సానుభూతే అస్త్రం …. కులాల కుమ్ములాటలే పాశం
ప్రధాన మంత్రి అయ్యే సీన్ ఆయనకు ఉందా?
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
ప్రశాంత్ కిషోర్ ప్రధాన మంత్రి అవుతారా? ఇది అందరి మనసుల్నీ తొలుస్తున్న ప్రశ్న. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. అసలు ఎవరీయన? ఆయనకు అంత ప్రాధాన్యత ఎలా వచ్చింది? ప్రత్యర్థి పార్టీకి సలహాలు ఇస్తున్నారని తెలిసి కూడా ఆయనను సలహాదారుగా నియమించుకుంటున్నారంటే పీకే పట్ల ఉన్న విశ్వాసం వెల్లడవుతోంది. 2012లో గుజరాత్‌లో బీజేపీ విజయంలో కీలక భూమిక నిర్వహించిన దగ్గర్నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో ఆయనకు అంతులేని ప్రాధాన్యత లభిస్తోంది. నాలుగు రోజుల్లో మూడు సార్లు ఆయన సోనియాతో భేటీ అవ్వడం దీనికి సూచిక. ప్రశాంత్ కిశోర్ చేసిన ప్రతిపాదనలకు రాహుల్ గాంధీ ఆమోదం తెలిపినట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఆ ప్రతిపాదనలు ఏమిటనేది వెల్లడికాలేదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పీకే నియమితులవుతారని ఒక వార్త ప్రచారంలో ఉంది. తనను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే, తన శాయశక్తులా కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి ప్రయత్నిస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నట్లు కూడా మరొక వార్త ప్రచారంలో ఉంది. ఇలాంటి అవకాశం లేకపోలేదు.
2014 ఎన్నికలలో నందన్ నీలేకనీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసుకుని కాంగ్రెస్ బరిలోకి దిగిన విషయం దేశ ప్రజల మనోఫలకాలపై నుంచి ఇప్పటికీ చెరిగిపోలేదు. నీలేకని సాంకేతిక నిపుణుడు. ఆధార్ ప్రాజెక్టు ఆయన చేతుల మీదుగానే రూపుదిద్దుకుంది. పీకే ఇప్పటి తరం వ్యూహకర్త. చిన్న కర్రతోనైనా పెద్ద పామును కొట్టగల సమర్థుడు. దేశంలో కులాలు, నిష్పత్తులు, ఏ కులంలో ఎవరు బలీయులు, ఎవరిని పట్టుకుంటే ఆ కులం లొంగుతుంది? ఏం చేస్తే తనను నమ్ముకున్న పార్టీ అధికారంలోకి వస్తుందీ అన్న అంశాలు క్షుణ్ణంగా ఒంటబట్టించుకున్నవాడు. సో… అందర్నీ అందలమెక్కించే బదులు మనమే అందలం ఎక్కితే పోలా అని ప్రశాంత్ కిషోర్ అనుకున్నా తప్పులేదు. ఆయన అడుగులు ఆ దిశగానే పడుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అదే నిజమై ఆయన అందలమెక్కితే…భారత్‌కు అంతకు మించిన ఘోరమైన దశ మరోటి ఉండదు. అసలు ఆయన ప్రధాని అవుతారా లేదా అన్నది పక్కన పెడితే ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి..చూద్దాం…
ఐక్యరాజ్య సమితిలో విధి నిర్వహణ
బీహార్ రాష్ట్రంలోని సాసారం జిల్లా కోరన్‌లో జన్మించారు ప్రశాంత్ కిషోర్. వయసు సుమారు 45 ఉండొచ్చు. రాజకీయ వ్యూహకర్తగా మారడానికి ముందు ఎనిమిదేళ్ళపాటు ఐక్యరాజ్య సమితి ఆరోగ్య విభాగంలో పనిచేశారు. ప్రజారోగ్యంలో శిక్షణ పొందారు. 2012 ఆయన గుజరాత్‌లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఆ పార్టీని మూడోసారి అధికారంలోకి వచ్చేలా కృషి చేశారు. ఆ సమయంలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీయే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. గుజరాత్ వెలిగిపోతోంది అనే అర్థం వచ్చేలా ఆ రాష్ట్ర ప్రగతిని నూరింతలు చేసి చూపారు. ఫలితంగానే బీజేపీ అక్కడ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.
తదుపరి 2014 సాధారణ ఎన్నికలలో బీజేపీ అందలం ఎక్కేందుకు వ్యూహాలను రచించి కృతకృత్యుడయ్యారు. 2015లో బీహార్‌లో జేడీ(యు)కు పనిచేశారు. 2019లో బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారనీ వార్తలు వినవచ్చాయి. 2017లో కాంగ్రెస్ పంజాబ్‌లో ఆయన సాయం కోరింది. పీకే సలహాలతో పంజాబ్ పీఠాన్ని దక్కించుకుంది. ఇదే ఊపుతో 2019లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు వ్యూహకర్తగా కాంగ్రెస్ నియమించుకుంది. ఆ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యారు. దీనికి కేవలం ప్రశాంత్ కిషోర్ ఒక్కడే కారణం కాదు. కాంగ్రెస్ అంతర్గత కలహాలు ఆ పార్టీ పరాజయానికి కారణమయ్యాయి.
