లండన్, ఆగస్టు 22: హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు లండన్ యూనివర్సిటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి తెలిపారు.
ఈ మేరకు లండన్ యూనివర్సిటీ సెనేట్ హౌస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం అయింది.

లండన్ యూనివర్సిటీలోని సెనేట్ హౌస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ అధికారులు కే. రామకృష్ణారావు, జయేశ్ రంజన్ పాల్గొన్నారు. లండన్ యూనివర్సిటీ ప్రతినిధులతో వారు సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

ఈ భేటీలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్‌ఎస్‌ఈ), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (ఎస్‌ఓఏఎస్)కు చెందిన ప్రతినిధి బృందాలు, ఇతర ప్రతినిధులు కూడా ఉన్నారు.
హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు లండన్ యూనివర్సిటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు.

యూనివర్సిటీకి చెందిన వివిధ స్కూళ్లు, విభాగాల ద్వారా విస్తృత స్థాయిలో విద్యా కోర్సులు, వివిధ విద్యా కార్యక్రమాలను అందించేలా ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వివరించారు.

లండన్ యూనివర్సిటీకి చెందిన వివిధ విద్యా విభాగాలను ఒకే అకడమిక్ ఫెడరేషన్‌గా అనుసంధానించే విధంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

