రైలు ఢీకొని ఆరుగురి దుర్మరణం!
దిగ్భ్రాతిని వ్యక్తంచేసిన సీఎం జగన్
శ్రీకాకుళం, ఏప్రిల్ 11: శ్రీకాకుళం జిల్లా జి సిడగం వద్ద సంభవించిన ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మరణించారు. బాతువ వద్ద సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన గౌహతి ఎక్స్‌ప్రెస్ నుంచి ప్రయాణికులు కిందకు దిగి, పట్టాలు దాటుతుండగా, విశాఖ నుంచి వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. ఏపీ సీఎం వైయస్ జగన్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. తక్షణం సహాయ కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా శ్రీకాకుళం కలెక్టర్‌ను ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మంచి వైద్య సేవలు అందేలా చూడాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు సీఎంకు అందించారు. విశాఖపట్నం నుంచి గౌహతి వెళ్తున్న రైలు సాంకేతికలోపంతో నిలిచిపోయిందని, చల్లగాలికోసం కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారని, మరో ట్రాక్‌పై వెళ్తున్న కోణార్క్‌ఎక్స్‌ప్రెస్ వీరిని ఢీకొట్టడంతో కొంతమంది మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. మంచి వైద్య సేవలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సహాయసహకారాలు అందించాలన్నారు.