ముచ్చింతల్‌లో ఫిబ్రవరి 5న సమతా మూర్తి విగ్రహావిష్కరణ
భగవద్రామానుజులు కేవలం మత ప్రవక్త, యతీంద్రులు మాత్రమే కాదు. సమతనూ, మమతనూ పెంచి పంచిన మానవతా వాది. సమాజంలోని వివక్షను నిలదీసి, వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించి సమతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సమతా మూర్తి. సర్వజన హితైషి. భక్తి ఉద్యమంతో పాటు జ్ఞాన బోధకు ప్రాధాన్యం ఇచ్చిన ఆధ్యాత్మిక నేత. అస్పృస్యత లాంటి దురాచారాల నివారణకు సుమారు వెయ్యేళ్ల క్రితమే చొరవ చూపిన సంస్కరణల పథగామి. స్వామి వివేకానంద అభివర్ణించినట్లు ‘అంత్యజుల నుంచి బ్రాహ్మణుల వరకు అందరికి భక్తి మార్గం సమానమేనని’ ప్రబోధించిన సామ్యవాది.
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ శ్రీరామపురంలోని జీవా కేంద్రంలో నెలకొల్పిన రామానుజాచార్యుల 216 అడుగుల ‘సమతామూర్తి’ విగ్రహం వచ్చే (ఫిబ్రవరి) నెల 5వ తేదీన ఆవిష్కరణ కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 2వ తేదీ నుంచి పన్నెండు రోజుల పాటు 120 యాగశాలల్లోని 1,035 కుండాలలో హోమం నిర్వహిస్తారు. ఐదు వేల మంది ఋత్త్విక్కులు హొమాల్లో, పారాయణంలో పాల్గొంటారు. పండితులు రోజుకు కోటి సార్లు అష్టాక్షరి మహా మంత్రాన్ని జపిస్తారు. ఇప్పటికి ఖరారైన కార్యక్రమం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
మహాపూర్ణాహుతి (14వ తేదీ)కి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హాజరవుతారు. ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు సహా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సహా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రామానుజ వైభవాన్ని స్థాలీపులాకంగా స్మరించుకునే ధారావాహిక డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి కలం నుంచి త్వరలో…..