నారీశక్తి ఎదుగుదలకు విపక్షం అడ్డుకట్ట
బిల్లును ఓడగొట్టి సంబరాలా
జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 18: విపక్షాలు ఏకమై మహిళల కళలను ధ్వంసం చేశారని ప్రధాని నరేద్ర మోడీ మండిపడ్డారు. కాంగ్రెస్, డి.ఎం.కె., టి.ఎం.సి., సమాజ్ వాదీ పార్టీ కలిసి మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నాయని ఆరోపించారు. ఇది భ్రూణ హత్యలతో సమానమని చెప్పారు. మహిళా బిల్లును ఓడగొట్టి వారు సంబరాలు చేసుకున్నారని, దీనికి ఆయా పార్టీలు ఫలితాన్ని అనుభవిస్తాయనీ చెప్పారు. వారి స్వార్ధ రాజకీయాలకు బిల్లు బలైందన్నారు. ఇది మహిళల ఆత్మాభిమానంపై దాడిగా ఆయన అభివర్ణించారు. నలభై ఏళ్లుగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు ఎలా అడ్డుకున్నాయి అందరం చూశామన్నారు. దీనిని మహిళలు ఎప్పటికీ మరిచిపోరని మోడీ స్పష్టం చేశారు. రేజర్వేషన్ల కోసం మహిళలు ఎన్నో ఏళ్లుగా పోరాడారని, వారి కళలను ప్రతిపక్షాలు ధ్వంసం చేశాయని చెప్పారు. వీరిని మహిళలు తప్పని సరిగా శిక్షిస్తారన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు దక్కేలా బిల్లును తెచ్చామని తెలిపారు. కాంగ్రెస్, డి.ఎం.కె. టి.ఎం.సి, సమాజ్ వాదీ పార్టీలు పార్టీలోని మహిళలను ఎప్పటికీ ఎదగనివ్వరని మోడీ చెప్పారు. అవి కుటుంబ పార్టీలని ఆయన ఆరోపించారు. బిల్లు క్రెడిట్ మీరే తీసుకోవాలని ప్రతిపక్షాలకు విన్నవించామని ప్రధాని చెప్పారు. పదేపదే చెప్పినా దీనిని వారు అంగీకరించలేదని విచారం వ్యక్తం చేశారు.
పరాన్నజీవిలా కాంగ్రెస్
డెలిమిటేషన్ కారణంగా ఏ పార్టీకి నష్టం వాటిల్లదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవిలా తయారైందని మోడీ ఎద్దేవా చేశారు. ఇతర పార్టీలతో జత కట్టకపోతే ఆ పార్టీకి మనుగడ లేదని చెప్పారు. ప్రజలను విభజించి లబ్ది పొందాలన్నది ఆ పార్టీ ఆలోచన అని ఆరోపించారు. ఆ పార్టీ ఎప్పుడూ సంస్కరణలకు వ్యతిరేకమని విమర్శించారు. డీలిమిటేషన్ సాకుగా చూపి కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును అడ్డుకుందని మోడీ విమర్శించారు. బిల్లు ఆమోదం పొందితే అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరిగేవని చెప్పారు.


Appreciate the effort you put into this.