పివిఆర్‌కె ప్రసాద్‌ ఎవరంటే…

1
408

ఆగష్టు 21 వర్ధంతి, ఆగష్టు 22 జయంతి
(జి. వల్లీశ్వర్)

ఒక రిటైర్‌ అయిన ఐఏఎస్‌ అధికారి విశిష్టత గురించి కొన్ని మాసాలపాటు సీరియల్‌గా ఏదన్నా పత్రికలో రాయాల్సి వస్తే అలాంటి వ్యక్తి ఒక్క పత్రి వేంకటరామకృష్ణప్రసాద్‌ మాత్రమే.
పివిఆర్‌కె ప్రసాద్‌గా బాగా గుర్తింపు పొందిన 1966 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి ఈ ఆగస్టు 21(2017) తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. రిటైర్‌ అయిన అధికారి గురించి రాయాల్సి వస్తే అంతా గతమే కదా ఉండేది అనుకుంటాం. కాని ఆగస్టు 19 తెల్లవారు జామున హాస్పిటల్‌లో చేరే చివరి నిమిషం వరకూ అసాధారణమైన ఉద్యమనాయకుడుగా అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్న వ్యక్తి శ్రీప్రసాద్‌.

ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ ధర్మాదాయశాఖ కింద ఏర్పడిన హిందూధర్మ పరిరక్షణ ట్రస్టు ఛైర్మన్‌గా 2015 లో బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ శ్రీప్రసాద్‌ ట్రస్టు లక్ష్యాలకోసం విరామం లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. 2015 డిసెంబరులో, 2017 ఫిబ్రవరిలో సుమారు 60 మంది వివిధ మఠాధిపతుల, పీఠాధిపతులతో ధార్మికసదస్సులు నిర్వహించి, అందరు ధర్మాచార్యుల్ని ఏకతాటిపై నడిపించే బృహత్కార్యాన్ని సాగిస్తున్నారు. ఇది ఆయన నాయకత్వసామర్థ్యానికి మచ్చుతునక.

1980-81 లో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నప్పుడు తిరుమల ఆలయంలో మూల విరాట్‌ విగ్రహానికి అష్టబంధనం జరిగింది.
తెల్లవారుఝామున అష్టబంధనంలో వాడాల్సిన నవరత్నాల సెట్లన్నీ ముందే తెప్పించుకుని పెట్టుకున్నా, అష్టబంధనం జరిగే కొన్ని గంటల ముందు ఒక సెట్‌ తక్కువైంది. ఆ రాత్రంతా తిరుపతిలో గాలించినా నవరత్నాలసెట్‌ దొరకలేదు.


అర్ధరాత్రి దాకా తిరుమల ఆలయంలో శ్రీనివాసుడి ముందు కూర్చుని, ప్రార్థించి, కన్నీళ్లు కారుస్తూ, గెస్టు హౌస్‌కి వెళ్లేసరికి, చెన్నై నుంచి వచ్చి సాయంత్రం నుంచి నిరీక్షిస్తున్న బిజినెస్‌ మాన్‌ దంపతులు “మేం చేయించి తెచ్చిన ఈ నవరత్నాల సెట్‌ అష్టబంధనంలో వాడండి సార్‌” అంటూ బ్రతిమాలుతున్నారు.
అంతే! వాణ్ణి (శ్రీనివాసుణ్ణి) నమ్ముకుంటే, అన్నీ వాడే ఇస్తాడు, చేస్తాడు అన్న నమ్మకం శ్రీప్రసాద్‌లో పాతుకుపోయింది.
ఇదే కాదు.

