అధికారులను కదిలించిన కథనాలు ఎన్నో
నక్సల్స్ కూడా అంగీకరించిన వార్తలు
ఈ వార్తలు రాసినది అడ్డతీగల సత్యనారాయణ…
ఈనాడు – నేను: 38
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)

ఈ ఎపిసోడ్ ప్రారంభించే ముందు ఈనాడు సమీక్ష ఇన్ హౌస్ మ్యాగజిన్ గురించి కొంత వివరించాలి. డెస్కుల్లో జరిగిన తప్పులను, అందుకు దారితీసిన విధానాన్ని ఇందులో వివరిస్తారు. దీనిని ఈనాడు క్వాలిటీ డెస్క్ నిర్వహిస్తుంది. మేజర్ మిస్టేక్ జరిగితే అది ఎలా జరిగిందీ వివరిస్తూ సంబంధిత డెస్క్ ఇంచార్జి కూలంకషంగా ఒక నోట్ ఇస్తారు. దీనికి ముందు క్వాలిటీ సెల్ ఆ డెస్కును వివరణ అడుగుతుంది. మొత్తం అంతటినీ ప్రోది చేసి సమీక్షలో ప్రచురిస్తారు. దీనివల్ల కొత్త సబ్ ఎడిటర్స్ కి మార్గనిర్దేశనం చేసినట్టవుతుంది. రామోజీ రావు గారు తరచూ ఒక మాట అనేవారు. తప్పు చెయ్యండి… కానీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చెయ్యకండి అని. తప్పులు పాఠాలు నేర్పుతాయి. చేసిన తప్పే చేస్తే గుణపాఠాలు నేర్పుతారు.

తప్పులు మాత్రమే కాకుండా మార్కెటింగ్, ప్రకటనల విభాగంలో ప్రతిభావంతుల గురించి కూడా ఇందులో రాసేవారు. బెస్ట్ డెస్క్, బెస్ట్ యూనిట్ ఇలా ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. సమయానికి అనుకూలంగా చురుకుగా పనిచేసిన వారికి వ్యక్తిగతంగా బహుమతులు ఇచ్చేవారు. వీటితో పాటు అప్పుడప్పుడు ఎడిటోరియల్ సిబ్బందికి పరీక్షలుండేవి. ఇవి కూడా ఈ సమీక్షలో హైలైట్ అయ్యేవి.

గ్రామీణ ప్రాంతాల విలేకరుల గురించి ప్రత్యేక కథనాలు రాసేవారు. అందులో వారు రాసిన, చేసిన ఘనతలను పేర్కొనేవారు. కిందటి ఎపిసోడ్ లో చెప్పిన అడ్డతీగల సత్యనారాయణ గురించి కూడా అలాంటి కథనం 2000 మార్చి సమీక్షలో రాశారు. ఇది అతని పనికి గీటురాయి. అతని గురించి ఆ సంచికలో ఏమి రాశారో యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాను.
పరిశోధనాత్మక వార్తలతో గిరిజనుల జీవితాల్లో వెలుగు
తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల కంట్రిబ్యూటర్ డి. సత్యనారాయణ 1982 ఆగస్టు నుంచి పనిచేస్తున్నారు. భౌగోళికంగా కొండలు, అడవులు విస్తరించిన గిరిజన ప్రాంతంలో గిరిజనులను ఆకట్టుకుని, వార్తలను సేకరించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక యజ్ఞం లాంటిది. ఏజెన్సీ ప్రాంత సమస్యలను వెలుగులోకి తేవడంలోనూ, నక్సల్స్ వార్తలను సమర్పించడంలోనూ ఆయన చెప్పుకోదగిన కృషి సాగిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతానికంతటికీ సుపరిచితుడైనప్పటికీ, ఆయన ఇంటి పేరుతో కలిపి దమ్ము సత్యనారాయణ అంటే ఆయన ఎవరో తెలియందంటారు. ఈనాడు సత్యనారాయణ అంటే ఠక్కున గుర్తుపడతారు. ఈనాడు విలేకరి గుర్తింపుగా ఇంటి పేరు ఈనాడుగా మారిపోవడం ఒక పురస్కారంగా గర్వపడతారు. ఏజెన్సీ సమాచారాన్ని అందించడంలో ముందుంటారు. అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఈ ప్రాంత పరిస్థితులను ఆకళింపు చేసుకుని నక్సలైట్లు, రంగురాళ్ల అంశాలపై ఈయన రాసిన వార్తలు అధికారులు, అనధికారులను ఆలోచింపచేస్తాయి.

