(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
జాతీయ పత్రికా దినోత్సవాన నేను స్మరించుకోవాల్సిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం గారు… జర్నలిజంలో ఓనమాలు నేర్పి కుదురుకునేలా చేసిన మహానుభావుడు. రెండోవారు రామోజీరావుగారు. ఈనాడులో ఉద్యోగమిచ్చి, నేను చేసిన తప్పుల్ని మన్నిస్తూ నేనీ స్థితికి ఎదగడానికి కారకుడైన మీడియా మొఘల్. నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ఈనాడులో రామోజీరావుగారు నన్ను ఇంటర్వ్యూచేసిన తీరును గుర్తు చేసుకోవడం సబబు. నా అనుభవం ఇదిగో… రామోజీరావుగారికి శతకోటి నమస్కారాలు. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. నేషనల్ ప్రెస్‌డే రోజునే ఆయన జన్మదినం కావడం విశేషం.
ఆ గదిలో ముగ్గురు
కుర్చీలో కూర్చుని ఉన్నవారిని పరికించి చూశా. ఈనాడు చీఫ్ ఎడిటర్ (అప్పుడు ఆయన పోస్టు అదే) రామోజీరావుగారు, మోటూరి వెంకటేశ్వరరావుగారు(న్యూస్‌టుడే డైరెక్టర్), జి. రమేష్‌బాబు(న్యూస్‌టుడే మేనేజింగ్ డైరెక్టర్), మరొకరు ఉన్నారు. నేను రాసిన సమాధాన పత్రాన్ని రామోజీరావుగారు నిశితంగా చూస్తున్నారు. నాలుగు పేజీలు తిప్పిన తరవాత నాకేసి చూసి, ఓ చిరునవ్వు నవ్వి.. నువ్వు పత్రికలు బాగా చదువుతావనుకుంటాను… అన్నారు. అంత ఏసీలోనూ ఒళ్ళు చెమటలు పట్టింది. ఆయన ప్రశ్నించడానికి సిద్ధమైపోతున్నారన్నమాట అనుకున్నాను. ఓ ప్రశ్న తూటాలా దూసుకొచ్చింది.
‘నీకు పెళ్ళయ్యిందా?’
లేదండి
‘ఎందుకుకాలేదు’
(అప్పటికి నా వయసు ఇరవై ఆరు). స్థిరమైన ఉద్యోగం లేదు కదండి.. అయినా నాకింత వరకూ ఆ ఆలోచన కూడా లేదండి.
‘ఉద్యోగం ఇస్తే చేసుకుంటావా?’
మౌనంగా ఉండిపోయా…
నాలోని కంగారును గ్రహించి ఆయన ఈ ప్రశ్నలు వేశారని నాకు తరవాత అర్థమైంది. నేను తేలికగా ఊపిరి పీల్చుకోవడం గమనించి ఆయన మరో ప్రశ్న వేశారు.
మీ కుటుంబ సభ్యులెంత మంది?
నేను కాక అయిదుగురం
నీ జీతం వారికి అవసరమా!
నాకు తెలిసుండి మా నాన్నగారు ఎప్పుడు ఎవరి దగ్గరా సాయం పొందలేదు.
సిటిఆర్‌ఐ(రాజమండ్రి)లో పనిచేస్తూ మా చిన్నాన్న గారిని కూడా చదివించారు.
ఆయన నా జీతం ఆశిస్తారని అనుకోవడం లేదు…
మరోసారి చిరునవ్వు నవ్వి.. మీరేమైనా అడుగుతారా అన్నట్లు మిగిలిన వారివైపు చూశారు.
అవసరం లేదన్నట్లు వాళ్ళో చూపు చూశారు నాకేసి..
సరే సుబ్రహ్మణ్యం వెళ్ళు.. ఆప్యాయతతో కూడిన ఆదేశం రామోజీరావుగారి దగ్గరనుంచి.
ఆయనకు రెండుచేతులతో నమస్కరించి.. తలుపు దగ్గరకు వెళ్ళి మరోసారి ఆయనకేసి చూసి బయటకొచ్చా.
ఇక అసలు వత్తిడి.. ఆందోళన ఆరంభమయ్యాయి నాలో..
ఏమిటిది.. ఏమీ అడగలేదు… సాధారణ ప్రశ్నలతో సరిపుచ్చారు.
ఎంపికచేసుకోలేదా…
ఇలా అనేక అనుమానాలు కందిరీగ మోతలా నా మనసులో గొణుగుతున్నాయి.
కిందకి దిగిన వెంటనే టైము చూశా. సరిగ్గా పది నిముషాలు నేనా గదిలో ఉన్నది.
మిగిలిన వారంతా గంటకి తక్కువ లేరు. (ఈనాడులో నేను 25-05-1989లో చేరాను. 12-08-2012లో బయటకు వచ్చాను.)
రామోజీరావుగారు నన్నెలా ఇంటర్వ్యూ చేశారంటే..
Date: