మహామహులను స్మరించిన రాష్ట్రపతి
విజయవాడ, డిసెంబర్ 4: ప్రేమ భాషకు అడ్డంకి కాదు… మీ అభిమానానికి ధన్యవాదాలు… ఈ మాటలన్నది రాష్రపతి ద్రౌపదీ ముర్ము. రాష్ట్రపతిగా ఎన్నికైన అనంతరం తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసిన ముర్ము తనకు జరిగిన పౌరసన్మాన సభలో మాట్లాడుతూ ఈ మాటలను తెలుగులో అన్నారు.
ఆమె తన ప్రసంగంలో కూచిపూడి నాట్యం, రచయిత్రి మొల్ల, గురజాడ అప్పారావు, అల్లూరి సీతారామ రాజు, ఎల్లాప్రగడ సుబ్బారావుల పేర్లను ప్రస్తావించారు వారి గొప్పతనాన్ని ప్రస్తుతించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ కొనియాడారు.
కన్యాశుల్కం లాంటి గొప్ప నాటకాలకు ఏపీ వేదికగా నిలిచిందన్నారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో ఏపీ ప్రభుత్వం ఆమెకు పౌర సన్మానాన్ని ఏర్పాటుచేసింది.
ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు.