రంగుల రాట్నం ఆరంభం
ఆక్సిజన్ ఆఖరు చిత్రం
హైదరాబాద్ 11 : ప్రముఖ నటుడు చంద్ర మోహన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం గుండె సంబంధిత వ్యాధితో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. పాత్ర ఏదైనా అందులో మమేకం కావడమే ఆయన ప్రత్యేకత. హీరోయిన్ల హీరోగా ఆయనకు పేరు. ఆయనతో కథానాయికగా తెరంగ్రేటం చేసిన హీరోయిన్లు అందరు నట శిఖరాలను అధిరోహించారు. ప్రతి నటుడికి టాప్ సినిమా ఒకటి ఉంటుంది. చంద్ర మోహన్ కు అన్ని టాప్ మూవీస్. తొలి సినిమా రంగుల రాట్నం. చివరి సినిమా ఆక్సిజెన్. మిమిక్రి కళాకారులు అనుకరించలేని కంఠం చంద్ర మోహన్ ది.
ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 23, మే 1945లో జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు. 1966 లో ఆయన బి.ఎన్. రెడ్డి రంగుల రాట్నం చిత్రంలో తొలి సారిగా నటించారు. దర్శకులు బాపు, కె. విశ్వనాధ్ ఆయనలోని నట సౌరభాన్ని వెలికి తీశారు.
ప్రముఖ రచయిత్రి జలంధర చంద్ర మోహన్ సతీమణి. వారికి ఇద్దరు కుమార్తెలు మధుర మీనాక్షి, మాధవి.
తొలి సినిమా రంగుల రాట్నంలో నటనకు ఆయనకు నంది అవార్డు అందుకున్నారు. 1987లో చందమామ రావే చిత్రంలో నటనకు, అతనొక్కడే సినిమాలో సహాయ నటుడిగా నంది అవార్డులు పొందారు. 2005లో పదహారేళ్ల వయసు సినిమాలో నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాలతో చంద్ర మోహన్ కు మంచి పేరు వచ్చింది.
55 ఏళ్ల సినీ కెరీర్ లో 932 సినిమాలలో ఆయన నటించారు. సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని చంద్రమోహన్ అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉండేవారు. రంగుల రాట్నం విజయం సాధించిన తరవాత కూడా ప్రభుత్వోద్యోగానికి వెళ్లాలా? వద్దా? అని ఆలోచించారు ఆయన. సిరిసిరిమువ్వ, శుభోదయం, సీతామహాలక్ష్మి, పదహారేళ్ల వయసును మర్చిపోలేనని ఎప్పుడూ చెబుతుంటారు చంద్రమోహన్.
డబ్బులు దాచుకున్నవారికే విలువ ఉంటుందని కూడా ఆయన తన వద్దకు వచ్చే వారితో చెప్పేవారు. కేరక్టర్ ఆర్టిస్టుగా ఆయన రాణించారు. తమిళంలోనూ అనేక సినిమాలలో నటించారు. పౌరాణిక, కుటుంబ కథా పాత్రలలో ఒదిగిన చంద్రమోహన్ కు దర్శకుడు విశ్వనాధ్, గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వరసకు సోదారులు అవుతారు. సినిమాయే లోకంగా జీవించిన చంద్ర మోహన్ తెలుగు తెర ఉన్నంత కాలం గుర్తుంటారు.
హీరోయిన్ల హీరో చంద్ర మోహన్
Date: