నవరస నటనా సార్వభౌమం
విలనిజంలో ప్రత్యేక మార్కు
పాత్రలలో పరకాయ ప్రవేశం
(వాడపల్లి శ్రీధర్, హైదరాబాద్)
అభివందనం అందుకున్న యమ రాజాగ్రణీ, నవరసాలు సరసాలు చవిచూపించిన నట నటనా చూడామణీ, స్పురద్రూపి నవ మన్మథాకారుడు కళకు ఆంకితమైన కింకరుడు. ప్రేక్షక హృదయ సామ్రాజ్యమేలే సార్వభౌముడు. స్నేహమేరా జీవితం అన్న స్నేహశీలి. ఆంగీక వాచక అభినయంతో ఘటనాఘటన సమర్దుడు ఈ ఘటోత్కచుడు.
ఏడు వందల పైచిలుకు సినిమాల్లో నటించిన అభినయ కౌశలం (777) ఐదు తరాల హీరోలతో సినిమాలు చేసిన నట శిఖరం ఆరు పదుల సినిమా ప్రయాణం నాయకుడిగా, ప్రతినాయకుడిగా, నటుడిగా, హాస్యనటుడిగా కైకాల చేయని క్యారెక్టర్ లేదు. జానపదమైనా… పౌరాణికమైనా, చారిత్రాత్మకమైనా.,సాంఘీక చిత్రమైనా… కైకాల పరకాయ ప్రవేశం చెయ్యని పాత్ర లేదు. టచ్ చేయని జానర్ లేదు. ఆయన మెప్పించని సినిమా లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ స్టార్ట్ స్టేటస్ సొంతం చేసుకున్న ఘనత ఆయనది. కైకాల ఆయన ఓ నటనా పాఠశాల. 60 ఏళ్ల సినీజీవితంలో కైకాల సత్యనారాయణ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు… పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా కైకాల చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన్ని నటుడిగా శిఖరాగ్రానికి చేర్చాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన నటుడు కైకాల. ఎన్టీఆర్ ‘యమగోల’ సినిమాలో కైకాల పోషించిన యమధర్మరాజు పాత్ర ఆయనకు మరింత ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. యముడు అంటే కైకాల సత్యనారాయణే అనేలా చేసింది. ఆ తరవాత ‘యమలీల’ సినిమాలోనూ కామెడీ యముడిగా కైకాల ప్రేక్షకులను అలరించి మెప్పించారు.
తెలుగునాట మనకు కనిపించే నటసార్వభౌములు ముగ్గురే – వారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి. రామారావు, నటసార్వభౌమ యస్.వి. రంగారావు, నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ. తెలుగు చిత్రసీమలో అలరించిన అరుదైన నటులలో నిస్సందేహంగా కైకాల సత్యనారాయణ పేరు చెరిగిపోని, తరిగిపోని చరిత్రను సొంతంచేసుకుంది అనడం అతిశయోక్తి కాదు. ప్రతినాయకునిగా సత్యనారాయణ జడిపించారు. గుణ చిత్ర నటునిగా మురిపించారు. హాస్యంతో అలరించారు. కరుణంతో కట్టిపడేశారు. ఒక్కటేమిటి నవరసాలనూ సత్యనారాయణ అలవోకగా పండించారు.
కౌతవరంలో జననం
కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణాజిల్లా కౌతవరంలో జన్మించారు. గుడ్లవల్లేరులో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన సత్యనారాయణ. విజయవాడలో ఇంటర్మీడియట్, గుడివాడ కాలేజీలో పట్టా పుచ్చుకున్నారు.
