ఎన్నికల కమిషన్ పునాదులకు “సర్”తో బీటలు !?

0
53

(బాలినేని నాగభూషణరావు, సీనియర్ జర్నలిస్ట్)

ఓటర్ల జాబితా తయారీ, తొలగింపు, డేటా భద్రత, సమాచారం నిక్షిప్తం… అనే అంశాలపైన ఎన్నికల కమిషన్ ఆధారపడి వున్నది. ఒక రకంగా ఇది ఎన్నిక కమిషన్ కు పునాది లాంటిది. కానీ ఆ పునాదికి బీటలు వారే పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం “సర్”. ఎలక్షన్ కమిషన్ (Election Commission) తీసుకువచ్చిన ఈ సర్ (SIR అంటే “Special Intensive Revision” – ప్రత్యేక సమగ్ర సవరణ) కారణంగా ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుండడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. దీనికంతటికీ కారణమైన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా కనుసన్నల్లో పనిచేస్తున్న ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ కుమార్ రాజీనామా చేయాలని అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అయితే నరేంద్రమోడీ, అమితాషాలు, జ్ఞానేశ కుమారులును దేశద్రోహులుగా ముద్ర వేశారు. సీఈసీ జ్ఞానేశ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయకపోతే మరోసారి జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగుతామని కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దిష్కే హెచ్చరించారు. టీఎంసీ, ఆప్, ఉద్ధవ్ శివసేన వంటి పార్టీలు కూడా జ్ఞానేశ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

గత ఈఏడాది కాలంగా ఎన్నికల కమిషన్ వివిధ రాష్ట్రల్లో ఈ “సర్” కార్యక్రమం అమలు చేస్తూ వస్తుంది. అప్పటి నుండి సర్ వివాదాస్పదంగానే మారింది. బీహార్ ఎన్నికలలో, ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, పచ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సమయంలో సర్ కారణంగా తొలగించిన ఓట్లర్ల వ్యవహారం కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీకి అనుకూలంగా మారిందన్న విమర్శలు వినవస్తూనే వున్నాయి. కానీ వీటిని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ త్రోసి పుచ్చుతూ వచ్చాయి.

తాజాగా సర్ పేరుతో లక్షలాది మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వడంపై ఎన్నిక కమిషన్ లోని విభేదాలు ఏర్పడ్డట్టు మీడియాలో రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఎన్నికల కమిషన్ లోని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఓటర్ల డేటా భద్రత ప్రమాదంలో పడుతోందని తోటి కమిషనర్లు ఎస్.ఎస్. సంధూ, వివేక్ జోషిలు దాదాపు 14 సార్లు అభ్యంతరాలు లేవనెత్తుతూ లేఖలు వ్రాసిన విషయం బయటకు పొక్కడంతో ఎన్నికల కమిషన్ తీరుపై విమర్శల దాడి మొదలయింది. ఎన్నికల కమిషన్ చరిత్రలో మొదటిసారిగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంశనకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.

ఎన్నికల కమిషనలో వున్న ముగ్గురు కమిషనర్లు మధ్య విభేదాలు రావడం సహజమే. కానీ ప్రస్తుతం సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రంగానే వున్నాయి. “మా సీఈసీ అనుమతి లేకుండా ఓటర్ల నమోదు, తొలగింపు, ఫారం-6 మార్పులు, సాఫ్ట్‌వేర్‌ సెంట్రలైజ్ చేయడం అంతా చట్టవిరుద్ధంగా జరుగుతున్నది” అంటూ క్యాబినెట్ సెక్రటరీకి కూడా ఇరువురు సీఈసీ లు ఫిర్యాదు చేయడం చరిత్రలో మొదటిసారి. దీనిపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. “ఇది ఏకపక్ష నిర్ణయం, CEC రాజీనామా చేయాలి” అని కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఉద్ధవ్ థాక్రే పార్టీలు డిమాండ్ చేశాయి.

వాస్తవంగా చెప్పాలంటే సర్ ముఖ్య ఉద్దేశం: నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లు, వేరే ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లు, మరియు ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న ఓట్లను జాబితా నుండి తొలగించడం. అర్హులైన ఓటర్లను చేర్చడం, 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లకు అవకాశం కల్పించడం. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పారదర్శకతగా సరిచూడటం.

