మాతృభాష తల్లిలాంటిది
రెండు కొమ్ముల రుషి ఆవిష్కరణలో సుధామూర్తి
హైదరాబాద్, మే 13: మంచి కార్యక్రమానికి వెడితే కలిగే తృప్తి అనుభవిస్తేనే గానీ తెలీదు. అది మాటలకి అందదు. కారణం ఎవరూ చెప్పలేరు కూడా. కొంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్, మరికొందరికి సాహిత్యం, ఇంకొందరికి రాజకీయం ఇలా అనేక రంగాలున్నాయి. బుక్ లవర్స్‌ది మాత్రం సెపరేట్ సెక్ట్. అందులో ఉన్న ఆనందం వారికి మాత్రమే అర్థమవుతుంది. అది అనుభవంలోకి వస్తేనే బాగుంటుంది. మాటల్లో చెప్పలేని అనుభవం అది. ముఖ్యంగా సుధామూర్తి లాంటి రచయిత పాల్గొన్న కార్యక్రమమైతే అది మాటలకు అందనిదే. సింపుల్ ఇంగ్లీష్‌లో అందరికీ అర్థమయ్యేలా మాట్లాడడం ఆమెకు చెల్లు. ఈ తరం వారికి కృష్ణుడి కథ చెప్పాలంటే ఎలా చెబితే బాగుంటుంది? ఆమె చెప్పిన విధానం ఆకట్టుకునేలా ఉంది. టెక్నాలజీతో పాటు నేటి తరం అభిలాషను కూడా దృష్టిలో పెట్టుకుని కృష్ణ తత్వాన్ని వివరించిన తీరు అద్భుతం. అదే సమయంలో మాతృభాష ప్రాధాన్యతను కూడా సునిశితంగా గుర్తుచేశారామె. ది సేజ్ విత్ టు హార్న్స్ పేరుతో సుధామూర్తి ఆంగ్లంలో రాసిన పురాణ కథల సంపుటిని రెండు కొమ్ముల రుషి పేరుతో అశోక్ బుక్ సెంటర్, విజయవాడ వారు ప్రచురించారు. ఆకాశవాణి విజయవాడ రిటైర్డ్ డైరెక్టర్ ముంజులూరి కృష్ణకుమారి ఈ పుస్తకాన్ని సరళమైన తెలుగులో అనువదించారు.
ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్‌లోని సప్తపర్ణిలో ఏర్పాటైంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ డీజీపీ అబ్దుల్ ఖయ్యుమ్ ఖాన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈనాడు ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్ మానుకొండ నాగేశ్వరావు సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుధామూర్తి ప్రసంగం ఉత్తేజపూరితంగానూ, స్ఫూర్తిమంతంగానూ సాగింది. టెక్నాలజీ పిల్లల్లో ఊహలను పరిహరిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. కృష్ణుడికి దేవకి అసలు తల్లి, యశోద రెండో తల్లి. ఈ ఉదాహరణను మాతృభాషకు ఆమె అనుసంధానించారు. ఎవరికైనా మాతృభాష తల్లిలాంటిదనీ, ఆంగ్లం యశోద లాంటిదనీ వివరించారు. మాతృభాష మనలో సహజమైన అస్థిత్వాన్ని ప్రోది చేస్తుందనీ, మన ఉన్నతికి కారణమవుతుందనీ తెలిపారు. ఆంగ్లం మన ఆలోచనలను విస్తృతం చేస్తుందనీ, పాశ్చాత్య సంస్కృతిని అవగాహన చేసుకోవడానికి వీలు కల్పిస్తుందనీ చెప్పారు. ఆమె మాటల్లో నిజాయితీ సభకు హాజరైనవారిని కట్టిపడేసింది. ఒక మంచి పుస్తకం ఇచ్చే తృప్తిని మరేదీ ఇవ్వలేదన్నారు సుధామూర్తి. ఆమె ఇంతవరకూ 40 పుస్తకాలు రచించారు. అందులో 24 తెలుగులోకి అనువాదమయ్యాయి. కన్నడ, తెలుగు భాషలు అక్క చెల్లెళ్ళ వంటివనీ, మనం కూడా సాత్వికులమనీ తెలిపారు. ఏ భాష పురాతనమైనదనే విషయాన్ని పక్కనపెట్టి, భాషోన్నతికి కృషి చేయాలని సూచించారు. మనం ఎంత సంపాదించినా మన గుప్పిట్లో ఎంత పడుతుందో అంతే తినగలమనీ, రాజసౌధాల్ని నిర్మించుకున్నా నిద్రించేది ఆరడుగుల పొడవు, మూడడుగుల వెడల్పులోని ప్రాంతంలోనేనని గుర్తించాలని హితవు పలికారు. జ్ఞానం నిలుస్తుంది తప్ప మరేది దానికి సాటి రాదని సుధామూర్తి తెలిపారు.
మాతృభాషే మిన్న: ఖాన్
భాషలన్నింటిలోకి మాతృభాషే మిన్న అని మాజీ డీజీపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు అయిన ఎ.కె. ఖాన్ స్పష్టంచేశారు. తాను డిగ్రీ వరకూ తెలుగు మీడియంలోనే చదివానని చెప్పారు. పంచతంత్ర కథలు, శతకాలు చదువుకుని వచ్చిన వాడినేనని తెలిపారు. పురాణాలలోని సంఘటనలను ఉదహరిస్తూ ఖాన్ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఇదే సందర్భంలో మనుషుల మధ్య పాజిటివ్ దృక్పథం ఉండాలని కోరారు. ఆ సందర్భంలో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను ఖాన్ వివరించారు.
సుధామూర్తి రచనలు ఉత్ప్రేరకాలు
భాషకు సుధా మూర్తి రచనలు ఉత్ప్రేరకాలని ఈనాడు ఏపీ ఎడిటర్ ఎమ్. నాగేశ్వరరావు చెప్పారు. ఈనాడులోప్రచురితమైన కథనాలను ఆయన కొన్నింటిని ఉదహరించారు. మానవ సంబంధాలను సుధామూర్తి రచనలు, చేతలు ప్రస్ఫుటిస్తాయన్నారు. పత్రికలలో ప్రచురితమయ్యే లేఖలకు కూడా సుధామూర్తి స్పందిస్తారని చెబుతూ అలాంటి సందర్భాన్ని వివరించారు. అశోక్ బుక్ సెంటర్ అధినేత అశోక్ కార్యక్రమ సంధానకర్తగా వ్యవహరించారు.