విజ్ఞాన ఖని – సిరివెన్నెల సీతా రామశాస్త్రి జయంతి
(మహాదేవ్, 9490646306 )
ఆయన పాటలు – చల్లని ‘వెన్నెల’ హిమం తో పాటు ధైర్యపు ‘సిరు’లు ఒసిగినట్టు అనిపిస్తాయి.
ఆయన పాటలు – సాక్షాత్ ఆ ‘సీతారాముడు’ ధనుష్పాణియై భయాందోళనలు అనే రాక్షసులపై బాణ పరంపర కురిపిస్తున్నట్టు అగుపిస్తాయి.
ఆయన పాటలు – పడక గదిలో కొత్త పెళ్ళి కూతురి బుగ్గపై సిగ్గు లా మెరుస్తాయి, కష్టాలలో ఉన్న నిరుద్యోగి కి ఓదార్పు గా నిలుస్తాయి.
అతని పేరు –
తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు,
అక్షరానికి పరిచయం చెయ్యక్కర్లేని పేరు,
దాదాపు 40 సంవత్సరాలు స్వయానా తెలుగు సాహిత్యమే, తన నెత్తిన పెట్టుకొని ఆరాధనగా ఊరేగించిన సాహితీ చక్రవర్తి.,
కవిత్వమనే మాతృమూర్తి చంకనెక్కి, వేల వేల ఆటలాడిన కవి పుంగవుడు – మనందరి సీతారాముడు.
(అసలు పేరు – చేంబోలు సీతారామ శాస్త్రి గారు,
‘శాస్త్రి’ అంటే శాస్త్రజ్ఞుడు. ఆయన ఈ బిరుదును జన్మతః, కర్మతః రెండూ సార్థకం చేసుకున్నాడు.)
అక్షర జ్ఞానం సరస్వతీ దేవి ప్రసాదిస్తే,
అక్షరాలని అలంకరించి పదాలుగా,పాటలుగా మార్చగలగడం అనేది ఒక అద్భుత కళ – అది నిజంగా లలితా దేవి కృప.
అలా రాయగలిగే నేర్పరులని కేవలం అక్షరాస్యులు అనకూడదు,అక్ష ‘రాజులు’ అనాలి అని నా ఆలోచన.
అలాంటి అక్ష రాజు తెలుగు సాహిత్యంలో నిజంగా ఒకే ఒక్కరు శ్రీ సీతారామశాస్త్రి.

కవిత్వం అంటే మాటల్లో చెప్పలేని భావాన్ని, లేదా వెయ్యి మాటల్లో చెప్పాల్సిన భావాన్ని,
అతి తక్కువ పదాల్లో కుదించి, స్వరానికి తగినట్లుగా, అంతకు మించిన భావగంభీరతతో అందించగల నైపుణ్యం.
అది కేవలం కళ కాదు – అది ఒక తపస్సు.
ఆ తపస్సు ని కొన్ని తరాల తర్వాత కూడా గుర్తించేలా, గుర్తుపెట్టుకునేలా చేసిన వ్యక్తి ఆయన.
శాస్త్రిగారు సినిమాకోసం పాటలు వ్రాయరు.
ఆయన కథను గ్రహిస్తారు, పాత్రను నెమరేస్తారు, ప్రేక్షకుడి నాడి పట్టుకుని, అతడి హృదయం నుంచి ఆలోచించి పదాలు రాస్తారు.
ఆ పదాలు, ఆయన కలంలోంచి కవిత్వంగా వెలసి, ప్రేక్షకుని హృదయంలో చెరగని చిరునామాలుగా మిగిలిపోతాయి.

ఆయన ముందు ఎందరో కవులు ఉన్నారు, ఆయన తర్వాత ఎందరో వస్తారు.
కానీ ఆయన స్థానం చిరస్థాయిగా నిలుస్తుంది.
ఎందుకంటే –
ఆయన ప్రతి పాటలో సాహిత్యం తో పాటు తాత్వికత కూడా ఉంది.
ఆయన కేవలం సాహితీవేత్త కాదు – తాత్వికవేత్త కూడా.
అందుకే ఆయన్ని తెలుగు కవుల జాబితా లొనే కాదు,
యోగి వేమన, విశ్వనాథ సత్యనారాయణ, జిడ్డు కృష్ణమూర్తి వంటి గొప్ప తాత్వికవేత్తల జాబితాలో నిస్సందేహంగా చేర్చచ్చు.

(వ్యాస రచయిత సినిమా నటుడు)