రామానుజ వైభవం-6
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
రామానుజులు సమతావాదే కాదు అమిత సహనశీలి కూడా. విద్యార్థి దశ నుంచి ఆచార్య పీఠం అలంకరించిన తరువాత కూడా అడుగడుగు గండాలను ఎదురీది నిలిచారు. ఆ గండాలన్నీ మానవ కల్పితాలే కానీ భగవత్ సంకల్పితాలు కావు. అన్నిటిని ఈశ్వరేచ్ఛగానే భావించారు. భగవంతుడిపైనే భారం మోపారు.
ప్రేమను పంచి ఆధ్యాత్మికంగా ఉద్ధరించాలని నిరంతరం తపిస్తుండగా, వారి నుంచి ముప్పు ఎదురుకావడం ఏమిటి? అని కొంత ఆలోచనలో పడ్డారు.
తాను చెప్పదలచుకున్నది, న్యాయమనిపించుకున్నది గట్టిగా చెప్పారు. ఆచరించాలనుకున్నది అమలు చేశారు. ఆయనది ధర్మాగ్రహమే తప్ప అకారణ కోపం కాదు. కీడుకు యత్నించిన వారి పట్ల కరుణనే చూపారు.‘అపకారికి ఉపకారం’ అనే విధానం అవలంబించిన ఆయన శాంతిత్వం ముందు పగవారే పశ్చాత్తప్త హృదయులయ్యారు.
రామానుజులు తమ విద్వత్తునే తప్పుపడుతున్నారన్న అక్కసుతో ఆయనను అందమొందించాలని యత్నించి భంగపడ్డారు గురువు యాదవ ప్రకాశకులు. శిష్యుడు తనను మించిపోతాడన్న భయంతో ఇతర శిష్యుల సహకారంతో మట్టుపెట్టాలనుకున్నారు. కాశీ యాత్ర మిషతో గంగలో ముంచి చంపించాలనుకున్నారు. కాంచీపుర రాజకుమారిని పట్టిన బ్రహ్మరాక్షసిని వదిలించే ప్రయత్నంలో ఆయనను దానికే ఎరవేయాలనున్నారు. రామానుజులు అప్రమత్తం కావడంతో పాటు కంచి వరదరాజస్వామి కరుణతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన మాటల్లోని హేతుబద్ధత, తెలుసుకోవాలనే తపన తదితర లక్షణాలు గురువును ఆలోచింప చేశాయి. విజ్ఞానానికి వయసుతో సంబంధంలేదని, వయస్సుతోనే పెద్దరికం రాదని గుర్తించి శిష్యుడిగా మారారు. పంచ సంస్కారాలు పొంది ‘గోవింద జీయర్’ అనే పేరుతో సన్యసించారు. ‘యతిధర్మ సముచ్ఛయం’ అనే గ్రంథాన్ని రాసి పూర్వాశ్రమంలో శిష్యుడు, అనంతరం గురువు రామానుజ యతీంద్రులకు దానిని అంకితం చేశారు.
అష్టాక్షరి , చరమ శ్లోకార్థాన్నిసౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ గోపురం నుంచి బహిరంగపరిచినందుకు నరకానికి పోతావు అని శపించిన మరో గురువు గోష్ఠీపూర్ణులే శిష్యుడి ఉదాత్తభావం, సమాజ హితానికి ముగ్ధులై ‘నువ్వు నాకన్నా…మా అందరివాడికన్నా గొప్పవాడవు. నీ ఉన్నతాశయాల కారణంగా ‘వైష్ణవ దర్శనం ఇకపై రామానుజ దర్శనంగా వర్ధిల్లుతుంది’ అని ఆశీర్వదించారు. అనంతర కాలంలో రామానుజులకు కొందరు కీడుతలపెడుతున్నారన్న సమాచారంతో అన్నపానీయాలు స్వీకరించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయనే హెచ్చరించారు.
తమకు అడ్డుగా ఉన్న రామానుజులను తప్పించడంతోనే తనకు మనశ్శాంతని శ్రీరంగంలోని రంగన్నాథ ఆలయం ప్రధానార్చకుడు కుట్ర పన్నారు. అందుకు తన భార్యను సాధనగా వాడుకోవాలనుకున్నారు. ‘మన ఇంటికి భిక్షకు వచ్చే రామానుజులకు విషాన్నం వడ్డించాలని ఒత్తిడి తెచ్చారు. అటు పతియే ప్రత్యక్షదైవం. ఇటు అతిథి.పతికి ఎదురాడలేని పరిస్థితి. ధర్మ సంకటంలో పడిన ఆమె గుండెను దిటవు చేసుకొని కన్నీటితోనే ఆహారాన్ని వడ్డించింది. ఆమె కలతలో కీడు శంకించిన రామానుజాచార్యులు, విషాన్నంపై ఆమె పరోక్ష హెచ్చరికతో అప్రమత్తమై రంగనాథ సన్నిధికి చేరారు. విషయాన్ని ఎవరికి ఎరుకపరచుకుండా మామూలుగా వ్యవహరించసాగారు. అటు రామానుజుల ఆరోగ్యంలో ఎలాంటి తేడా రాకపోవడాన్ని గమనించిన ఆ అర్చకుడు, మరింత పగబూని, రంగనాథాలయంలో తీర్థప్రసాద వినియోగ సమయంలో తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజులు తరువాత పథకాన్ని ఆచరణలో పెట్టారు. రంగనాథ దర్శనం తరువాత రామానుజులకు ‘స్వామి పాదతీర్థం’ ఇచ్చారు. చేతిలో ఉన్న తీర్థం నీలిరంగులో విషమని అర్థమైంది. అలా అని దానిని విడువరాదు కనుక రంగనాథుని ‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ…’అని శరణాగతి చేసి, జీవితంపై ఆశ వదులుకొని తీర్థం స్వీకరించారు. మఠం చేరుకున్న రామానుజులకు అర్చకుడు ఊహించినట్లు ఈసారీ ఏమీ కాలేదు.
