ద సంఖ్య‌లో సివిల్స్‌లో ఎంపికై రాష్ట్ర ప్ర‌తిష్ట‌ను పెంచాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మీ ఎంపిక‌లు మీ కుటుంబానికి, మీ ఊరుకు, మీ జిల్లాకే కాక తెలంగాణ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌నే విష‌యం గుర్తుంచుకోవాల‌ని అభ్య‌ర్థుల‌కు సూచించారు. మీరు మా బిడ్డ‌ల‌నే విష‌యం తెలియ‌జేయ‌డానికే ఈ కార్య‌క్ర‌మాన్ని స‌చివాల‌యంలో నిర్వ‌హించామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. గ‌తంలో స‌చివాల‌యంలోని త‌న‌ను, సీత‌క్క వంటి వారినే రానివ్వ‌లేద‌ని, స‌చివాలయం గ‌డీ కాద‌ని.. మీరు దూరం నుంచి దీనిని చూసే ప‌రిస్థితి రావ‌ద్ద‌నే కార్య‌క్ర‌మం ఇక్క‌డ ఏర్పాటు చేశామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ‌త ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డ‌బ్బులున్నా ఇటువంటి ప‌నులు ఏం చేయ‌లేద‌ని త‌మ ప్ర‌భుత్వ ప్రాధాన్యం విద్యా, ఉద్యోగాలు… వ్య‌వ‌సాయం… రైతుసంక్షేమం అయితే… గ‌తంలోని వారి ప్రాధాన్య‌త‌… ఫాంహౌస్‌లు..ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ని ముఖ్య‌మంత్రి విమ‌ర్శించారు. అనంత‌రం మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన 135 మందికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్వ‌యంగా చెక్కులు అంద‌జేశారు. అనంతరం వారితో క‌లిసి గ్రూప్ ఫొటో దిగారు.

కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, శ్రీ‌ధ‌ర్ బాబు, సింగ‌రేణి ప‌రిధి ఎమ్మెల్యేలు కూనంనేని సాంబ‌శివ‌రావు, కోరం క‌న‌క‌య్య‌, మాలోత్ రాందాస్ నాయ‌క్‌, మ‌ట్టా రాగ‌మ‌యి, గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు, గ‌డ్డం వివేక్ వెంక‌ట‌స్వామి, ఎమ్మెల్యే డాక్ట‌ర్ క‌వ్వంప‌ల్లి స‌త్యానారాయ‌ణ‌, ఖ‌మ్మం, పెద్ద‌ప‌ల్లి ఎంపీలు రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి, గ‌డ్డం వంశీ, సింగ‌రేణి సీఎండీ బ‌ల‌రాం, సీఎస్ శాంతి కుమారి, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

సింగ‌రేణి కార్మికుల‌కు బోన‌స్‌…. ఒక్కొక్కరికి రూ. 1 .90 లక్షలు

ద‌స‌రాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండ‌గ‌కార్మిక కుటుంబాల‌కు అంద‌నున్న‌ రూ.796 కోట్లుతొలిసారిగా...

లడ్డూపై లడాయి

నాటి నుంచి నేటి వరకూ లడ్డూ ప్రసాదం కథ కమామిషు(వాడవల్లి శ్రీధర్)కలియుగ...

అందరమొకటై చేయి చేయి కలిపి… జై జై గణేశ

శిల్ప కాలనీలో ఘనంగా గణేశ ఉత్సవాలు67 వేలకు పెద్ద లడ్డూ, 17...

Young India Skill university a role model for country

CM Revanth Appeals to Industrialists to play a key...