మాస్టారి కాపురం టైటిల్ అలా…

0
69

(మోహన్ గోటేటి)
రాజేంద్రప్రసాద్ సినిమాకి మన ‘టైటిల్’ అలా ఫిక్స్ అయింది!
1990 మే నెలలో అప్పుడే వడపళనిలో 12 B బస్సు దిగి.. మెల్లగా నడుచుకుంటూ ఏవీఏం స్టూడియో వైపు వెళ్లాను..
మేం సుపరిచితులమే కాబట్టి.. సెక్యురిటీ అతను గుడ్ మాణింగ్ చెప్పాడు..
గేటు దాటి లోపలికి కాస్త దూరం వెళ్లాను..
ఈలోగా సర్రు మంటూ ఓ కారు వచ్చి నా పక్కనే ఆగింది..
డోర్ తీసి.. “అబ్బాయ్.. నడిచింది చాలు కానీ.. కారెక్కు” అన్నారు.
చూస్తే.. కారులో ఆల్ రౌండర్ రాజేంద్రప్రసాద్.. నవ్వుతూ కనిపించారు.
అబ్బాయ్ అనడం ఆయనకి ఊతపదం.. ఒక్కోసారైతే నన్ను ‘జీఏం’ (గోటేటి మోహన్) అని కూడా పిలుస్తుంటారు.
కారెక్కాక.. తీసుకెళ్లి.. నేనెళ్లాల్సిన ఫ్లోర్ దగ్గర దింపారు.
అది ఆయన సింప్లిసిటీ.. అది ఆయన తీరు..
మనిషిలో ఎటువంటి భేషజాలు వుండవు..
‘స్టార్’ ట్యాగ్ తీసి ఎప్పుడో పక్కన పడేశారాయన!
వెండితెరపై కామెడీని పరుగులు పెట్టించిన హీరో తను!
కామెడీకి కథానాయకుడి స్థానాన్ని తెచ్చిపెట్టిన నటుడాయన.
ఎన్ని కామెడీ సినిమాలు?
ఎన్ని రకాల పాత్రలు?
ఎన్ని పాత్రలు చేసినా ఎవరికీ బోర్ కొట్టని ‘అప్ టు డేట్’ అభినయం ఆయనది!
“ఊపిరి సలపని బిజీలో నాకు కాస్త రిలీఫ్ నిచ్చేది రాజేంద్రప్రసాద్ సినిమాలే” అంటూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారు కితాబు నిచ్చారంటే ఆయన హాస్యాభినయం ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే పీవీ లాంటి మనిషినే ఆయన నవ్వించగలిగారంటే అది మామూలు కామెడీనా?
ప్రేమించు పెళ్లాడు..
అహ నా పెళ్లంట..
ఏప్రిల్ 1 విడుదల..
అప్పుల అప్పారావు..
ఆ ఒక్కటీ అడక్కు..
మిస్టర్ పెళ్లాం..
పెళ్లి పుస్తకం..
రాజేంద్రుడు గజేంద్రుడు..
మాయలోడు..
మేడమ్.. ఎలాంటి సినిమాలివి?
ఎటువంటి అభినయం ఆయనది?
చక్కిలిగింతలు పెట్టి, హాస్యపు పన్నీరులో ప్రేక్షకులను స్నానమాడించిన అభినయం కదా?
థియేటర్లలో నవ్వులు పూయించిన నటన కదా?
ఒక ‘ఎర్రమందారం’..
ఒక ‘ఆ నలుగురు’..
ఒక ‘మీ శ్రేయోభిలాషి’..
మామూలు సినిమాలా ఇవి?
రాజేంద్రుడిని మరో కోణంలో ఆవిష్కరించిన ఉత్తమ చిత్రాలివి.
మరి ఆయనకు నంది అవార్డులు, డాక్టరేట్లు, పద్మశ్రీలు ఊరికే వస్తాయా?
ఏ స్థాయి అభినయం ఆయనది?
నవ్వించడమే కాదు.. కళ్లంట నీళ్లు తెప్పించగల ఆర్టిస్టు కూడా కదా తను?
‘ఆ నలుగురు’ సినిమా ప్రివ్యూ చూసి కళాతపస్వి కె.విశ్వనాథ్ థియేటర్ లోంచి మెల్లగా బయటకు వచ్చారు.
సినిమా ఆయనకు నచ్చిందా? లేదా?
ఆయన ఏమంటారు?.. అనుకుంటూ రాజేంద్రప్రసాద్ ఎదురెళ్లారు.
ఆయన దగ్గరగా వచ్చి.. చిర్నవ్వుతో ప్రసాద్ ని చిన్నగా.. గోముగా.. ఓ లెంపకాయ కొట్టారు.
“సినిమాలో ఎక్కడైనా మా రాజేంద్రప్రసాద్ కనపడతాడేమోనని తెగ వెతికాను.. ప్చ్ .. దొంగ.. కనపడలేదు” అన్నారు విశ్వనాథ్ నవ్వుతూ.
అంటే.. ఆ సినిమాలో ఆయన పోషించిన రఘురామ్ పాత్ర మాత్రమే కనిపించిందన్నది ఆయన భావన..