పైపెచ్చు భక్తులు సంకీర్తనలు చేస్తుండగా, యోగశక్తితో విప్పారిన ఆయన కన్నుల నుంచి ఆనందాశ్రువులు వర్షిస్తున్నాయి. రామానుజులు గోదావల్లభుడి చైతన్యరూపమని, భగవదవతారమనుకుంటూ ఆ అర్చకుడు ఆయన పాదాలపై వాలిపోయాడు. తన దురాగతానికి నిష్కృతిలేదంటూ రక్తధారలు కట్టేలా తలబాదుకున్నాడు. రామానుజులు ఆయనను అనునయిస్తూ ‘పతనమైన నీ ఆత్మను మేల్కొపాలని చేసిన విన్నపాన్ని రంగడు ఆలకించాడు. నీ పశ్చాత్తాపాన్ని స్వామి ఆమోదించాడు’ అంటూ చేరదీశారు. ప్రాణాంతకుడిని సయితం ప్రేమతో సంస్కరించిన కారుణ్యమూర్తి కాంతిమతీ తనయుడు.
బలవంతపు మతమార్పిడికి యత్నించిన చోళరాజైన క్రిమికంఠుడి (కులోత్తంగుడు) బారినుంచి శిష్యుడు కూరేశుడు సమయస్ఫూర్తితో బయటపట్టారు రామానుజులు. ‘స్వమతాన్ని గౌరవించు అన్యమతాలన ఆదరించు’ అనే నినాదానికి వ్యతిరేకి అయిన రాజు వైష్ణవులను శైవంలోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడట. అందుకు మమూలు వైష్ణవ సమూహంపై దృష్టి పెట్టడం కంటే జగద్గురువు రామానుజాచార్యల స్థాయి వారిని మార్చగలిగితే కార్యం సులువుగా చక్కబడుతుందన్న మంత్రి సలహా మేరకు ఆయనను ఎలా అయినా రప్పించాలని (అవసరమైతే బంధించాలని) భటులను పంపారు. ఆ సమయంలో ఆయన సంధ్యానుష్టాదులకు కావేరీ నదికి వెళ్లడంతో, ప్రమాదాన్ని పసికట్టిన మఠంలోని శిష్యుడు కూరేశులు తానే రామానుజ వేషంతో రాజసభకు బయలుదేరారు. అక్కడ మతంపై వాదోపవదాల అనంతరం కూరేశుల గుట్టురట్టయి, మతమార్పిడికి అంగీకరించకపోవడంతో ఆయన కనుగుడ్లు పెరికివేయలని రాజు ఆజ్ఞాపించాడు. దాంతో ‘రాజా! నిన్ను చూసిన ఈ కళ్లతో రంగనాథ పెరుమాళ్లను, గురువు రామానుజులను చూడలేను’అంటూ తన కనుగుడ్లను తానే పెరికి రాజుపై విసిరేసి సభను వీడారు. కుమారుడి సహకారంతో గురువు రామానుజులను వెదుకుతూ బయలుదేరారు.ఇతర శిష్యులతో అప్పటికీ శ్రీరంగం వీడిన రామానుజులు వివిధ దివ్యదేశాలు సందర్శిస్తుండగా యాదవాద్రిలో ఆయనను కూరేశులు కలుసున్నారు.తన కారణంగా శిష్యుడు బాధపడుతున్నందుకు మనస్తాపం చెందిన రామానుజులు కంచిలోని వరదరాజ పెరుమాళ్లను వేడుకొమ్మని సలహా ఇచ్చారు. తిరగి దృష్టిపై ఆసక్తి లేకపోయినప్పటకీ ‘ఆచార్యాజ్ఞను భగవదాజ్ఞ’గా భావించిన కూరేశులు కాంచీపురం చేరుకుని వరదరాజ స్తవంతో సంకీర్తన చేసి దివ్యదృష్టిని పొందగలిగారు.
‘రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే’ (వ్యాస రచయిత ప్రముఖ జర్నలిస్ట్)