టిటిడిలో కాలినడకన వెళ్లే భక్తులకోసం ఎండావానల నుంచి రక్షణనిచ్చే షెల్టర్లు నిర్మించినా, కొండమీద తిరిగే యాత్రికుల కోసం ఉచితబస్సు సౌకర్యం కల్పించినా, నిత్యాన్నదానం పథకం ప్రవేశపెట్టినా, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ని సుసంపన్నం చేస్తూ నిర్మింపచేసినా, పాపనాశనం డామ్‌ని అధికప్రయోజనం లభించేలా నిర్మింపజేసినా, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు… వగైరా పలు ప్రాజెక్టుల్ని ప్రవేశపెట్టినా, పలు కొత్త సేవల్ని, సంస్కరణల్ని తిరుమల ఆలయ సేవల్లో తీసుకువచ్చినా, ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొని తిరుమల కొండపై మాస్టర్‌ ప్లాన్‌ అమలుచేసినా… ఆ ఘనతంతా శ్రీనివాసుడిది మాత్రమే అని చెప్పుకోవడం శ్రీ ప్రసాద్‌ లక్షణం.
ఇది ఆయన భక్తివిశ్వాసాలకి అద్దం పడుతుంది.


1985 లో సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌గా అనేక ఉద్యోగాలకు భారీఎత్తున రిక్రూట్‌మెంట్‌ చేపట్టారు శ్రీ ప్రసాద్‌. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా పరీక్షలు – ఇంటర్వ్యూలు జరుపుతున్నప్పుడు అకస్మాత్తుగా ప్రసాద్‌ని బదిలీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది.
అంతే!
ఉత్తర్వులు చేతికి వచ్చేదాకా నిరీక్షించకుండానే అప్పటికప్పుడు సమాచార పౌరసంబంధాల కమీషనర్‌ అధికారాల్ని డైరక్టరుకు అప్పగించి వెళ్లిపోయారు.

ఇంకో సంఘటన…

1991 లో వైజాగ్‌ పోర్టు ఛైర్మన్‌గా ఉన్న శ్రీ ప్రసాద్‌ని ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్‌ సెక్రటరీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. ఆయన వైజాగ్‌ నుంచి ఢిల్లీలో పనిచేస్తున్న నాకు ఫోన్‌ చేశారు. ఎయిర్‌పోర్టుకు రమ్మన్నారు. ఎయిర్‌పోర్టులో దిగుతూనే తన నియామకపు ఉత్తర్వుని నాకు చూపించారు.
“ఇది చదివి చెప్పు. నీకేం అర్థమవుతోంది?’’
నేను చదివి చెప్పాను. “మీరు కేంద్రప్రభుత్వ సర్వీసులో ఐదేళ్ల డెప్యుటేషన్‌లో ఉన్నారు. నాలుగేళ్లు పోర్టులో గడిచిపోయింది కాబట్టి మిగతా డెప్యుటేషన్‌ కాలం పూర్తయ్యేదాకా (ఏడాదిపాటు) ప్రధానమంత్రికి మీడియా సలహాదారుగా పనిచేస్తారు.’’
“అంతేకదా! ఏడాదికాలంలో ముగిసే పోస్టులో నేను పనిచేయాలా? ఈ పోస్టు అక్ఖర్లేదని పిఎంకి చెప్పడానికి వెళ్తున్నాను.’’
“ఎందుకు తొందరపడతారు? చేరిన తరువాత పిఎంకి ఇష్టమైనంతకాలం ఉంటారు కదా!’’
“అలా ఉండదు ఎడ్మినిస్ట్రేషన్‌లో. ఏడాదిలో పోయేవాడిమాట మనమెందుకు వినాలి అనుకుంటారు సిబ్బంది.’’
అంతే! ఆయన నేరుగా పిఎం దగ్గరకి వెళ్లి ఆ ఉత్తర్వు కాపీ ఆయనకి ఇచ్చేసి వచ్చేశారు. (తరువాత పిఎం ఆ ఉత్తర్వుల్ని మార్పించారు)
2004లో రాజశేఖ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ‘కన్సల్టెంట్ల నియామకాల్ని రద్దు చేస్తున్నాం’ అని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు సెక్రటేరియట్ దాటి బయటకు రాకముందే ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో తన (రిటెర్మెంట్ తరువాత కూడా లభించిన) డైరక్టర్ జనరల్ పోస్టు వదిలేసి ప్రసాద్ ఇంటికెళ్లిపోయారు. ప్రధానమంత్రి దగ్గరవున్నప్పుడు రాజశేఖర రెడ్డికి ప్రసాద్ చాలా సహాయం చేశారు. ఈ జిఓ రాగానే ఒక్కసారి వెళ్లి కనబడితే చాలు మంచి పోస్టు ఇచ్చుండేవారు సిఎం. కాని అలా పోస్టులకోసం వెంపర్లాడటం, పైరవీ చేయటం ఆయన ఎరుగరు.
ఎంత గ్లామర్‌ ఉన్న పదవి అయినా ఆయన ఏనాడూ వ్యామోహపడలేదు. తాపత్రయపడలేదు – అనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