పార్టీ ఏదైనా గెలుపే లక్ష్యం
2019లో ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్, 2020లో ఢిల్లీలో ఆప్, 2021లో వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీలకు పనిచేసి, వాటి విజయంలో కీలకపాత్ర పోషించారు. వైయస్ఆర్ కాంగ్రెస్, ఆప్, టిఎమ్సీలు అప్రతిహత విజయాన్ని సాధించాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా స్థానాలు సంపాదించాయి. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ 175 స్థానాలకు 151 స్థానాలను గెలుచుకుంది. ఢిల్లీలో 70 సీట్లకు 62 స్థానాలను ఆప్ గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్‌లో టిఎమ్సీ 294 స్థానాలకు 201 స్థానాలను గెలుచుకుంది. 2019 ఎన్నికలకు ముందు వైయస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో ఓ దుండగుడు కోడి కత్తితో దాడిచేశాడు. దానిని హత్యా ప్రయత్నంగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది.
ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో చీటికీ మాటికీ కయ్యానికి దిగుతూ తనకు అన్యాయం జరిగిపోతోందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళేలా వ్యవహరించారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ ఒక తోపులాటలో గాయపడ్డారు. ఆమె గాయపడిన చిత్రాలను ప్రముఖంగా ప్రచారం చేసుకోవడమే కాకుండా, వీల్ చైర్లో తిరుగుతూ సానుభూతినీ, దానితో పాటు విజయాన్నీ కొల్లగొట్టారు.
ఈ మూడు సందర్భాలలోనూ సానుభూతి ఆయా పార్టీల విజయానికి ఒక కారణమైందని చెప్పవచ్చు. తొలిసారి ఆయన గుజరాత్‌లో ప్రగతిని ప్రచారం చేసి, పాజిటివ్‌గా వెళ్ళారు. తదుపరి సానుభూతి అస్త్రాన్ని ఎంచుకున్నారు. ఈ అంశాన్ని ఆయా పార్టీల నేతలు అంగీకరించకపోవచ్చు గానీ, ఇది పీకే బ్రహ్మాస్త్రమే.
గాయాలూ…సానుభూతిని ఓట్లుగా మార్చే శక్తి
ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరితే, ఆ పార్టీకి చెందిన కీలక నేత గాయాలకు గురికావచ్చు. ఏమో ఏదైనా జరగవచ్చు. అధికారం కోసం సానుభూతి పవనాలను ఆశ్రయించడం భారత రాజకీయాలకు కొత్తకాదు. ఎమర్జెన్సీ తరవాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ఇందిరను అరెస్టు చూసి, ఆమెపై సానుభూతికి కారణమైంది. తదుపరి ఇందిర హత్యతో వెల్లువెత్తిన సానుభూతితో కాంగ్రెస్ మూడింటా రెండొంతుల మెజార్లీతో అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఇందిర కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధాని అభ్యర్థి. ఇలా చెప్పుకుంటూ పోతే సానుభూతి కథలు భారత రాజకీయాల్లో కోకొల్లలు.
పీకే దీనిని కూడా వాడుకుంటున్నారు. ఆయన ప్రధాన అస్త్రం కులాలు. కులాల వారీగా ఓటర్లను చీల్చేశారు. బలీయమైన నాయకులను సైతం ఓడించే టాక్టిక్స్‌ను ఆయన ఈ అస్త్రంతో అలవరచుకున్నారు.
సి.ఎ.జితో సంచనాలు
2013లో ఆయన నెలకొల్పిన సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్‌తో సంచలనాలు సృష్టించారు. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. చాయ్ పే చర్చ, త్రీడీ ప్రచారాలకు ఆయన శ్రీకారం చుట్టారు. రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమాన్నీ ఆయన ప్రారంభింపజేశారు. ఇవన్నీ ఓటర్లపై అంతులేని ప్రభావాన్ని చూపాయి. 2014లో బీజేపీకి సూపర్ విక్టరీని కట్టబెట్టాయి. 2014 ఎన్నికల తరవాత సిఎసి ఐప్యాక్‌గా మారింది.
ఐప్యాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. 2019లో ఐప్యాక్ ప్రజా సంకల్ప యాత్ర, అన్న పిలుపు, సమర శంఖారావం వంటి కార్యక్రమాలతో వైయస్ఆర్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది. విభిన్న కార్యక్రమాలతో, వ్యూహాలతో వివిధ పార్టీలను అధికార పీఠాలపై కూర్చోబెట్టిన ప్రశాంత్ కిషోర్ తాను అధికారంలో కూర్చోవాలని భావించడం సహజం. అది 2024లో సాధ్యం కాకపోవచ్చు. ఆయన ప్రణాళికలు 2029 లక్ష్యంగా సాగుతూండచ్చు. ఈలోగా భారత రాజకీయాలలో ఏమైనా సంభవించవచ్చు.