రామానుజ వైభవం-3
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథ స్వామి, 9440103345)
విశిష్టాద్వైత సిద్ధాంత పరిపాలకులలో అతి ముఖ్యులు యామునాచార్యులు వారికి రామానుజాచార్యులు ఏకలవ్య శిష్యులు. రామానుజులకు ఆయన వద్ద శిష్యరికం చేసే భాగ్యం దక్కపోయినా ఆయన ఆశయాలు నెరవేర్చడంలో కృత కృత్యులయ్యారు. యామునల వారు పూర్వాశ్రమంలో (చిన్నవయసులోనే) పాండ్య రాజ్యాన్ని పరిపాలించారు. ఆయనను ‘అళవందార్’ (నన్ను కాపాడ వచ్చిన వారు)అనీ వ్యవహరిస్తారు. కుమారుడు వరరంగాచార్యులుతో పాటు మహా పూర్ణులు(పెరియనంబి), శ్రీశైలపూర్ణులు (తిరమలనంబి) కాంచీ పూర్ణులు (తిరుక్కచ్చి నంబి)తదితరులు వారి వద్ద శిష్యరికం చేశారు. తన తర్వాత విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు ఎవరు? అనుకుంటున్న ఆయనకు రామానుజులు స్ఫురించారు. ఒకసారి కాంచీపురం సందర్శనకు వెళ్లిన ఆయనకు యాదవ ప్రకాశుని వెంట అమిత తేజస్సుతో నడిచి వెళుతున్నబాల బ్రహ్మచారి (రామానుజులు)ని చూసి, మహాపూర్ణుల ద్వారా ఆయన విద్యావిజ్ఞాన వైభవాన్ని తెలుసుకున్నారు. విశిష్టాద్వైత సిద్ధాంత కేతనాన్ని దశదిశల ఎగురవేసే మహనీయుడు (రామానుజులు) ఆవిర్భవిస్తారని తమ తాతగారు నాథమునులు చెప్పిన మాటలు వారికి స్ఫురణకు వచ్చాయట. ‘భవిష్యదాచార్యులు’ ఎలా ఉంటారో తెలుపుతూ, అందచేసిన విగ్రహం ఇప్పడు సజీవ రూపం దాల్చిందా? అని భావించారు. రామానుజుల లీలలను యాదవ ప్రకాశకుల నుంచి తెలుసుకొని ఆయనే ‘భవిష్యదాచార్యులు’ అనే రూఢీకి వచ్చారు. ఆ బాలుడిని చేరదీసి, ఆశీర్వదించే వ్యవధిలేకపోయింది.
హస్తిగిరీశునికి యామునుల మనవి
‘మా తాత నాథమునుల వారు రాసిన ప్రబంధాలను సేకరించి వాటిలోని విశేషాలతో కొంత వ్యాఖ్యానం చేశాను. కానీ బ్రహ్మ సూత్రాలకు, ఉపనిషత్తులకు భాష్యం రాయవలసి ఉంది. వయసురీత్యా అశక్తుడను. నా తరువాత రామానుజుడే ఈ బాధ్యత తీసుకోవలసి ఉంది. అందుకు తగు ప్రయత్నం చేయాలి. ఆయనను శ్రీరంగానికి పంపాలి’ అని హస్తగిరీశీని (కంచి వరదరాజు)ప్రార్థించి శ్రీరంగానికి తిరుగు ప్రయాణమయ్యారు. ‘రంగనాథుడి సంకల్పం మేరకు ఆ దివ్య బాలుడు ఏ నాటికైనా నావద్దకు వస్తాడు’ అనే నమ్మకం. ‘కానీ ఎప్పుడు? వయస్సు మీద పడుతూ తనకు భగవంతుడి నుంచి ఎప్పుడు పిలువు వస్తుందో తెలియని స్థితి’అని మథనం మరోవైపు.
ఈలోగా యాదవ ప్రకాశుల వైఖరితో విభేదించిన రామానుజులు ఆయన శిష్యరికం నుంచి వైదొలగి స్వయం కృషితో శాస్త్రాభ్యాసం చేస్తున్నట్లు తెలిసి, తన లక్ష్యం నెరవేరగలదని యమానాచార్యులు ఆనంద పరవశులయ్యారు. తాము (శ్రీ యామునులు) రాసిన స్తోత్రరత్నంను రామానుజులకు వినిపించి రాదలసినదిగా పెరియనంబిని కోరారు. వరదరాజ సన్నిధిలో పెరియనంబి నోట ఆ రచనను విన్న రామానుజులు పరమానందభరితులై,విశిష్టాద్వైత సిద్ధాంతం గురించి మరింతగా తెలుసు కోవాలనుకుంటున్న తనకు ఇప్పటివరకు సరైన బోధకులు తారసపడలేదని,ఈనాటికి ఆ లోటు తీరబోతున్నదని,శ్రీరంగంలో ఆ మహ నీయుని దర్శన భాగ్యం కలిగించాలని ప్రార్థించారు.
రామానుజుల శ్రీరంగయాత్ర
రామానుజులు ఎంతో ఉత్సాహంతో మహాఫూర్ణులతో శ్రీరంగం చేరేటప్పటికే యామునాచార్యులు దేహత్యాగం చేశారని అశనిపాత సమాచారం అందింది. ఆయన వద్ద జ్ఞాన బోధ పొందాలనుకున్న రామానుజులకు, ఇటు ఆచార్యులు తమ మీద ఉంచిన బాధ్యత మేరకు రామానుజులను శ్రీరంగం తీసుకువచ్చినందుకు ఆనందిస్తున్న పెరియనంబికి నవ నాడులు కుంగిపోయాయి. మనసును చిక్కపరచుకొని ఆచార్యుల చరమదేహాన్ని దర్శించిన రామానుజులు, ఆయన చేతివేళ్లలో మూడు ముడుచుకొని ఉండడాన్ని గమనించి, కొంత సేపు ధ్యానంలోకి వెళ్లి, ‘ఆచార్యుల వేళ్లు మొదటి నుంచి ఇలాగే ఉండేవా?’ అని ప్రశ్నించగా, కాదని, ఇంతకు ముందే ఇలా అయ్యిందని అక్కడి వారు బదులిచ్చారు.