ఎక్కడా రాజేంద్రప్రసాద్ కనపడలేదంటే.. అది ఎంతటి గొప్ప అభినయం?
కళాతపస్వి నుంచి అంతకు మించిన ప్రశంస మరేముంటుంది?
రాజేంద్రప్రసాద్ ఒట్టి సరదా మనిషి!
ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతారు.
నేను ‘సితార’ రిపోర్టర్ గా మద్రాసు వచ్చిన తొలినాళ్లలోనే మంచి స్నేహితుడైపోయారు ఆయన.
ఆయనతో కూర్చుంటే మామూలుగా వుండదు..
ఆ కబుర్లు.. ఆ జోకులు.. ఓహ్..
ఆయన సినిమాలాగే హాయిగా.. మనసు తేలికపడుతుంది..
తెగ నవ్విస్తూ వుంటారు.. పడిపడి నవ్వుతూనూ వుంటారు.
ఆ సమయంలో ఆయనలో ఒక సామాన్యుడు మాత్రమే మనకు కనిపిస్తాడు!
ఆయన షూటింగు కవరేజీకి వెళితే చాలు.. దూరం నుంచే మనల్ని చూసి.. పెద్దగా ఒక ఈల వేసి .. “రా అబ్బాయ్” అంటూ ఆహ్వానిస్తారు.
అది రాజేంద్రుడి స్టయిల్!
అల్లరినీ, రాజేంద్రప్రసాద్ నీ విడదీసి చూడలేం..
ఆయన నటించిన ఎన్నో సినిమాల షూటింగుల కవరేజీ కోసం పలు ప్రాంతాలకు వెళ్లాం.
తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం.. ఇలా ఎన్నో ఊళ్లకు ఆయన షూటింగుల కోసం వెళ్లేవాళ్లం.
అవుట్ డోర్ షూటింగ్ అంటే ఆయన రెచ్చిపోతారు.
చుట్టూ వేలమంది జనం మూగి ఉన్నప్పటికీ.. ఎలాంటి షాట్ చేయమన్నా నదురూ బెదురూ లేకుండా..
జనం చేసే కామెంట్లకు ఏమాత్రం ఇబ్బంది పడకుండా.. కాన్సంట్రేషన్ చెడకుండా.. సింగిల్ టేక్ లో షాట్ ఓకే చేస్తారాయన.
అందుకే, కెమెరా కోసమే పుట్టాడా? అనిపిస్తుంది, ఒక్కోసారి ఆయనని చూస్తే!
అప్పట్లో మేం ‘సితార’ కోసం కొందరు ఆర్టిస్టులతో స్పెషల్ గా ఫొటో ఫీచర్లు చేసేవాళ్లం..
అంటే.. ఒక కాన్సెప్ట్ అనుకుని.. అందుకు తగ్గట్టుగా ఆయా ఆర్టిస్టుల చేత పోజులిప్పిస్తూ ఫొటోలు తీసేవాళ్లం.


