అమోఘ నటన కనబరిచిన మీనాకుమారి
నర్గిస్ పాత్రలో జీవించిన నటి
పాటలు – సంభాషణలు అద్భుతం
ఆహార్యాలు నభూతో నభవిష్యతి
(వైజయంతి పురాణపండ, 8008551232)
మీనాకుమారి భారత చలన చిత్ర చరిత్రలో ఓ ధ్రువ తార. హావభావాలు అద్వితీయం. నటనతో ప్రేక్షకులను కట్టిపడేసేవారు. వెండితెర వేల్పుగా పూజలందుకున్నారు. ఆమె నట జీవితంలో పాకీజా పేరెన్నికగన్న చిత్రం. మార్చి 31 మీనా కుమారి వర్థంతి. ఈ సందర్భంగా ఒకసారి పాకీజా చిత్రాన్ని గుర్తు చేసుకుందాం.
పాకీజా…అందమైన దృశ్యకావ్యం. ఒక్కో ఫ్రేమ్ ఒక్కో పెయింటింగ్. కాస్ట్యూమ్స్, కోరియోగ్రఫీ, సినిమటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే… అన్నీ కలగలిసి, ఒక అందమైన పూలగుత్తిలా మారి, పాకీజాను సినీ పరిశ్రమలో పారిజాతంలా నిలబెట్టాయి. ప్రేక్షకులకు మీనాకుమారిని ఒక నటిగా గుర్తుండిపోయేలా చేసింది పాకీజా.
సినిమాలో మీనా కుమారి నర్గీస్ అనే వేశ్య పాత్రను పోషించారు. కథ నర్గీస్ లేచిపోవడంతో ప్రారంభమవుతుంది. బంగారువర్ణ శోభితమైన కురులు, వజ్రపు కాంతులు వెదజల్లే బూడిద రంగు నయనాలు ఉన్న నర్గీస్ తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నవాబ్ షాబుద్దీన్‌తో (అశోక్ కుమార్) ఆయన ఇంటికి వెళ్తుంది. ఇంట్లో వారు ఆమెను నిరాదరిస్తారు. నర్గీస్ ఒక పల్లకిలో శ్మశానానికి చేరుకుని, అక్కడే పది మాసాలు గడుపుతుంది. ఒక అమ్మాయికి జన్మనిచ్చి, విరిగిన మనసుతో, శ్మశానంలోనే కన్ను మూస్తుంది. నర్గీస్ అక్క నవాబ్జీన్ (వీణా) కు విషయం తెలిసి, అక్కడకు చేరి పసిపాపను తనతో తీసుకువెళ్తుంది.
17 సంవత్సరాల తరవాత…
షాబుద్దీన్ ఒక ఉత్తరం అందుకుంటాడు. ఒక దయార్ద్రహృదయుడు అనుకోకుండా మార్కెట్లో కొన్న పుస్తకంలో ఈ ఉత్తరం ఉంటుంది. మరణశయ్య మీద ఉండగా నర్గీస్ రాసిన లేఖ అది. నర్గీస్ పుట్టుక, ఆమెకు కుమార్తె పుట్టడం అన్నీ ఆ ఉత్తరంలో ఉంటాయి. చదివిన వెంటనే షాబుద్దీన్ మనసు కలత చెంది, కోటకు వెళ్లి, తన కుమార్తె షాహిబ్‌జాన్‌ను తనకు ఇవ్వమని అడుగుతాడు. అప్పటికే ఆమె బంధువుల ఇంటికి వెళ్లిందని, మరుసటి రోజు రమ్మని చెబుతారు. ఆ రాత్రి రైలులో నిద్రిస్తున్న సమయంలో అనుకోకుండా ఒక ప్రయాణికుడు ఆ బోగీలోకి ఎక్కి, తరువాత స్టేజీ వచ్చేవరకు అందులోనే ప్రయాణిస్తాడు. అతడి పేరు సలీమ్ (రాజ్‌కుమార్). గోరింటాకుతో ఎర్రగా పండిన ఆమె అరికాలిని చూసిన పారవశ్యంలో ‘నీ పాదాలను ఎన్నడూ నేల మీద మోపకు. అవి కందిపోతాయి’ అని రంగురంగుల ఈకతో ఉత్తరం రాసి, ఆమె పాదాల వేళ్ల నడుమ ఉంచి, పక్క స్టేషన్‌లో దిగిపోతాడు. నిద్ర నుంచి మేల్కొన్న షాహిబ్‌జాన్ ఆ ఉత్తరం చదివి ఆనంద తరంగాలలో తేలిపోతుంది. దానిని భద్రంగా పదిలపరచుకుని, పదేపదే చదువుకుని పరవశం పొందుతూ ఉంటుంది.
వేశ్యగా …
ఆమె కూడా అచ్చు తల్లిలాగే ఉంటుంది. ఒక్కటే తేడా, నల్లటి జుట్టు, నల్లటి కనుపాపలు. అందమైన భవంతిని షాహిబ్‌జాన్ కోసం కొంటుంది నవాబ్‌జాన్. నవాబుల విలాసం కోసం ఆమె నాట్యం చేస్తుంటుంది. అక్కడకు వస్తున్న వారిలో ఈ నవాబు సంపన్నుడని తెలుసుకున్న గౌహర్‌జాన్… అతడితో షాహిబ్‌జాన్‌ను పంపుతుంది. నవాబ్‌తో పడవలో ప్రయాణిస్తుండగా, ఆమె మనసు కలత చెందుతుంది. ఆమె అదృష్టం కొద్దీ ఏనుగుల దాడిలో ఆ నవాబు మరణిస్తాడు. షాహిబ్‌జాన్ ఆ అరణ్యంలో ఒక గుడారంలోకి చేరుకుంటుంది. అక్కడ ఒక డైరీ కనిపిస్తుంది. యజమాని లేకపోవడంతో ఆ డైరీ చదువుతుంది. ఆ చేతిరాత తనకు పరిచితమైనదిగా అర్థం చేసుకుంటుంది. తన పాదంలో ఉత్తరం ఉంచిన చేతిరాత అదేనని గ్రహిస్తుంది. రాత్రికి గుడారానికి చేరుకున్న సలీం, అనుకోని అతిథిని చూసి ఆశ్చర్యపోతాడు. సలీమ్‌ను చూసి, సిగ్గుపడుతుంది షాహిబ్‌జాన్. అతని సాహచర్యంలో వేశ్యావృత్తి విడిచిపెట్టి, అందమైన జీవితం గడపవచ్చని ఆనందిస్తుంది. వారిద్దరి మధ్య అనురాగం ఆనందభైరవి రాగం తీస్తుంది. జీవితం ఎల్లకాలం ఒకేలా ఉండదు. మనుషుల జీవితాలతో విధి వింత నాటకం ఆడుతూనే ఉంటుంది….
ఆ తరవాత కథ చూడవలసిందే…
పాకీజా కథను మీనాకుమారి ఒకనాటి భర్త అయిన కమల్ అమ్రోహి రచించి, దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ విడిపోయారు. కథ పక్కా ముస్లిం నేపథ్యం కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. డ్రెస్సులు, మహల్స్, ఆచార వ్యవహారాలు… అన్నీ. ఘజల్స్ నుంచి షరారాల వరకు పాటల విషయంలో శ్రద్ధ వహించారు. వేశ్యలను ఎంతో గౌరవంగా చూపించారు. తనకు ఇష్టం లేని జీవితం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ మానసిక సంఘర్షణకు గురికావడం ఆమె పాత్రలో నిండుదనాన్ని చూపుతుంది. చివరకు తన ప్రేమను దక్కించుకోలేక పోతుంది.
ఎక్కడా వంక పెట్టడానికి వీలు లేకుండా తీశారు అమ్రోహి ఈ చిత్రాన్ని. విశ్రాంతి తరవాత జరిగే కథలో మెలోడ్రమా ఉంటుంది. మొదటి భాగమంతా ప్రశాంతంగా సాగుతుంది. ఈ చిత్రాన్ని షూటింగ్ చేయడానికి 14 సంవత్సరాల కాలం పట్టింది. నటుల వయసు కూడా పెరిగిపోసాగింది. ఈ సినిమా ప్రారంభమయ్యేనాటికి మీనాకుమారి వయసు 17. మరి 27 సంవత్సరాలు వచ్చేనాటికి ఆవిడలో అదే అందాన్ని చూపడం కష్టమే. వయసును దాచడం కష్టమే అయ్యింది. ముఖ్యంగా మీనాకుమారి తాగుడికి బానిస కావడంతో ఆమె ముఖం బాగా మారిపోయింది. నాలుగు పదులు నిండకుండానే కన్నుమూసిన మీనాకుమారి, రెండో భాగంలో నటించడానికి చాలా కష్టపడ్డారు. ఒక్కోచోట అలసట ఆమె ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
సమాధానం లేని ప్రశ్నలు…
తనను వివాహం చేసుకోవడానికి తిరస్కరించిన సలీమ్ వివాహంలో నవాబ్‌జాన్ ఎందుకు నాట్యం చేస్తుంది, వారి గతాన్ని ఎందుకు గుర్తు చేసుకుటుంది. షాహిబ్‌జాన్‌ను షాబుద్దీన్ నుంచి ఎందుకు దూరంగా ఉంచారు… వంటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. కాని పాకీజాను గొప్ప చిత్రంగా చెప్పడానికి బోలెడన్ని అంశాలు ఉన్నాయి.