విశాఖపట్నం పోర్టు ఛైర్మన్‌గా ఉండే రోజుల్లో ఒకసారి కుటుంబంతో పాటు ఊరికి వెళ్లి వచ్చారు.
తిరిగొచ్చాక ట్రైన్‌ దిగగానే వాళ్లను తీసుకువెళ్లటానికి రావల్సిన పోర్టు కారు రైల్వేస్టేషన్‌కి రాలేదు. “కారు ఎందుకు రాలేదు? పంపాల్సిన వాడు ఎందుకు పంపలేదు? ఎవడు దీనికి బాధ్యుడు…?’’ ఇలాంటి అధికారదర్పాన్ని ప్రదర్శించే మాటలు మాట్లాడకుండా వెంటనే ఆటో ఎక్కేసి బంగళాకెళ్లిపోయారు.
తిరుపతిలో టిటిడి ఈఓగా పనిచేసే రోజుల్లో కూడా ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు ఎవరికీ చెప్పకుండా కాలినడకన తిరుమల కొండ ఎక్కేసేవారు. తనను కలుసుకోవడానికి వచ్చే అతి సామాన్యుడికి సైతం అసంతృప్తి కలగకుండా మాట్లాడి పంపించేవారు.
ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర పనిచేసే రోజుల్లో కూడా ఏదైనా మార్కెటింగ్‌ లేదా సినిమాలు వంటి సొంత పనులకు వెళ్లాల్సి వస్తే, సొంతంగా కారు డ్రైవ్‌ చేసుకుని వెళ్లిపోయేవారు.
ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆయన నిరాడంబర జీవితాన్ని సూచిస్తాయి.

1986 – 87లో ఎక్సైజ్‌ కమీషనర్‌గా ఉండగా ప్రసాద్‌ కుమార్తెకు మద్రాసు (చెన్నై) లో ఒక మెడికల్‌ కాలేజీలో సీటు వచ్చింది. కాలేజి మంచిది.
కాని ఆ కాలేజి యాజమాన్యం అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో సారా కాంట్రాక్టర్లుగా ఉన్న ఒడయార్స్‌ బంధువులది. ఎడ్మిషన్‌ మెరిట్‌ మీద వచ్చినా, తాను ఎక్సైజ్‌ కమీషనర్‌గా ఉన్నాడు కనుక, తన నైతికత ప్రశ్నార్థకం అవుతుందని శ్రీ ప్రసాద్‌ భావించారు.
స్వయంగా ముఖ్యమంత్రి (ఎన్టీ రామారావు) ని కలిసి విషయాన్ని లిఖితపూర్వకంగా ఆయన ముందుంచి, “వాస్తవం ఇది. మీరు విచారణ చేసి, ఇందులో నేను ఎలాంటి అనైతికతకు పాల్పడ్డానని మీకు అనిపించినా నేను ఈ అడ్మిషన్‌ వదలుకుంటాను.’’ అన్నారు.
ఆ విషయంలో ప్రభుత్వం ఆయన పట్ల పూర్తివిశ్వాసాన్ని ప్రకటించింది.
ఎక్సైజ్‌ శాఖలో వున్నప్పుడే, లిక్కర్‌ వ్యాపారం చేసే బడా వ్యాపారవేత్త స్వీట్‌ పాకెట్‌లో లక్షరూపాయలుంచి ప్రసాద్‌కి ఇవ్వాలని ఆయన ఇంటికే వచ్చి ప్రయత్నం చేసినప్పుడు, తక్షణం అవినీతి నిరోధక శాఖకు ఫోన్‌ చేసి ఆ వ్యాపారవేత్తను పట్టించారు ప్రసాద్‌.
నైతిక విలువలకు శ్రీప్రసాద్‌ ఇచ్చిన ప్రాధాన్యత అలాంటిది.


