కేసరపల్లి ఐ.టి. పార్కులో అట్టహాసంగా ఉత్సవం
కేసరపల్లి, జూన్ 12 : నవ్యంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్ర బాబు నాయుడు బుధవారం ఉదయం సరిగా 11 27 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం ప్రారంభించగానే కార్యక్రమానికి హాజరైన వారంతా పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. ప్రధాని ఆయనను అభినందించారు. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ కు ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నవ్యంధ్రలో ఇది రెండో సారి. అంటే మొత్తం నాలుగుసార్లు సీఎం అయినా ఘనతను ఆయన దక్కించుకున్నారు. చంద్ర బాబు ఇంతవరకూ 13 ఏళ్ల 245 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొలిసారి 1995 సెప్టెంబర్ ఒకటో తేదీనుంచి మే 14 2004 వరకూ, రెండో సారి 8 జూన్ 2014 నుంచి 30 మే 2019 వరకూ సీఎంగా పనిచేశారు.
చంద్ర బాబు నాయుడుతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు.
ఆ వెంటనే పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి.నారాయణ, శ్రీమతి వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, శ్రీమతి ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో అమిత్ షా, జేపీ నడ్డా, చిరంజీవి, రజని కాంత్, జస్టిస్ ఎన్.వి. రమణ, వెంకయ్య నాయుడు, బాలకృష్ణ, చంద్ర బాబు సతీమణి భువనేశ్వరి, తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. అంతకు ముందు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాన మంత్రి మోడీ, చంద్ర బాబు నాయుడు ఒకే కారులో ప్రమాణ స్వీకార ప్రాంతానికి విచ్చేసారు.