జైపూర్, నవంబర్ 21: ఒక్కోసారి ఇలాంటి దృశ్యాలు పెద్దవారి పెద్దమనసులను వెల్లడిస్తాయి. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా చేసిన ఒక చిన్న సాయం అందరినీ ఆకట్టుకుంది. చప్పట్లు కొట్టేలా చేసింది. జైపూర్ నుంచి కోల్‌కతాకు విమానం ఎక్కేందుకు వెడుతున్న సిందియాకు ఒక దృశ్యం కనిపించింది. ఒక పెద్దాయన వీల్ చైర్‌లో తనకు తాను చెక్ ఇన్ అవడానికి వెడుతుండడం ఆయనను ఆకర్షించింది.
వెంటనే ఆయన ఆలస్యం చేయకుండా గబగబా ఆయన దగ్గరకు వెళ్ళి వీల్ చెయిర్‌ను తోసుకుంటూ తీసుకెళ్ళారు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న అందరూ చప్పట్లు కొట్టారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆయనో కేంద్ర మంత్రి. ఆయన చెబితే తన సిబ్బందిలో ఎవరో ఒకరు ఆ పనిచేసేవారే. కానీ సాయం చేయడంలో ఉన్న తృప్తి ఎందులోనూ ఉండదు కదా.
అందుకే ఆయన తానే స్వయంగా వీల్ చెయిర్ తోసి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ అంశాన్ని ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. ఆ దృశ్యాలే ఇవి. అశోక్ గజపతి రాజు కూడా ఒకసారి విమానం దగ్గరకు తీసుకెళ్ళే బస్సులో ఒక వృద్దురాలికి సీటు ఇచ్చి తాను నిలబడి ప్రయాణం చేశారు. అప్పట్లో అది అందరి మన్ననలూ చూరగొంది. అప్పుడప్పుడు సెలబ్రిటీలు చేసే సాయాలు స్ఫూర్తి నింపుతాయనడంలో సందేహం లేదు.