విశాఖపట్నం పోర్టు ఛైర్మన్‌గా పనిచేస్తున్నప్పుడు కొత్తగా విజిలెన్స్‌ ఆఫీసర్‌గా వచ్చిన ధిల్లేశ్వరరావు అనే ఒక మాజీ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి పోర్టులో అవినీతి అధికారుల చిట్టాని శ్రీప్రసాద్‌ ముందుంచారు.
“ఈ చిట్టాలో ఉన్నవాళ్లంతా అవినీతిపరులే. వీళ్లందర్నీ నేను ట్రాప్‌ చేయగలను. లేదా సీబిఐ సహాయంతో చేయించగలను. ముందుగా ఎవర్ని చేయమంటారు సర్‌‘’ అని విజిలెన్స్‌ ఆఫీసర్‌ అడిగారు.
ఆ చిట్టా చూసి సంభ్రమంలో మునిగిపోయిన శ్రీప్రసాద్‌ చివర్లో ఉన్న తన ప్రైవేట్‌ సెక్రటరీని ముందు ట్రాప్‌ చేయమని అడిగారు.
అంతే!
విజిలెన్స్‌ ఆఫీసర్‌ చెప్పిన విధంగా, చెప్పిన సమయానికి ఆ ప్రైవేట్‌ సెక్రటరీ ఛైర్మన్‌ లేని టైంలో ఆయన ఛాంబర్‌లోనే ఉద్యోగం కోసం తిరుగుతున్న వ్యక్తి వద్ద లంచం తీసుసుకుంటూ పట్టుబడ్డాడు.
నీతిమంతమైన పాలన కోసం శ్రీప్రసాద్‌ తాపత్రయపడిన ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.


