ప్రారంభించిన విక్రమ్ దేవ్ రావు
హైదరాబాద్, నవంబరు 08 : సేవకు పెద్ద పీట వేస్తూ ప్రారంభమైన సంస్థ అంచలంచెలుగా ఎదిగింది. హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణి కుముదిని దేవి అడుగుజాడలలో నడుస్తోంది. రామ్ దేవ్ రావు ఆస్పత్రి చరిత్రలో సేవ దిశగా మరో అడుగు పడింది.
సాధారణ ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్న సంస్థ ఆవరణలో ఇప్పుడు నర్సింగ్ కళాశాల ప్రారంభమైంది. రాణి కుముదిని దేవి తనయులు విక్రమ్ దేవ్ రావు, ఆమె కుటుంబ సభ్యులు, ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ కల్నల్ కమలాకర్, సి.ఇ.ఓ. డాక్టర్ యోబు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చైతన్య మెమోరియల్ ట్రస్ట్ తో సంయుక్తంగా రామ్ దేవ్ రావు ఆస్పత్రి యాజమాన్యం రాణి కుముదిని దేవి నర్సింగ్ స్కూలును ఏర్పాటు చేసింది. ఇందులో మూడు సంవత్సరాల జి.ఎన్.ఎం. కోర్సును, నాలుగు సంవత్సరాల బి.ఎస్.సి. నర్సింగ్ కోర్సును అందించనున్నారు.
నాలుగు అంతస్తుల భవనాన్ని విక్రమ్ దేవ్ రావు, హాస్టల్ భవనాన్ని మీరా రావు ప్రారంభించారు. రాణి కుముదిని దేవి చిత్ర పటాన్ని అపర్ణారావు ఆవిష్కరించారు. నర్సింగ్ కళాశాలకు డాక్టర్ క్వీన్ మేరీ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తారు.
రామ్ దేవ్ రావు ఆస్పత్రిలో ఇప్పటికే వివిధ విభాగాలున్నాయి. అనుభవజ్ఞులైన ఫిజిషియన్లు, నేత్ర వైద్యులు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. డయాలసిస్ కేంద్రంలో ప్రస్తుతం మూడు షిఫ్ట్ లలో రోగులకు సేవలు అందుతున్నాయి.
క్రిటికల్ కేర్ విభాగానికి డాక్టర్ శ్రీనివాస్ సామవేదం హెడ్ గా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ శ్యామల జోస్యుల, డాక్టర్ ధనలక్ష్మి, డాక్టర్ శ్రీనాధ్ రెడ్డి, డాక్టర్ రాహుల్ కుమార్ ఈ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు.