ఫిబ్రవరి నాలుగున రిలీజ్ కావాల్సిన చిత్రం
చిత్ర బృందం ట్వీట్
విడుదల తేదీ త్వరలో వెల్లడి
హైదరాబాద్, జనవరి 15: ఆచార్య సినిమా విడుదల వాయిదా పడింది. ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేయాల్సి ఉంది. చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు శనివారం చిత్ర బృందం ట్వీట్ చేసింది. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. కరోనా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. సినిమా టికెట్ల ధరలపై ఏపీలో వివాదం కొనసాగుతున్న క్రమంలో గురువారంనాడు మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం వైయస్ జగన్‌తో భేటీ అయ్యారు. త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్లు మెగాస్టార్ వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. సినిమా టికెట్ల ధరలు తగ్గిపోతే నిర్మాతలకు నష్టాలు వస్తాయనే ఆందోళనతో సినీ పరిశ్రమ దాదాపు స్తంభించింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల వాయిదా పడింది. కారణం కరోనా చూపుతున్నప్పటికీ అసలు హేతువు టికెట్ ధరల తగ్గింపే అనేది బహిరంగ రహస్యం.
తెలంగాణలో సినీ పరిశ్రమకు అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం పరిశ్రమ పెద్దలను గడగడలాడిస్తోంది. ఎక్కువ షోలు వేయడం, ఇష్టారీతిన టికెట్ ధరలు నిర్ణయించడం.. మాల్స్‌లో అత్యధిక ధరలకు మంచినీరు, తినుబండారాలు వంటివి విక్రయించడం, తదితరాలను అదుపులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది సినీ పరిశ్రమపై పెత్తనం చేయడమేనని పెద్ద నిర్మాతలు భావిస్తున్నారు. ఎంత విన్నవించుకుంటున్నప్పటికీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ క్రమంలో ఆర్జీవీ టికెట్ ధరలకు వ్యతిరేకంగా ట్వీట్ చేయడం, దానికి అదే స్థాయిలో ఏపీ మంత్రి పేర్ని నాని బదులివ్వడం, ఆర్జీవీని పిలిచి మాట్లాడడం చకచకా జరిగిపోయాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చిరంజీవి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళి, ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. ఇది చోటుచేసుకున్న రెండు రోజులకు ఆచార్య విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. రాజ్య సభ సభ్యత్వం చిరంజీవి-జగన్ మధ్య చర్చలలో ప్రస్తావనకు వచ్చిందని వార్తలొచ్చాయి.