ఎన్‌ జనార్దన రెడ్డి ముఖ్యమంత్రిగా (1990-92) పనిచేస్తున్నప్పుడు 12 మెడికల్‌ కాలేజీలకి అనుమతిస్తున్నారంటూ కోర్టులో కేసు దాఖలైంది. కోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. జనార్దన్‌ రెడ్డి పదవి కోల్పోయారు.
1996 లో ఉన్నతవిద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు శ్రీప్రసాద్‌ ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌ డిమాండు దృష్ట్యా ఇంజినీరింగ్‌ కాలేజీలు ప్రారంభించాలని ప్రతిపాదిస్తే, జనార్దన్‌ రెడ్డి అనుభవ నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు సంకోచించారు. కాని శ్రీప్రసాద్‌ హేతుబద్ధమైన, నిర్మాణాత్మకమైన విధానం ద్వారా ఎలాగ ప్రతి రెవిన్యూ డివిజన్‌కి ఒక ఇంజినీరింగ్‌ కాలేజీని ఏర్పాటుచేయవచ్చో ప్రణాళిక రూపొందించి, ముఖ్యమంత్రిని ఒప్పించారు.
ఇవ్వాళ తెలుగువిద్యార్థులు ఇంజినీరింగ్‌ సీట్లకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లనక్కరలేకుండా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా ఇంజినీరింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయడానికి కారణం ఆ రోజు శ్రీప్రసాద్‌ దూరదృష్టి.
విశాఖపట్నం పోర్టు ఛైర్మన్‌గా కూడా ఆయన బాధ్యత స్వీకరించిన తొలి మూడు సంవత్సరాలపాటు (మొదటిసారిగా) ఆ పోర్టును జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టారు. పోర్టు భవిష్యత్తు (ఖనిజాల నిల్వల) అవసరాల కోసం హార్బర్‌లోని ఉద్యోగుల కాలనీని నగరం బయటకు తరలించి, ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా, అన్ని యూనియన్లను ఒప్పించి, కొత్తకాలనీలు కట్టించారు.
ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ‘కిలో 2 రూపాయలు బియ్యం’ పథకం అమలు చేస్తానంటే, సమాచార కమీషనర్‌ శ్రీప్రసాద్‌ ఒక సలహా ఇచ్చారు. “సర్‌, భవిష్యత్‌లో బియ్యం ధరలు పెరుగుతాయి. ప్రభుత్వం తట్టుకోలేదు. అందుకే ఈ పథకాన్ని ‘కిలో బియ్యానికి 2 రూపాయలు సబ్సిడీ’ అని మారుద్దాం. ఇప్పుడు బియ్యం ధర బయట మార్కెట్లో కిలో రూ.4. కాబట్టి సబ్సిడీ రూ. 2 లు ఇచ్చినా రేషన్ బియ్యం ధర కిలో రూ.2 గానే ఉంటుంది. భవిష్యత్తులో బియ్యం ధరలు ఎంత పెరిగినా ప్రభుత్వంపై పడే భారంలో మార్పు ఉండదు…’’ (ముఖ్యమంత్రి తన నిస్సహాయత వ్యక్తం చేశారు.)
ప్రసాద్‌ దూరదృష్టిని గురించి చెప్పాలంటే ఇలాంటి ఉదాహరణలు అనేకం!!