ఆచార్యుల ఆశయాలకు అంకితం
యామునాచార్యుల వారి చరమ ఆశయాలను ఊహించిన రామానుజులు, వారికి ప్రదక్షిణ చేసి, కుడిచేతిని పైకెత్తి, యామునార్యుల వారి పాదాల సాక్షిగా తన జీవితాన్ని అంకితం చేసి వారి మూడు ఆశయాలను సారారం చేస్తానని ప్రతినబూనారు. ‘విశిష్టాద్వైతాన్ని వృద్ధి పరచి, ఆసేతు హిమాచలం, ఆబాల గోపాలం వ్యాప్తికి పాటుపడతాను. జనులను పంచ సంస్కార పరాయణులుగా చేసి ద్రావిడ వేద ప్రవరుణులుగా, ధర్మ నిరతులుగా చేయ ప్రయత్నిస్తాను’ అనగానే ఆచార్యుల వారి ఒక వేలు మామూలుగా వచ్చింది. ‘పారాశర్యుని బ్రహ్మ సూత్రాలకు శ్రీభాష్యమనే వ్యాఖ్యానం రాసి, విరివిగా ప్రచారం చేస్తాను’ అని, ‘విష్ణుపురాణతత్త్వం రాసిన పరాశర మహర్షి రుణం తీర్చుకునేలా సర్వసద్గుణ సంపన్నుడు, సమర్థుడికి వారి పేరు పెట్టగలను’ అనడంతో మిగతా రెండు వేళ్లు తెరచుకున్నాయి.
వ్యాస పరాశరులకు శాశ్వత స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలని, తమిళ మహాకవులలో అగ్రేశ్వరుడు నమ్మాళ్వా రుకు ప్రేమ, గౌరవం సమర్పించాలని, బ్రహ్మ సూత్రాలకు విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానం రాయాలన్నది యామునుల జీవితాశయమని ఆ తరువాత అక్కడి వారు వివరించారు.
అలిగి కంచికి తిరుగు ప్రయాణం
అయితే యామునాచార్యులు లేని శ్రీరంగాన్ని ఊహించుకోలేకపోయారు రామానుజులు. వారి దర్శనానికి ఎంతో ఆతృతగా వచ్చిన తనకు ఆ అవకాశం లేకుండా పోయిందని, వారిని మరొక్కరోజు సజీవులుగా ఉంచినా ఆచార్యుల పాదసేకు నోచుకునేవాడినని, ఆ అవకాశ లేకుండా చేసిన నిర్దయుడు రంగనాథుని సేవించబోనని తీర్మానించు కున్నారు. అక్కడే ఉంటూ తమకు ఆధ్యాత్మిక అంశాలను బోధించాలన్న స్థానికుల ప్రార్థనను మృదువుగా తిరస్కరించి కంచికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పుడే వారి మాతృమూర్తి కాంతిమంతి కూడా పరమపదం చేరారు. బ్రహ్మసూత్ర, భాష్య రచనకు సిద్ధపడిన ఆయన, శంకర భగత్పాదులకు ప్రత్యాఖ్యానం చేయాలంటే వారితో సమాన పాండిత్యం సాధించాలన్న లక్ష్యంతో అధ్యయనం, తత్త్వచింతన పట్ల మరింత దృష్టి కేంద్రీకరించారు.
ఆశ్రమ దీక్ష
జీవిత భాగస్వామి రక్షాంబాళ్ (తంజమాంబ) విషయంలో అసంతృప్తులై ముప్పయ్యో ఏట సన్యసించారు. కంచిలోని అనంత సరస్సులో స్నానమాచరించి, వరద రాజ స్వామికి నమస్కరించారు. రామానుజుల భవిష్యత్తును నిర్ణయించినట్లుగా స్వామి వారు త్రిదండం, కమండలం, కాషాయ వస్త్రాలను ఇచ్చి సన్యాస దీక్షను అనుగ్రహించారు. ‘యతిరాజ’ అని అర్చక సమక్షంలో బిరుదును అనుగ్రహించారు. తన ఆవరణలోనే ఆయనకు ఒక కట్టడాన్ని మఠంగా ఉపయోగించాలని తన భక్తాగ్రేశ్వరుడు, స్వామివారి వార్తాహరుడు కాంచీపూర్ణుల ద్వారా సూచించారు. చిన్న వయస్సులోనే యతీంద్ర దీక్ష స్వీకరించిన రామాజనుజులకు అచిరకాలంలోనే శిష్యసంపద పెరగసాగింది. వారి మేనల్లుడు దాశరథి ప్రథమ శిష్యుడయ్యారు. వేదాంతంలో నిష్ణాతులైన ఆయన రామానుజులను సదా అనుసరించేవారు. కాంచీపురానికే చెందిన ధనవంతుడు కూరేశుడు సర్వస్వం త్యజించి రామానుజులను ఆశ్రయించి ముఖ్య శిష్యులుగా ప్రసిద్ధులయ్యారు. (వ్యాస రచయిత ప్రముఖ జర్నలిస్ట్)