1986 నవంబరులో కొండవాగులకు అడ్డుకట్టలు కట్టి, ఉపరితల జలవనరులను సేద్యపు నీరుగా వినియోగించేందుకు సాగుతున్న పనుల్లో అవకతవకలను ఆయన వెలికితీశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పరిశోధనాత్మక వార్తను దృష్టిలో పెట్టుకుని, ఐ.టి.డి.ఏ. పరిధిలో 1987 లో ప్రత్యేక మైనర్ ఇరిగేషన్ డివిజన్ ఏర్పాటు చేశారు.
గిరిజన ప్రాంతంలో కనీస ప్రాథమిక విద్యాసౌకర్యాలు లేకపోతే నిరక్షరాస్యత పెరగదా, పదో తరగతి అంతకంటే తక్కువ విద్యాభ్యాసం చేసిన యువకులు నిరుద్యోగులుగా ఉండి నక్సలిజం వైపు ఆకర్షితులు కావడంపై రాసిన వార్తా కథనాలను పురస్కరించుకుని గిరిజన విద్యావికాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక విద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు పదో తరగతి వరకు చదువుకున్న గిరిజన యువకులను అన్ ట్రైన్డ్ ఉపాధ్యాయులుగా నియమించే కార్యక్రమాన్ని 1985 లో గిరిజన సంక్షేమ శాఖ విస్తృత స్థాయిలో చేపట్టింది. 1984 లో పీపుల్స్ వార్ నక్సలైట్లు తమ ఉద్యమాన్ని బలపరచుకోవడానికి ప్రజాకర్షణకు అవలంబించే విధానాలు, ఆర్ధిక వనరులు పొందే తీరుపై …. తీవ్రవాదులకు అటూ – ఇటూ ఆర్జనే… శీర్షికతో సత్యనారాయణ రాసిన వార్త నక్సలైట్లకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. వాస్తవాలను నిర్భయంగా రాసిన విధానంపై అప్పట్లో నక్సలైట్ దళాలు తమ సమావేశాలలో ప్రత్యేకంగా సమీక్షించుకున్నాయి.

గిరిజనులు పీపుల్స్ వార్ నక్సలైట్ల పట్ల ఆకర్షితులవడానికి దారి తీస్తున్న పరిస్థితులు, పోలీసు జులుం, తదితర అంశాలపై పరిశోధనాత్మక వార్తలను రాయడంతో 1990 – 1992 మధ్య కాలంలో ఆయనను పీపుల్స్ వార్ నక్సలైట్ల సానుభూతిపరునిగా అప్పటి జిల్లా ఎస్.పి. డి.టి. నాయక్ ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక పంపారు. అప్పటి ఐ.టి.డి.ఏ. ప్రాజెక్ట్ ఆఫీసర్, ఇతర సివిల్ అధికారులు ఎస్.పి. నివేదికను దురుద్దేశ పూరితమైనదిగా ఖండించి ఆ వార్తల్లో వాస్తవాలను ప్రభుత్వానికి నివేదించారు.
1987 డిసెంబర్ 27 న ఐ.ఏ.ఎస్.ల కిడ్నాప్ తో వరుస ఘటనలు ప్రహసనంలా సాగాయి. ప్రభుత్వ అధికారుల కిడ్నాప్ సంఘటనల వల్ల అధికార యంత్రాంగంలో ఆత్మస్థైర్యం దెబ్బతిని ఏజెన్సీ ప్రాంతంలో నిర్భయంగా పర్యటించి విధి నిర్వహణ చేయలేని పరిస్థితులనూ, గిరిజనాభివృద్ధి, సంక్షేమానికి వాటిల్లుతున్న ముప్పును విశ్లేషిస్తూ వార్తలు రాశారు. ఆ వార్తలకు ప్రతిస్పందించిన నక్సలైట్లు కిడ్నాపుల జోలికి వెళ్లరాదని నిర్ణయించారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో అనేకమందిని హతమార్చిన దురాగతాలు, తీవ్రవాద కార్యకలాపాల పట్ల గిరిజనుల మానసిక ఆందోళనలు, అభిప్రాయాలతో రాసినందున గిరిజనులకు తమ ఉద్యమం పట్ల వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారని నక్సలైట్లకు ఆగ్రహం ఉండేది. తమ ఆగ్రహాన్ని ఒక లేఖ ద్వారా రెండు సంవత్సరాల క్రితం తెలిపారు. ప్రతి విషయం మీరు ఈనాడు విలేఖరికి చెబుతున్నారు. మీరు అతని వద్దకు వెళ్ళవద్దు. అతనితో ఏమీ మాట్లాడవద్దని నక్సలైట్లు గ్రామాల్లో సమావేశాలు పెట్టి గిరిజనులకు చెప్పారు. గిరిజనులు వారి హెచ్చరికలను తోసిపుచ్చారు. పోలీసుల నుంచి ఇక్కట్లకు గురికాకుండా ఉండేందుకు విలేకరిగా సత్యనారాయణ నుంచి లభిస్తున్న సహాయ సహకారాలను నక్సలైట్లకు వివిధ సందర్భాలలో గిరిజనులు వివరించారు. తమ రహస్య కార్యకలాపాలను, విప్లవోద్యమ ప్రణాళికలనూ వెలుగులోకి తెస్తున్నందుకు ఆగ్రహించిన నక్షలైట్లు ఒక విలేఖరిని లోతట్టు గిరిజన గ్రామానికి పిలిపించి, గ్రామస్తుల సమక్షంలోనే నిలదీశారు. అప్పుడు గిరిజనులే నక్సల్సును తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ఈనాడులో ప్రచురితమయ్యే వార్తల ద్వారా తామెంత ప్రయోజనం పొందుతున్నదీ వారికి వివరించారు. ఈనాడు పత్రిక పట్ల ఉన్న అభిమానాన్ని గిరిజనులు నిష్కర్షగా వెల్లడించడం ప్రత్యక్షంగా చూసిన సత్యనారాయణ ..
వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతాయుతంగా లక్ష్య శుద్ధితో పనిచేయాలనే దృఢ సంకల్పాన్ని కనబరిచారు.
1990 – 1992 మధ్య ఐ.టి.డి.ఏ. ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన డాక్టర్ పి.వి. రమేష్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పటిష్ఠ విద్యా విధానం అమలుకు ఈనాడు వార్తను పరిగణనలోకి తీసుకుని, స్కూలు కాంప్లెక్స్ విద్యా విధానానికి రూపకల్పన చేశారు. ఆ స్కూలు కాంప్లెక్స్ విద్యావిధానం ప్రస్తుతం రాష్ట్రంలోని ఇతర ఐ.టి.డి.ఏ.లకు కూడా విస్తరించి, గిరిజన సంక్షేమ కార్యక్రమమైంది.