ఒక జర్నలిస్టు 1983 లో ఏం రాశారంటే…
1980 – 82 కాలంలో తిరుమలలో మాష్టర్ ప్లాన్ అమలుచేసి, తిరుమల ఆలయ పరిసరాల్ని అద్భుతంగా మార్చివేశారు శ్రీప్రసాద్. 1982 చివర్లో బదిలీ అయి వెళ్లిపోయారు. కాని ఆ మాష్టర్ ప్లాన్ అమలులో ప్రసాద్ చాలా దుర్మార్గంగా వ్యవహరించాడని దుమ్మెత్తిపోస్తూ “నీచుడు, దుష్టుడు” వంటి పదజాలంతో రాజధాని నుంచి వెలువడే ఒక వారపత్రికలో కథనాలు వెలువడ్డాయి. ఆ సంపాదకుడి దృష్టిలో ప్రసాద్ అప్పటి తిరుమల విషయాల్లో ‘దుర్మార్గుడు’.
1993 లో అదే జర్నలిస్టు ఢిల్లీలో ఒక ప్రముఖ దినపత్రికకు పని చేస్తూన్నప్పుడు ప్రధానమంత్రి మీద ఒక పుస్తకం రాశారు. ప్రధానమంత్రి జీవితకథకి సంబంధించిన ఆ పుస్తకం మార్కెట్ చేయటం కష్టమైంది. ఆ దశలో ఒక రోజు నేను ప్రసాద్‌గారి ఆఫీసుకి వెళ్లాను. అక్కడ ఆ జర్నలిస్టు రాసిన పుస్తకాల కట్టలు కనబడ్డాయి. “ఇవి ఇక్కడికెలా వచ్చాయి?” అని అడిగాను.
“అతను వచ్చాడయ్యా! పుస్తకానికి చాలా ఖర్చయిపోయిందని కష్టాలు చెప్పాడు. సాయం చేద్దామని తీసుకున్నాను….” అన్నారు మామూలు ధోరణిలో ప్రసాద్.
“మీ గురించి అప్పుడు ఎలా రాశాడో మర్చిపోయారా?’’
“పోన్లేవయ్యా. మనకి సాయంచేసే అవకాశం వుంది. అతనికి అవసరం వచ్చింది. చేస్తే పోలేదా?…”
అపకారికి ఉపకారం చేయటానికి మనసు రావాలంటే మనిషి ఎంత ఎదిగివుండాలి!
కౌన్సెలింగ్ చేయటం ప్రసాద్‌గారికి ఒక హాబీ. కెరీర్ కౌన్సెలింగ్, భార్యాభర్తల సంబంధాలపై కౌన్సెలింగ్, ప్రభుత్వంలో ఉద్యోగ సమస్యలపై కౌన్సెలింగ్… ఇలా ఎంతోమందికి ఆయన ఒక శాశ్వత కౌన్సిలర్‌గా వ్యవహరించారు.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే అపార్థాలు, విభేదాలు పరిష్కరించడంలో ఆయన నైపుణ్యం అసాధారణమైంది. విబేధాలు పరాకాష్ఠకు చేరుకున్న ఒక ఐఏఎస్ అధికారుల జంట కూడా ప్రసాద్‌గారి కౌన్సెలింగ్ ప్రయోజనం పొందారు. “విడివిడిగా ఆ ఇద్దరూ మంచివాళ్లయ్యా. కలిసి జీవించటంలోనే వాళ్లు కష్టపడ్డారు. వివేకవంతులు. వివాహబంధం విలువ ఏమిటో నేను చెబుతుంటే వినడానికి, సరిదిద్దుకోవడానికి ఇష్టపడ్డారు. ఇంక విడిపోరు…” సంఘటన జరిగిన రోజుల్లో ఆయన చెప్పింది ఇదే. ఆ జంట ఇప్పటికీ బాగున్నారు… ఇలా ఎన్నో కుటుంబాల్ని నిలబెట్టిన మానవ సంబంధాల నైపుణ్యం శ్రీప్రసాద్ సొంతం.


2006 లో ప్రసాద్‌గారి దగ్గర విశాఖ పోర్టులో పోర్టులో విజిలెన్స్ ఆఫీసర్‌గా పనిచేసిన థిల్లేశ్వరరావు అండమాన్ పోర్టులో చీఫ్ పోర్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా వుండగా అతని చేతిలో బాధితులైన స్థానిక డ్రగ్ మాఫియా కక్ష కట్టింది. స్థానిక సిబిఐ అధికారుల సహాయంతో ఒక తప్పుడు కేసుని బనాయించాలని యత్నించారు. థిల్లేశ్వరరావు సస్పెండ్ అయ్యారు.
ఆ వార్త విని ప్రసాద్ విలవిల్లాడిపోయారు. థిల్లేశ్వరరావు ఆయనకి బంధువు కాదు, ఆయన జిల్లా కాదు. కేవలం మెరిట్ మీద ఎంపికై విజిలెన్స్ అధికారిగా పనిచేసినవాడు. పోర్టు పాలనా యంత్రాంగాన్ని క్షాళన చేసే ప్రక్రియలో అతను పట్టుకున్నన్ని అవినీతి తిమింగలాల కేసుల్ని దేశంలో ఏ ప్రభుత్వసంస్థలోనూ ఏ విజిలెన్స్ ఆఫీసరూ చేయలేదు.
అందుకే ప్రసాద్‌గారు స్వయంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కి రాశారు- సిబిఐతో మాట్లాడారు. ‘‘ఇలాంటి తప్పుడుకేసుల్ని ప్రోత్సహిస్తే, దేశంలో నీతిమంతులంటూ ఎవరూ మిగలరు’’ అని ఘాటుగా చెప్పారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి శ్రీఎ.పి.వి.ఎన్.శర్మకి చెప్పి, పోస్టింగ్ వేయించారు.
2014లో కోర్టు తుది తీర్పు ఇస్తూ, సిబిఐకి మొట్టికాయలు వేసింది. సరైన సాక్ష్యాధారాలు లేకుండా సిబిఐ బాధ్యతారహితంగా వ్యవహరించిందని స్ట్రిక్చర్స్ రాసింది. ఆ తీర్పు వచ్చాక ప్రసాద్‌గారు తిరుమల దర్శనానికి వెళ్లారు.
‘‘వల్లీశ్వర్, ఈ గాడిద కొడుకుల్ని వదలకూడదు. తీర్పు పూర్తిపాఠం తెప్పించి, సమాచారం రడీ చేయి. ఈ సంఘటన మీద పత్రికల్లో ఒక వ్యాసం రాస్తాను’’ అన్నారు. అది జరిగే లోపలే వెళ్లిపోయారు.
నిజాయితీ కల అధికారుల్ని కాపాడుకోవాలన్న తపనకి ఆయన ఒక దర్పణం.

