సినిమా తోటలో విరబూసిన రోజా
(వాడవల్లి శ్రీధర్)
సినిమా తోటలో విరబూసిన రోజా బహుముఖ తేజ. ఖద్దరు రాజకీయాలలో ఖలేజా న్యాయనిర్ణేతగా వేదికపై హ్యస్యాన్ని ఆస్వాదిస్తూ తనదైన కామెడి పంచ్ లను వేస్తూ ఆందిస్తుంది జబర్దస్త్ మజా. ధీటైన మేటి నటన ఆందించే ఘాటైన పారిజాతమది, అందంతో చాలాకీగా చమ్మక్కున మెరిసిన చామంతి ఈ ఇంతి నవ్వులు రువ్వే రోజా. నవరస నటనామృతం తో నిండిన నాజూకైన కూజ పరవశాన్ని పంచే బహుముఖ ప్రజ్ఞా తేజ సినీ నటి రోజా. ఎంచుకున్న రెండు రంగాల్లోనూ ఉన్న హద్దులు చెరిపేసి తన స్వత్రంత శైలిలో ముందుకు దూసుకుపోయిన ఆమె నైజమే. ఆమెకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.” ఇత్తడైపోద్ది’” అన్న డైలాగుతో మాస్ ప్రేక్షకుల మదిని దోచుకున్న పుత్తడి బొమ్మ.
అసలు పేరు శ్రీలత . తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ పొందారు. రోజా కూచిపూడి నాట్యం నేర్చుకొన్నారు. సినిమాల్లోకి రాకముందు ప్రదర్శనలు ఇస్తుండేవారు. సర్పయాగం సినిమాతో పరిచయం అయ్యారు. నటనని తపస్సుగా భావించి తను నమ్మకున్న కళను ప్రేమించి ప్రేమ తపస్సు చిత్రంలో నటించారు. సెల్వమణి దర్శకత్వంలో చామంతై ప్రేక్షకుల మనస్సు దోచిన తెలుగింటి ఇంతి. నవ్వుల వెన్నెల మోముతో నటనకు నగిషీలు చెక్కిన వెండితెర వన్నెల సత్య భామ. మత్తుగా గమ్మత్తుగా పసిడి వయస్సు మిస మిసలతో వెండితెరపై మెరిసిన తారక.
“మాఘమాస వేళలో మల్లె పూల మాలగ మరుని గూడి మెల్లగా మరలి రావె చల్లగా మదిలో మెదిలే మధువై” సీతారత్నం గారి అబ్బాయి మనస్సు దోచుకున్న ముగ్ధమనోహరి . కలగా వచ్చి పోకిరిరాజాకి గిలిగింతలు పెట్టిన బ్యూటీ రోజా. రాజశేఖరా అంటూ ఘాటైన పారిజాత పరిమళాన్ని ముఠామేస్త్రితో పంచు కున్న పాలస్త్రీ . ‘‘మొగుడుగారు’, ‘ముగ్గురు మొనగాళ్లు పోలీస్ బ్రదర్స్ ‘శుభలగ్నం, ‘బిగ్ బాస్, ‘మాతో పెట్టుకోకు ‘పోకిరిరాజా ‘ఘటోత్కచుడు’ ‘టోపీ రాజా స్వీటీ రోజా ‘స్వర్ణక్క ‘తిరుమల తిరుపతి వెంకటేశా, ‘ఫామిలీ సర్కస్, ‘దుర్గ, ‘సమ్మక్క సారక్క, భైరవద్వీపం వంటి చిత్రాలు అమె ప్రతిభకు ప్రతీకలై నటజీవితంలో విజయాలని తెచ్చిపెట్టాయి.
వైఫల్యాలకు కుంగిపోక అలుపెరుగని పోరాటాన్ని చేసిన ధీరవనిత. కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళా మనువొక రసలీలా పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగనము విడిచిన తారక సెల్వమణీ జీవితభాగస్వామిగా తళుకుమని చేరింది. 1991లో ‘సర్పయాగం’ సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకొన్నారు. 1994లో ‘అన్న’ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డును. 1998లో ‘స్వర్ణక్క’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు. ‘ఉన్నిదతిల్ ఎన్నై కొడుతేన్’ అనే తమిళ సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చిత్ర పురస్కారాన్ని 1998లో అందుకొన్నారు.
సొంతలాభం కొంతమానుకొని పొరుగువారికి తోట్పాటు ఆందించాలన్న లక్ష్యంతో జెండా ఏదైనా అమె ఎజెండా నియోజకవర్గ ప్రజాసంక్షేమం. ప్రత్యర్దులకు తనదైన శైలిలో సమాధానమిస్తూ, కుహనా రాజకీయకుయక్తులను ఎదుర్కోంటూ, రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, మహిళా సాధికారత సాధన కొరకై ఉద్యమిస్తూ, ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దారనేర్పించినన్ అన్న చిలకమర్తి మాటకు అక్షర సాక్ష్యం గా నిలిచి వెండితెరపై బుల్లి తెరపై వెలుగులు జిమ్మతూ, ప్రజా సంక్షేమానికై నిరంతరం శ్రమించే నారీమణి. సెల్వమణి రోజా గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. November 17th Actress Politician Roja Birth day (వ్యాస రచయిత ప్రముఖ సినీ విశ్లేషకుడు)