(KVS Subrahmanyam)
వాగులో నడిచి వస్తున్న వ్యక్తిని చూశారా? గుర్తుపట్టారా? లేదా.. అయితే నేను చెప్పేది వినండి ముందు. సాధారణంగా ప్రజాప్రతినిధులు అంటే … ఆర్భాటం అట్టహాసం లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. ప్రజాప్రతినిధి పదవికి తోడు ఒక సంస్థానానికి యువరాజు అయితే… ఆ హంగు గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. చెప్పులు చేతితో పట్టుకుని, నీళ్లలో అడుగులు వేసుకుంటూ…. చుట్టూ ఉన్నవారు చెబుతున్నది ఆసక్తిగా వింటూ నడుస్తూ వస్తున్నది బొబ్బిలి ఎం.ఎల్.ఏ. ఆర్.ఎస్.ఎస్.వి.కె. రంగారావు గారు. ఆ ప్రాంతీయులు ఆయనను బేబి నాయన అని పిలుచుకుంటారు.

ఆ పేరు వెనుక ఉన్న కథను గతంలో వైజయంతి మాటామంతిలో ఆయనే వివరించారు. ఇప్పుడు ఆయన ఇలా నడుచుకుని ఎందుకు వెడుతున్నారనే కదా సందేహం. తన నియోజకవర్గంలోని తెర్లం మండలం చిన్న నందబలగా గ్రామాన్ని సందర్శించి, ఆ గ్రామస్థులతో సమావేశమై సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో ఆయన ఆ గ్రామానికి బయలుదేరారు. ఊరికి వెళ్ళడానికి వేరే రోడ్డు మార్గం ఉంది.

కానీ, దగ్గర దారి కావడంతో కాలి నడకన వాగు దాటి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంతే … చెప్పులు చేతితో పుచ్చుకుని చకచకా అడుగులేశారు. అది ఆయన సామాన్య తత్వానికి నిదర్శనం. ఈ కాలంలో ఎంతమంది ప్రతినిధులు ఇలా అతిసామాన్యంగా వ్యవహరిస్తారు? సేవ చేయాలనే తపనకు సింప్లిసిటీ తోడైతే…. ఆ వ్యక్తిత్వం పేరే ధవళ వస్త్రధారి అయిన బేబినాయన.
