భారత్ చేతిలో కివీస్ చిత్తు
వరుసగా 15 వ సారి టాస్ ఓడిపోయిన భారత్
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాడో భారత జట్టు విజయ పతాకాన్ని ఎగరేసింది. మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. రోహిత్ అవుట్ కావడంతో భారత్ పరుగుల వేటలో జోరు తగ్గింది.
భారత బ్యాటింగును ధాటిగా ప్రారంభించిన రోహిత్, గిల్ జోడీ మొదటి వికెట్ కు 105 పరుగులు చేశారు. గిల్ 38 పరుగులకు సెంటెనర్ బౌలింగులో గ్లేన్ ఫిలిప్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కు అవుటయ్యాడు. తరవాత వచ్చిన కోహ్లీ రెండు బంతులు ఆడి ఒక పరుగుకు ఎల్బీ గా ఔటయ్యాడు. తరవాత రోహిత్ కు శ్రేయాస్ అయ్యర్ జత కలిశాడు. రోహిత్ 83 బంతులతో 76 పరుగులు చేసి, బ్రేస్ వెల్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి స్టంప్ అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి ఆట వేగం తగ్గింది. రోహిత్ అవుటయ్యే సమయానికి స్కోరు 122 . ఈ దశలో శ్రేయాస్ అయ్యర్ కు అక్షర్ పటేల్ జత కలిశాడు. 44 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ ని జేమ్సన్ జారవిడిచారు. 48 పరుగుల వద్ద సంట్ నర్ బౌలింగులో రవీంద్ర క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అప్పుడు భారత స్కోరు 183 . అయ్యర్, అక్షర్ కలిసి నాలుగో వికెట్ కు 61 పరుగులు జోడించారు. అక్షర్ పటేల్ – కె.ఎల్. రాహుల్ కలిసి ఐదో వికెటుకు 20 పరుగులు జోడించారు. అక్షర్ 28 పరుగుల వద్ద బ్రేస్వేల్ బౌలింగ్లో అవుటయ్యాడు. అప్పటికి స్కోర్ 203 . ఈ దశలో రాహుల్ కు హార్దిక్ పాండ్య జత కలిశాడు. భారత జట్టును విజయ పథంలోకి నడిపారు.
రవీంద్ర పదో ఓవర్లో పాండ్య భారీ సిక్సర్ కొట్టాడు. పాండ్య 18 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ దశలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. వస్తూనే వరుసగా రెండేసి పరుగులు చేసి ఒత్తిడి తగ్గించాడు. రాహుల్ 34 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచారు. జడేజా ఫోర్ కొట్టి గెలిపించాడు.
దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించింది. ఈ కారణంగా లాహోరులో జరిగిన సెమీస్ లో 363 పరుగులు చేసిన న్యూజిలాండ్ ఆచి తూచి ఆడింది. రెండు జట్లూ కూడా తొలి పది ఓవర్లలో చూపిన దూకుడును తరవాత చూపించలేకపోయాయి.
తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. రచిన రవీంద్ర 37 , మిషెల్ 63 , బ్రేస్ వెల్ 53 , ఫిలిప్స్ 34 పరుగులు చేశారు. పేసర్లు ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. షమీ తొమ్మిది ఓవర్లలో 74 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి కులదీప్ యాదవ్ రెండేసి వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
భారత జట్టు వరుసగా పదిహేనుసార్లు టాస్ ఓడిపోయింది. ఇలా ఏ జట్టుకూ ఇంతవరకూ జరగలేదు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవటం ఇది మూడోసారి. మొదటి సారి 2002 శ్రీలంకతో కలిసి సంయుక్తంగా గెలుచుకుంది. అప్పుడు వర్షం కురిసి ఆట జరగకపోవడంతో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. 2013 లో ఇంగ్లండును ఓడించి ధోని సారధ్యంలో ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.