Monday, March 27, 2023
HomeCinemaనవ వసంత రాగం - శత వసంత గానం

నవ వసంత రాగం – శత వసంత గానం

నేడు ఘంట‌సాల శ‌త జ‌యంతి పూర్తి
(వాడ‌వ‌ల్లి శ్రీ‌ధ‌ర్‌, హైద‌రాబాద్‌)

అతడు ప్రసన్న మధుర భావార్ద్రమూర్తి , సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి, లలిత గాంధర్వ దేవత కొలువుదీరు కలికి ముత్యాలశాల మా ఘంటసాల అన్న జంధ్యాల పాపయ్యశాస్త్రి (కరుణశ్రీ ) మాటలు ఆక్షర సత్యాలు. ఆ తెలుగు గళం మధుకోశం. తెలుగు సినీ సంగీత సాగరంలో ఎగసిన ఉత్తుంగ తరంగం. ఆయన పాడని పాటలేదు. పాడకుండా వుండని పూటలేదు. ఆబాలగోపాలాన్ని మేల్కొలిపే భూపాల రాగం. పడమట సంధ్యారాగం. ఆ గానం జడిలో తడిసిన స్వరాల సారంగం అది పిలుపో, మేలుకొలుపో, ప్రణవ నాదమో, స్వర్గసీమలో ప్రభవించిన గంధర్వ గానమో, తెలుగింటి లోగిళ్ళలో ప్రతిధ్వనించిన సుప్రభాతమో, సామవేద సారాన్ని తన గొంతుకలో దాచుకొని, తన గాత్రంతో సినీ జగాన్ని, శ్రోతలని మంత్ర ముగ్దులని చేసిన మానవుడు, మాననీయుడు, మధుర గాయకుడు, ఘంటసాల వేంకటేశ్వర రావు. నవ వసంత రాగము ఆలకిస్తే మనసు పరిమళిస్తుంది. తనువు పరవశిస్తుంది.


మౌనంగానే మనస్సుపాడిన వేణుగానాన్ని విని రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య అని పిలిచినా ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా అంటూ వేడుకొన్నా మనసు పులకరిస్తుంది. ఆ గానం పరిమళిస్తుంది. విషాదాన్ని విరహాన్ని వైవిధ్యంగా పలికించగల స్వరం అది. జోరుగా హుషారు తెప్పించే గీతాలు చిటపటచినులకు సైతం వెచ్చ‌ని హాయిని కలిగిస్తాయి. నీలాల మేఘమాల నుంచి అమృతవర్షాన్ని కురిపిస్తాయి. నల్లని రాళ్ళను కరిగించి సంగీత శిల్పాలుగా మార్చేస్తాయి. జగమే మాయ బ్రతుకే మాయ అని వేదాంతాన్ని బోధిస్తాయి. ఏనిషానికి ఏమిజరుగునో అని హెచ్చరిస్తాయి. కుడి ఎడమై ఎడమైతే పొరపాటు లేదని రాజీ ధోరణి అవలంబిస్తాయి. స్వరలహరిలో జగాన్ని ఊయలలూపుతాయి కాబట్టె అ గీతాలు ఆపాత మధురాలు. కళాసాగర మధనం నుంచి ఉద్బవించిన గానామృతం, భగవద్గీత ప్రబోధంతో పునీతమైంది , శ్రీకైవల్య పదాని పొందింది . నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు వేళ ఆ స్వరం షడ్యమం, ఆ రాగం రిషభం, ఆ గానం గాంధారం, ఆ మాధుర్యం మధ్యమం, ఆ పాట పంచమం, ఆ ధ్వని దైవతం. ఆ నాదం నిషాదం. సప్త స్వర సమ్మిళితమైన మధురస గాన పాఠశాల ఘంటసాల. ఆ అమర గాయకుని జయంతి సందర్భంగా సభక్తికంగా సమర్పిస్తున్న అక్షరాంజలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