రంగురాళ్ల సేకరణ అక్రమ కార్యక్రమంగా మారింది. దీనివల్ల గిరిజనుల సామాజిక వ్యవస్థకు, పర్యావరణానికి ముప్పు వాటిల్లే పరిస్థితులపై విశ్లేషణలతో ఇచ్చిన వార్తలు – రంగురాళ్ల సేకరణ కార్యకలాపాలకు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశాయి. గిరిజన ప్రాంతాలలో అవినీతి పోకడల నేరాల్లో ఇరుక్కున్నవారిని పనిష్మెంట్ మీద గిరిజన ప్రాంతాలలో నియమించే తీరుపై రాసిన ఒక వార్తకు ఏజెన్సీ ప్రభుత్వ యంత్రాంగం ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో అప్పటి రంపచోడవరం ఐ.టి.డి.ఏ. పి.ఓ. డాక్టర్ పి.వి. రమేష్ అధికారులను ప్రత్యేకంగా సమావేశపరిచి, ఆ వార్తల్లోని ప్రాధాన్యత, సామాజిక ప్రాముఖ్యత వివరించారు. ఇటువంటి వార్త రాసినందుకు అభినందించాలి తప్ప ఆగ్రహించకూడదని చెప్పి, అడ్డతీగల సత్యనారాయణను ప్రత్యేకంగా సమావేశానికి పిలిపించి అభినందనలు తెలిపారు.

ఐదేళ్ల అనంతరం డాక్టర్ రమేష్, గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ హోదాలో జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. అప్పటి పి.ఓ., జిల్లా జాయింట్ కలెక్టర్ లతో ప్రత్యేకంగా మాట్లాడారు. గిరిజనుల సామాజిక ప్రగతి, ఆర్ధిక ప్రగతి కార్యక్రమాలకు సంబంధించి ఈనాడులో అడ్డతీగల డేట్ లైన్ పై వచ్చిన వార్తలను ప్రామాణికంగా పరిగణించాలని రమేష్ వారికి సూచించారు. ఇది అడ్డతీగల సత్యనారాయణకు వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను, నిజాయితీని చాటుతుంది.
అందుకే బెస్ట్ కంట్రిబ్యూటర్ కాలమ్ కింద సమీక్షలో ఆయన గురించి ప్రత్యేకంగా ఒక పేజీ వ్యాసం రాశారు. గుర్తేడు కిడ్నాప్ వెనుక నిజాల గురించి వచ్చే ఎపిసోడ్ లో ….
పద్దతంటే పద్ధతే. క్రమశిక్షణకు, ప్రణాళికా బద్దతకు మారు పేరు. అందుకే ఆ సంస్థ ఎంతో మంది ప్రతిభా వంతుల్ని తయారు చేసింది.👌👌👌👍👍🙏