వెంట్రుకను తీసుకుని వెళ్లి…

0
96

అన్నమయ్య అన్నది -16

(రోచిష్మాన్, 9444012279)

“ఏవీ నుపాయాలు గావు యెక్కువ భక్తే కాని
దావతిఁ‌ బడక యిది దక్కితే‌ సులభము”.

ఏవీ ఉపాయాలు కావు భక్తి ఎక్కువగా ఉండడం తప్పితే. అత్యాసక్తికి పోవక్కఱ్లేదు. ఈ భక్తి దక్కితే సులభం అంటూ భక్తి యొక్క ప్రాధాన్యతను సంకీర్తించారు అన్నమయ్య.

భక్తి వినా ఇంకేవీ ఉపాయాలు కావు‌. ఈ స్థితిని మనం రామకృష్ణ పరమహంసలో, రమణ మహర్షిలో ప్రస్ఫుటంగా చూడచ్చు. వారు ఎక్కువైన భక్తితోనే భగవంతుణ్ణి పొందారు.

ఆదిశంకరాచార్య తమ వివేకచూడామణి (32వ శ్లోకం)లో ఇలా చెప్పారు: “మోక్ష కారణ సామగ్ర్యాం భక్తి రేవ గరీయసీ / స్వ స్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే”. అంటే మోక్షానికి కారణాలుగా ఉన్న సామగ్రిలో భక్తి ఒక్కటే గొప్పది. తనను పరమాత్మ రూపంతో‌ అనుసంధానం‌ చేసేది భక్తి అని చెప్పబడుతోంది అని అర్థం.‌ వేమన కూడా “భక్తి యున్న చోటఁ బరమేశ్వరుండుండు / భక్తి లేని చోట పాపముండు / భక్తి కలుగ వాఁడు పరమాత్ముఁడగునయా” అన్నాడు. సూఫీ కవీ, తాత్త్వికుడూ అయిన రూమీ “ఎప్పుడు‌ భక్తి‌ నిండారుతుందో‌ అప్పుడు‌ భక్తుడు దైవదూత స్థితిని పొంది భగవంతుడిలో ఐక్యమౌతాడు” అని చెప్పాడు.

“ముంటిపై‌‌ సుఖమందుట ముక్కున నూరుపు వట్టి
దంట‌వాయువు గెలువఁ‌ దలఁచే దెల్లా,
వెంటిక పట్టుక పోయి వెసఁగొండ వాఁకుట
వెంటఁ గర్మ‌మార్గమున విష్ణుని‌ సాధించుట”.

ముక్కుతో శ్వాసను పట్టుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల జంటను (దంట వాయువు) గెలవాలని అనుకోవడమంతా ముళ్లపై‌ సుఖపడడంలాంటిది, వెంట్రుకను తీసుకుని వెళ్లి పెద్ద కొండను ఎగబాకడంలాంటిది, కర్మమార్గంలో విష్ణువును పొందడం అనేది అని అన్నమయ్య చెబుతున్నారు.

ముక్కుతో శ్వాసను బిగపట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గెలవలేం అని తెలియజేస్తున్నారు‌ అన్నమయ్య. పైగా అది ముళ్లపై సుఖంలాంటిదనీ చెబుతున్నారు. ముళ్లపై పడుకోవడం సుఖాన్నివ్వదు కదా? విషయాన్ని ఎంత బాగా చెబుతున్నారు‌ అన్నమయ్య. ఉన్నతమైన ఉదాహరణతో విలువైన విషయాన్ని తెలియజెప్పారు అన్నమయ్య. “కుక్కతోకబట్టి‌ గోదావరీదునా” వంటి‌ వేమన‌ వ్యక్తీకరణలకు ఎంతో ముందే అన్నమయ్య‌ వెంట్రుకను తీసుకుని వెళ్లి పెద్ద కొండను ఎగబాకడంలాంటిది అన్న వ్యక్తీకరణ చేశారు.

పతంజలి‌‌‌ యోగ సూత్రాల్లో 24 వ సూత్రం ఇలా తెలియజేస్తోంది: “క్లేశకర్మ విపాకాశాయై రపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః”. అంటే క్లేశకరమైన కర్మ ఫలితాలు, ఆశలు వీటిచేత స్పృశించబడడు విశేషమైన పురుషుడు ఈశ్వరుడు అని అర్థం. ఆది‌శంకరాచార్య తమ వివేకచూడామణి (7వ శ్లోకం)లో “కర్మణో‌ ముక్తేరహేతుత్వం” అని చెప్పారు. అంటే ముక్తి విషయంలో కర్మకు కారణత్వం లేదు అని అర్థం. అన్నమయ్య ఇక్కడ కర్మమార్గంలో విష్ణువును (ఈశ్వరుణ్ణి) సాధించడం వెంట్రుకను తీసుకెళ్లి కొండను ఎగబాకడంలా జరగనిదని తెలియజేశారు.

“ఏనుగుతోఁ బెనఁగుట యిల నిరాహారియై
కానని పంచేంద్రియాలఁ గట్టఁబోవుట,
నానించినుప గుగ్గిళ్లు నమలుట బలిమిని
ధ్యానించి మనసుఁబట్టి దైవము సాధించుట”.