కానీ ఇవి ఏవీ సరిగ్గా జరగటంలేదన్నది ప్రధాన ప్రతిపక్షాలు, పౌర సంఘాల ఆరోపణలు. ప్రజలనుంచి నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ సర్ కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవన విధానంపైన ప్రభావం పడింది. ప్రముఖులు సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ కూలీ పని చేసుకునేవారు, ఉద్యోగస్తులు సైతం ఈ సర్ కారణంగా అనేక తిప్పలు పడుతున్నారు. ఇంటింటి సర్వే గాని, బిఎల్ఓలు ప్రతి ఇంటికి వచ్చి ఓటర్ల వివరాలను సరిచూసుకోవడం వంటి కార్యక్రమాలే సరిగ్గా జరగడంలేదు.

అనుమానాలకు ఆస్కారం.!
ఇదంతా ఒక ఎత్తు అయితే ఎన్నికల కమిషన్ సాఫ్ట్వేర్ అవకతవకలు దారుణంగా ఉంటున్నాయి. స్థానిక ఎన్నికల సిబ్బంది సైతం ఈ సాఫ్ట్వేర్ పట్ల తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఫలితంగా ఓటర్ల జాబితాలో తీవ్ర అవకతవకలు ఏర్పడడం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. అధికారంలో వున్న భారతీయ జనతాపార్టీ తమకనుకూలంగా వున్నవారిని జాబితాలో చేరుస్తూ మిగతా పార్టీలకు చెందిన ఓటర్లను ఈ సాఫ్ట్వేర్ ద్వారా తీసివేస్తుందన్న ప్రచారం చాలా బలంగా ప్రజల్లో నాటుకుపోయింది. గత ఏడాది కాలంగా సర్ పేరుతో దాదాపు 13 కోట్లమంది ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడం ప్రజలలో నెలకొన్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది.

అలాగే ఎన్నికల అపాయింట్మెంట్ చట్టం (2023) సవరణ ఇందుకు మరింత ఆజ్యం పోస్తుంది. సుప్రీం కోర్టు చెప్పిన కమిటీ ప్రకారం ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రధాన పాత్ర ఉండాలి. మోడీ ప్రభుత్వం ఈ ఎంపికలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తిని తొలగించి మంత్రివర్గంలో ఒకరిని ఈ కమిటీలో నియమిస్తూ ఎన్నికల చట్టానికి సవరణ చేయడం విమర్శలకు కారణమైంది. ప్రధానమంత్రి, అయన మంత్రివర్గలో ఒకరు వున్న ఈ కమిటీలో సీఈసీ ఎంపిక ఎంత పారదర్శకంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఫలితంగా ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేసిందన్న అపవాదును మూటకట్టుకుంది.

హర్యానాలో 2024లో పోలింగ్ రోజు 61% అని చెప్పి, కౌంటింగ్ రోజు 68% అని ఎన్నికల సంఘం ప్రకటించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. “రాత్రికి రాత్రే ఓట్లు 7 శాతం ఓట్లు ఎలా పెరిగాయి? అన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు ఎన్నికల సంఘం నుంచి సరైన సమాధానం లేదు. కర్ణాటకలో వేల మంది నిజమైన ఓటర్లను తొలగించడానికి ఫేక్ ఫారంలు పెట్టారని “సిట్” విచారణలో తేలినా కేంద్ర ఎన్నికల సంఘం సహకరించలేదని కర్ణాటక ప్రభుత్వం ఆరోపణ. 2026లో పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియలో 27.16 లక్షల ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని, అందులో 22.21 లక్షల మంది తమ పేర్లను తిరిగి చేర్చాలని విజ్ఞప్తి చేశారని ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్టుకు తెలిపింది. అంటే తొలగించబడినవారిలో సుమారు 82% మంది కోరడం జరిగింది. కానీ ఈ వివరాలు ఎన్నికల కమిషన్ బయటపెట్టడంలేదు. ఇక పోలింగ్ సమయంలో రికార్డు చేసిన సిసి టీవీ ఫుటేజ్ గతంలో ఒక ఏడాది ఉంచేవారు, కానీ ఇప్పుడు 45 రోజులకే డిలీట్ చేస్తున్నారు. ఇక వివి పాట్ ల లెక్కింపు 100% జరగడం లేదు.

అందుకే ప్రతిపక్షాలు, ప్రజల్లో నెల్లకొన్న ఈ అనుమానాలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ కుమార్ వద్ద నుండి సరైన సమాధానాలు దొరకడంలేదు. మిగిలిన ఇద్దరు కమిషనర్లు కూడా జ్ఞానేశ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎన్నికల కమిషన్లోని డొల్లతనం బయటపడి ఓటర్ల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here