1984 – 85 లో సాంస్కృతికశాఖ కమీషనర్‌గా కూడా శ్రీప్రసాద్‌ వ్యవహరించారు.
సాంస్కృతిక శాఖకి పునర్‌వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా జానపద కళలని ప్రోత్సహించారు. ‘కళామంగళ’ అనే కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ప్రతి మంగళవారం ఉచితంగా ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని తమ శాఖ సమర్పించే ఏర్పాటు చేశారు. సురభి నాటకసంస్థలు జిల్లాల్లో సంచరిస్తూ నాటకాలు ప్రదర్శించేందుకు ప్రోత్సాహం అందించారు.
ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆంధ్రనాట్యాన్ని ఓరుగల్లు దగ్గర శివరాత్రి నాడు ప్రదర్శింపజేసి వెలుగులోకి తీసుకొచ్చారు.
అలాగే టిటిడిలో ఉండగా, డాక్టరు మేడసాని మోహన్‌ వంటి సాహితీవేత్తల్నీ, శోభారాజ్‌, బాలకృష్ణప్రసాద్‌ వంటి గాయకుల్ని ప్రోత్సహిస్తూ వెలుగులోకి తీసుకొచ్చారు.
సాహిత్యం, కళలు, కళాకారులు ఆయన మనసుకి ఎంతో ఇష్టమైన విషయం. హైదరాబాదులో టిటిడి పరంగా ఉగాది ఉత్సవాన్ని ప్రవేశపెట్టిన ఘనత శ్రీప్రసాద్‌దే.


పాలనా సామర్థ్యం, దూరదృష్టి, ప్రణాళికారచనలో నైపుణ్యం, నీతి – నియమాలు, నిరాడంబరత, సత్యసంధత, నమ్మిన లక్ష్యం కోసం నిలబడే ధైర్యం, నిబద్ధత, సంగీతం, సాహిత్యం కళలపట్ల మక్కువ, విజయం – పరాజయం రెండూ భగవంతుని అనుగ్రహమే అని నమ్మే భక్తివిశ్వాసాలు, ధర్మబద్ధమైన జీవితాన్ని రాబోయే తరాలకి అందించాలన్న తపనతో ధార్మిక ఉద్యమానికి రిటైర్‌మెంట్‌ అనంతర జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తిత్వం… ఇవన్నీ కలబోస్తే కనిపించే రూపం శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌.
ఆయన సంపూర్ణ వ్యక్తిత్వానికి అద్దం పట్టేవే ఆయన రచనలు ‘నాహం కర్తా, హరిః కర్తా’, ‘తిరుమలలీలామృతం’, ‘తిరుమలచరితామృతం’, ‘అసలేం జరిగిందంటే…!’ (Wheels Behind the Veil).


(వ్యాస రచయిత ప్రముఖ జర్నలిస్ట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here