అహారం లేకుండా లేదా ఉపవాసం ఉండి కనిపించని పంచేంద్రియాలను కట్టెయ్యబోవడం ఏనుగుతో పెనుగులాడడం వంటిది. బలవంతంగా మనసును అదిమిపట్టి ధ్యానించి దైవాన్ని సాధించడం అనేది ఇనప గుగ్గిళ్లను నానబెట్టి నమలడం వంటిది అని చెబుతున్నారు అన్నమయ్య.

చూపు, రుచి, స్పర్శ , వినికిడి, వాసన ఈ పంచేంద్రయాల్ని కట్టెయ్యడమూ, మనసును అదిమి పట్టడమూ సుఖకరమైనవి కావు.‌ ఇలాంటివి భక్తిలో భాగం కావు. భక్తి అన్నది ఒక‌ సుఖానుభూతి. భక్తి అనేది‌ చిత్తనిరోధమా? కాదు, కాదు.‌ భక్తి అనేది చిత్తవృత్తి. భక్తి అనేది‌ ఒక‌‌ స్థితి.‌ మనిషికి భక్తి ఒక స్థితి అవాలి.

భక్తి అనేది “సా త్వస్మిన్ పరప్రేమ రూపా” అని‌ నారద భక్తిసూత్రం (2 వ సూత్రం) తెలియజేస్తోంది. అంటే భక్తి భగవంతుడిపై ఉన్న (అస్మిన్) పరమ‌ ప్రేమ రూపమే అని అర్థం. “లోతుల్లోకి దూకు మస్తిష్కమా, / భగవంతుడి‌ సౌందర్యమనే సాగరపు లోతుల్లోకి దూకు; / నువ్వు ఆ లో లోతుల్లోకి దిగినట్లయితే, / అక్కడ నువ్వు ప్రేమ‌ (భక్తి) రత్నాన్ని చూడగలవు” అని రామకృష్ణ పరమహంస చెప్పారు.

“దప్పికి నెండమావులు దాగ దగ్గఱఁ బోవుట
తప్పు చదువులలోఁ దత్త్వము నెంచుట,
పిప్పి చవి యడుగుట పెక్కు దైవాలఁ గొలిచి
కప్పిన శ్రీవేంకటేశు కరుణ సాధించుట”.

తప్పుడు చదువులలో తత్త్వాన్ని గ్రహించాలనుకోవడం దాహం తీఱ్చుకోవడానికి ఎండమావుల దగ్గఱికి వెళ్లడంలాంటిది. ఎన్నో ఇతర దైవాల్ని కొలిచి వ్యాపించి ఉన్న (కప్పిన) పరమాత్మ కరుణను పొందాలనుకోవడం అనేది పిప్పి రుచిని అడగడంలాంటిది అని చెబుతున్నారు అన్నమయ్య‌.

“చదువు మొదలయ్యే వాహకంలో లేదా పరిధిలో ఒక మనిషి తన భావి జీవనాన్ని ధ్రువీకరించుకుంటాడు” అని చెప్పాడు గ్రీక్ తాత్త్వికుడు ప్లెటొ (Plato). తప్పుడు చదువులు మనల్ని‌ చెడగొట్టాయి. మనకు పెద్ద ఎత్తున లభ్యమవుతున్నవి తప్పుడు చదువులే. వాటిని‌ చదివి‌, చదివి మనం తత్త్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. తప్పుడు‌ చదువుల ఎండమావులవల్ల మన దాహం తీఱడం‌లేదు; మనం అల్లాడుతున్నాం.

“యోయో యాంయాం‌ తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి / తస్య తస్యాచలాం శ్రద్ధాం‌ తామేవ విద ధామ్యహం” అనీ “అస్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసామ్ / దేవాన్ దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి” అని భగవద్గీత (అధ్యాయం‌ 7 శ్లోకాలు 21, 23)లో చెప్పబడింది. అంటే ఎవరెవరు ఏయే మూర్తులను భక్తి‌ శ్రద్ధలతో అర్చిస్తున్నారో వారి వారి మూర్తులపై ఉన్న శ్రద్ధను నేను స్థిరపఱుస్తున్నాను. అల్పబుద్ధి ఉన్నవాళ్లలో ఆ ఫలం ముగిసిపోయే‌ది అవుతుంది. దేవతల్ని పూజించే వాళ్లు దేవతల్ని పొందుతున్నారు. అయితే నా భక్తులు నన్ను పొందుతున్నారు అని అర్థం‌. ఈ భగవద్గీత ఉవాచనే అన్నమయ్య ఇక్కడ ఎన్నో ఇతర దైవాల్ని కొలిచి వ్యాపించి ఉన్న పరమాత్మ కరుణను పొందడం అనేది పిప్పి రుచిని అడగడంలాంటిది అని చెప్పారు. ఇతర దేవతల్ని పూజించే అల్పబుద్ధి ఆ ఫలం ముగిసిపోయేది అవుతుంది అన్న భగవద్గీత భావాన్నే అన్నమయ్య ఇక్కడ పిప్పి అని తెలియజేస్తున్నారు. ఇక ఈ‌ అన్నమయ్య సంకీర్తనను ఆస్వాదించి‌, ఆకళింపు చేసుకుని మనం సద్భక్తికి మాలిమి ఔదాం.

భక్తిపై సరైన‌ అవగాహననిచ్చే అభివ్యక్తి అయి ఆపై మనకు భక్తిపై‌ ఆసక్తిని, అనురక్తిని కలిగించేందుకై ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here