తర్వాత వాటిని ఒక కథలా అల్లి .. ఫీచర్ ని ప్రచురించే వాళ్లం.
ఆ విషయంలో మాకు రాజేంద్రప్రసాద్ గారు టైలర్ మేడ్ ఆర్టిస్ట్.
ఎప్పుడు అవుట్ డోర్ షూటింగుకి వెళ్లినా ఆయనతో ఓ ఫొటో ఫీచర్ చేసుకునే వాళ్లం.
అందుకాయన చాలా సమయాన్ని వెచ్చించి, సహకరించేవారు.
ఓసారి తిరుపతిలో ఓ సినిమా షూటింగులో ఆయనతో ఓ ఫొటో ఫీచర్ చేశాం.
ఆ కాన్సెప్టులో భాగంగా చెట్టు ఎక్కాలన్నాను..
క్షణం కూడా ఆలోచించలేదు..
“జీఏం.. ఇక్కడ డైరెక్టర్ నువ్వే.. ఏం చేయమన్నా చేస్తాం బాబూ..” అంటూ టక్కున చెట్టు ఎక్కి.. తనదైన కామెడీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ఫొటో తీసుకోమన్నారు.
దటీజ్ రాజేద్రప్రసాద్..
ఆర్టిస్ట్ అంటే అలా వుండాలి!
ఆయనతో చేసే కామెడీ ఫొటో ఫీచర్లకు పాఠకుల నుంచి మంచి స్పందన కూడా వచ్చేది.
1990 వేసవిలో రాజేంద్రప్రసాద్ నటిస్తున్న ఓ సినిమా షూటింగుకి మద్రాసు నుంచి మా పాత్రికేయుల బృందాన్ని హార్సిలీ హిల్స్ తీసుకువెళ్లారు.
ఆ సినిమాకి దర్శకుడు పి.ఎన్.రామచంద్రరావు గారు.
ఆయన మంచి టాలెంటెడ్ డైరెక్టర్. చాలా సరదా మనిషి.
ఆ రోజు మేం వెళ్లేటప్పటికి హీరో రాజేంద్రప్రసాద్, హీరోయిన్ గాయత్రి, గొల్లపూడి, డా.శివప్రసాద్ (మాజీ ఎంపీ) తదితరులపై కొన్ని సీన్స్ తీస్తున్నారు.
సాయంకాలం షూటింగ్ అయ్యాక .. ఆ చల్లని వాతావరణంలో.. మాకు ప్రెస్ మీట్ పెట్టారు.
దర్శకుడు సినిమా షూటింగ్ వివరాలు చెప్పాక.. “టైటిల్ ఏమనుకుంటున్నారు?” అనడిగాం.
“కొన్ని అనుకుంటున్నాం .. కానీ.. ఇంకా మంచి టైటిల్ కావాలి.. మీరు ఏదైనా టైటిల్ చెబితే.. ఎంపిక చేసిన టైటిల్ కి వెయ్యినూట పదహార్లు ఇస్తాం” అన్నారు దర్శకుడు పీఎన్.
“అబ్బాయ్.. మీరంతా కాగితాల మీద మీ టైటిల్ రాసి.. కింద మీ పేరు రాయండి.. కన్ఫ్యూజన్ వుండదు” అన్నారు రాజేంద్రప్రసాద్.
సరే.. పాత్రికేయులమంతా ఎవరికి తోచింది వాళ్లం రాసిచ్చేసి, మర్నాడు మద్రాసుకి వచ్చేశాం.
రెండు రోజుల తర్వాత ఆ సినిమా పీఆర్వో టి.ఆర్.ఎల్ నరసింహన్ గారి నుంచి నాకు ఫోన్..
“సార్.. కంగ్రాచ్యులేషన్స్.. మీరు చెప్పిన టైటిల్ని రాజేంద్రప్రసాద్ గారు, డైరెక్టర్ గారు ఓకే చేశారు.. మీకు అందజేయమని నిర్మాత వెయ్యి నూట పదహార్లకు చెక్కు కూడా ఇచ్చారు.. నేను మీ ఆఫీసుకు వచ్చి అందజేస్తాను” అంటూ శుభవార్త చెప్పారు.
నిజంగా అదో ఆనందం.. అదో గొప్ప థ్రిల్..
వెయ్యి నూట పదహార్ల మాట ఎలా వున్నా (ఆ ఆనందం కూడా ఓపక్క వుంది లెండి).. ఒక సినిమాకు.. అందులోనూ రాజేంద్రప్రసాద్ వంటి స్టార్ హీరో నటించే సినిమాకి మనం టైటిల్ పెట్టామంటే.. చెప్పొద్దూ.. కాస్త గర్వంగా కూడా ఫీలయ్యాను.
ఇంతకీ ఆ సినిమా టైటిల్ ఏమిటంటే… ‘మాస్టారి కాపురం’!


మరి.. ఆ డబ్బులతో ఏం చేశాననుకుంటున్నారా..?
మా నాన్న గారికి ఓ మాంచి టేప్ రికార్డర్ కొనిచ్చాను!


(వ్యాస రచయిత ప్రముఖ సినీ పాత్రికేయులు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here