పాటలు…
మౌసమ్ హై ఆషిఖానా పాటలో డేవిడ్ వెమన్ ‘లిడిల్ గిటార్’ వాయించారు. చాలా అందమైన సంగీతం సమకూర్చారు. బహుశ ఈ సంగీతాన్ని వేరెవ్వరూ అధిగమించలేరేమో అన్నారు అప్పట్లోనే విమర్శకులు. కైఫీ అజ్మీ, మజ్రూసుల్తాన్‌పురీ, కూఫ్ భోపాలీ వంటి రచయితలు రాసిన పాటలకు గులామ్ మొహమ్మద్ సంగీతం సమకూర్చారు. తారే రహియో, యూహి కోయీ మిల్ గయా థా, మౌసమ్ హై అషిఖానా, ఇన్హీ లోగోమే లే లేనా దుపట్టా మేరా, చలో దిల్‌దార్ చలో, ఆజ్ హమ్ అప్నీ దువాఓంకా … ఒకటేమిటి అన్నీ అమృత ధారలే.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్…
గులామ్ మొహమ్మద్ మరణంతో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ భాగం నౌషాద్ సమకూర్చారు. ఇందులో పాటలన్నీ తుమ్రీలను పోలి ఉంటాయి. హవేలీలోని స్త్రీలంతా నాట్య సాధన చేయడం, బజార్‌లో సీన్లు… అన్ని చోట్లా మ్యూజిక్ అద్భుతంగా సమకూర్చారు.
ప్రతీకాత్మకత…
ఇందులో చాలా సీన్లను సింబాలిక్ చూపారు దర్శకులు. షాహిబ్‌జాన్‌కి అందమైన పంజరాన్ని, అందులో ఒక పక్షిని బంధించి బహూకరిస్తాడు నవాబ్. ఒక తివాచీని కూడా బహూకరిస్తాడు. దాని మీదే ఆమె నాట్యం చేస్తుండాలని అంతరార్థం. అతడికి ఆమె ఒక విలాస వస్తువు మాత్రమే. పంజరంలో బంధించబడిన పక్షి, ఎర్రటి తివాసీ మీద నాట్యం చేసే అమ్మాయి… వీరికి వ్యక్తిగత జీవితాలు ఉండవు. సలీమా, షాహిబ్‌జాన్ మధ్య మొదటి పరిచయం రైలులో ఏర్పడుతుంది. రైలు పరిచయాలు పరిచయాలుగానే మిగిలిపోతాయి. వీరిదీ అంతే.
సంభాషణలు
హృదయాలను ఒక్కసారి కుదిపేసే సంభాషణలు రచించారు కమల్ అమ్రోహి. ముస్లిం సంభాషణలు ఎక్కువ కాబట్టి, పర్షియా పదాలు ఎక్కువగా ఉంటాయి. ‘‘ఆప్‌కే పావ్ దేఖే. బహూత్ హసీన్ హై, ఇన్‌హే జమీన్ పర్ మత్ ఉతరియేగా. మైలే హోజాయేంగే. (నీ పాదాలు చూశాను. చాలా అందంగా ఉన్నాయి. వాటిని నేల మీద మోపకు. మైలపడిపోతాయి). ఈ సంభాషణ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా చేసింది. పాకీజా చిత్రంలో మంచి సంభాషణలతో పాటు నిశ్శబ్దం కూడా మరపురానిదిగా నిలిచిపోయింది. యాక్షన్, భావాలను మౌనం ద్వారానే అందచేశారు.
పురుష పాత్రలు…
రాజ్‌కుమార్ నటన పతాక స్థాయిలో ఉంది. అశోక్‌కుమార్, కమల్ కపూర్, డి. కె. సప్రు అందరూ వారివారి పాత్రలలో జీవించినప్పటికీ ఇది పూర్తిగా మహిళ చిత్రమే. షాహిబాజాన్‌గా నటించిన మీనాకుమారి మీదే కథ నడుస్తుంది. ఆమె నుంచి చూపును మరలించుకోలేకపోతారు ప్రేక్షకులు. మీనాకుమారి నటనతో ఇంచుమించు సమానంగా నటించారు గౌహర్‌జాన్ పాత్రలో నదీరా.
కాస్ట్యూమ్స్…
షాహిబ్‌జాన్ పాత్రకు మీనాకుమారి స్వయంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకున్నారు. రంగులు, జరీ ఎంబ్రాయిడరీ, ఒంటికి సరిగ్గా అతికినట్టుగా ఉండే కుర్తాలు… అన్నీ ఎంతో అందంగా తయారుచేసుకున్నారు. ఎక్కడా గాడీగా అనిపించదు. తెల్లని చురీదార్లు, సింపుల్‌గా ఉండే స్ట్రయిట్ కుర్తాలు ధరించారు. వాటి వల్ల అదనంగా ఆభరణాలు ధరించవలసిన అవసరం రాలేదు.
సినిమాటోగ్రఫీ…
జర్మనీలో పుట్టిన జోసెఫ్ విర్షింగ్ సినిమటోగ్రఫీ ఈ చిత్రానికి ఆత్మలాంటిది. ఒక్కో ఫ్రేమును అందమైన చిత్తరువులా తీర్చిదిద్దారు. పాకీజా షూటింగ్ జరుపుకుంటున్న రోజుల్లోనే 1967లో ఆయన కన్నుమూశారు. ఆ మధ్యకాలంలోనే అమ్రోహి, విర్షింగ్‌లు కలిసి అపురూపమైన దృశ్యాలను రూపొందించారు. సాహిబ్‌జాన్ వస్త్రాలు గాలికి రెపరెపలాడటాన్ని ఎంతో అందంగా చూపారు. ఆ వస్త్రాలను ఆకాశం ధరించిందా అన్నట్లుగా చూపారు దర్శకులు. (వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)