నెహ్రూని విమర్శించడం తప్ప చేసిందేమిటి?
(బాలినేని నాగభూషణరావు)
నరేంద్ర మోడీ ప్రధానిగా పదవి స్వీకరించి పుష్కర కాలం గడిచింది. జవహర్‌లాల్ నెహ్రూ కంటే తాను ఎక్కువ కాలం గద్దె మీద ఉన్నానని ఘనంగా చెప్పుకుంటున్నారు. మంచిదే. ఒక ప్రధాన మంత్రి పన్నెండేళ్ల పాటు ఏకధాటిగా పదవిలో కొనసాగడం అంటే, దేశంలో స్థిరమైన ప్రభుత్వం నడిచిందని అర్థం. దేశానికి అటువంటి ప్రభుత్వమే కావాలి.
ఈ పన్నెండేళ్ల కాలంలో మోడీ గారు సాధించిన ఘనతలేమిటి అన్నది ప్రశ్న. మన్మోహన్ సింగ్ 73 లక్షల కోట్ల అప్పు ఇచ్చి వెళ్తే, మోడీ వచ్చి దాన్ని 2 కోట్ల 34 లక్షల కోట్లకు పెంచాడు. అంటే, కోటి అరవై లక్షల కోట్ల రూపాయల అదనపు అప్పు తెచ్చారన్న మాట. ఇంత అప్పు వల్ల దేశానికి కలిగిన మేలేమిటి? ఎన్ని జాతీయ రహదారులు నిర్మిస్తే, ఇంత అప్పు పెరుగుతుంది? మన్మోహన్ సింగ్ కాలంలో విదేశీ పెట్టుబడిదారులు మన షేర్ మార్కెట్ మీద పూర్తి విశ్వాసం ప్రదర్శించేవారు. ఇప్పుడు 96 శాతం విదేశీ పెట్టుబడులు షేర్ మార్కెట్ నుంచి వెనక్కు వెళ్లిపోయాయి. దాని వల్ల మార్కెట్ పతనమై, కొరియా, తైవాన్ వంటి బుల్లి దేశాలకు దిగువకు దిగజారిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు పలాయనం చిత్తగించడానికి కారణం అదానీ, అంబానీ వంటి గుజరాతీ వ్యాపారవేత్తలకు మాత్రమే అన్ని సంపదలు, వ్యాపారాలు కట్టబెట్టడం వల్ల భారతదేశంలో ఇతరులెవరూ వ్యాపారాలు చేసుకోగలిగిన పరిస్థితి లేదన్న అంచనాతో వెళ్లిపోయారు వారు. ప్రజల తలసరి ఆదాయం శ్రీలంకలో 4516 డాలర్లు ఉంటే, భారతదేశంలో కేవలం 2813. ఇది బంగ్లాదేశ్, హైతీ వంటి నిరుపేద దేశాల కంటే తక్కువ. మన్మోహన్ హయాంలో మన జిడిపి 8.3 శాతం; ఇప్పుడు 6.7 శాతం. జిడిపిలో మన దేశం జపాన్, ఇంగ్లాండ్‌లను అధిగమించి 4వ స్థానానికి చేరిందని, త్వరలో జర్మనీని కూడా అధిగమించి మూడో స్థానానికి వస్తామని గర్వంగా చెప్తూ వచ్చారు మోడీ గారు. కానీ వాస్తవంలో మన దేశం ఇప్పుడు 6 స్థానానికి దిగజారిపోయింది. అదానీ, అంబానీ వంటి వారికి అన్నీ దోచి పెట్టడం వల్ల, సంపద పంపిణీలో అసమానత్వం పెరిగిపోయి, పేదవాడు మరింత పేదవాడిగా మిగిలిపోతున్నాడే తప్ప, సామాన్యుల జీవితాలు మెరుగు పడడం లేదు.
ఇవన్నీ వదిలేసి, జై శ్రీరామ్ అంటూ భజన చేయండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి అని చెప్తున్నారు మోడీ. ఆయన చెప్పుకునే ఘనతలలో ఆర్టికల్ 370, అయోధ్య రామాలయం వంటి అంశాలు తప్ప, నిరుద్యోగం, పేదరికం, ఆరోగ్య సేవలు, విద్య వంటివి ఉండవు. ప్రశ్నాపత్రాల వెల్లడితో విద్యా వ్యవస్థ మీదనే ప్రజలకు విశ్వాసం పోయింది. ఎన్నికల కమిషన్‌ను పంజరంలో చిలుకగా మార్చి, గెలుపు సొంతం చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యపు పీక నులిమి వేస్తున్నారు. ఇడి, సిబిఐ, విజిలెన్స్, ఇన్‌కంటాక్స్, జియస్‌టి, న్యాయవ్యవస్థ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాగ్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ బిజెపి వాకిట్లో వేట కుక్కల వలె మారిపోయాయి. ఎవరిని కరవమంటే వారిని కరవడం మాత్రమే తమ కర్తవ్యం అనుకుంటున్నాయి. చివరకు న్యాయవ్యవస్థ పట్ల ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. మోడీకి, అమిత్ షాకు వ్యతిరేకంగా ఒక్క తీర్పు చెప్పే సాహసం ఏ న్యాయమూర్తికి కూడా లేదన్నది, నిష్ఠూరమైన నిజం.
నెహ్రూను గేలి చేయడం మోడీ గారికి ఒక సరదా. నెహ్రూ నాగార్జున సాగర్, బాక్రానంగల్, హీరాకుడ్ వంటి ప్రాజెక్టులు కట్టి, వాటిని ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించి, కోట్లాది ఎకరాలను సస్యశ్యామలం కావడానికి కారణమయ్యారు. మోడీ కట్టిన ప్రాజెక్ట్ ఒక్కటైనా ఉందా? నెహ్రూ స్థాపించిన ఐఐటి, ఐఐఎమ్, ఐఐయస్ వంటి విద్యా సంస్థలు మన దేశం నుంచి అత్యంత ప్రతిభావంతులను తయారు చేశాయి. మోడీ గారు ఒక్క ఉన్నత స్థాయి విద్యా సంస్థ నెలకొల్పాడా? ఇస్రో, డిఆర్‌డిఓ, బాబా అటామిక్ వంటి సంస్థలు లేకుంటే బ్రహ్మోస్ క్షిపణులు ఎక్కడ నుంచి వచ్చాయి.
ఈ పన్నెండేళ్లలో సామాజికంగా, రాజకీయంగా, ప్రజాస్వామ్యపరంగా, ఆర్థికంగా కలిగిన లాభం కంటే జరిగిన నష్టాలే ఎక్కువ.

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