అంతరంగాన్ని ఆవిష్కరించిన నాటక రంగం
చదువుకొనే రోజుల్లోనే నాటకాలు వేస్తూ సాగారు. కొన్ని నాటకాల్లో స్త్రీ వేషాలూ వేసి ఆకట్టుకున్నారు. మిత్రులు ఆయనను అచ్చు యన్టీఆర్ లా ఉన్నావ్ అనేవారు. అదే ఆయనలో ఆత్మవిశ్వాసం పెంచింది. ఓ సారి సత్యనారాయణ వేసిన నాటకాన్ని చూసిన కొందరు సినిమా జనం ప్రముఖ నిర్మాత డి. ఎల్. నారాయణకు అతను యన్టీఆర్ పోలికలతో ఉన్నారని చెప్పారు. డి. యల్. నారాయణ తాను తీస్తోన్న సిపాయి కూతురులో జమున సరసన నాయకునిగా సత్యనారాయణను ఎంచుకున్నారు. కొత్త హీరో, అందునా జమున వంటి సీనియర్ సరసన ఏమి బాగుంటుందని ఫైనాన్సియర్స్ పెదవి విరిచారు. డి. యల్. మాత్రం జంకకుండా సత్యనారాయణనే ఎంచుకున్నారు. మొత్తానికి తొలి చిత్రం ‘సిపాయి కూతురు’లోనే జమున సరసన నటించే అవకాశం దక్కింది.
ఆ చిత్రం పరాజయం పాలవ్వడంతో సత్యనారాయణకు మరి వేషాలు దక్కలేదు. ఆ సమయంలో బి.విఠలాచార్య సత్యనారాయణను ప్రోత్సహించారు. తాను తెరకెక్కించిన ‘కనకదుర్గ పూజా మహిమ’లో సత్యనారాయణకు కీలక పాత్రను ఇచ్చారు. అదే సమయంలో యన్టీఆర్ కు సన్నిహితుడైన యస్. డి. లాల్ దర్శకునిగా తొలి ప్రయత్నంలో ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ తెరకెక్కిస్తూ అందులో రాజకుమారుని పాత్రను సత్యనారాయణకు ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు సత్యనారాయణకు నటునిగా మంచి మార్కులు సంపాదించిపెట్టాయి. ఇక యన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు – భీముడు’లో యన్టీఆర్ కు బాడీ డబుల్గా సత్యనారాయణ నటించారు. ఆ సినిమా విడుదలయి, ఘనవిజయం సాధించడంతో యన్టీఆర్ బాడీ డబుల్ గా నటించిన సత్యనారాయణకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత యన్టీఆర్ అనేక చిత్రాలలో సత్యనారాయణ కీలక పాత్రలు పోషిస్తూ సాగారు.
నటునిగా మలుపు తిప్పిన చిత్రం
‘ఉమ్మడి కుటుంబం’తోనే లభించింది. అందులో యన్టీఆర్ కు రెండో అన్నగా సత్యనారాయణ నటించారు. కరుణరస ప్రధానమైన ఆ పాత్రతో నటునిగా సత్యనారాయణకు మంచి ఆభినయాన్ని ప్రదర్శించి విమర్శకుల మన్నన పొందారు.
చాలా చిత్రాలలోవిలన్ పాత్రలే
సత్యనారాయణ విలన్ పాత్రలే ధరించారు. అప్పటి దాకా రాజనాల, నాగభూషణం వంటివారు ప్రతినాయకులుగా రాణించారు. యన్టీఆర్ హీరోగా కె. విశ్వనాథ్ తెరకెక్కించిన నిండు హృదయాలులో సత్యనారాయణ ప్రధాన ప్రతినాయకుడు. ఆ సినిమా విజయంతో ఇతర హీరోలు సైతం సత్యనారాయణనే తమ చిత్రాలలో విలన్ గా నటించాలని కోరారు. అలా ఒక్క యేడాదిలోనే సత్యనారాయణ స్టార్ యాక్టర్ అయిపోయారు. యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలోనే కాదు అప్పట్లో వర్ధమాన కథానాయకులుగా రాణిస్తున్న శోభన్ బాబు, కృష్ణ చిత్రాలలోనూ ఆయనే విలన్ గా నటించి మెప్పించేవారు. కె.విశ్వనాథ్ రూపొందించిన శారద చిత్రంలో నాయిక అన్న పాత్రలో సత్యనారాయణ కరుణ రసం కురిపించారు. ఆ సినిమా కూడా జనాన్ని విశేషంగా అలరించింది. దాంతో సత్యనారాయణ కేవలం జడిపించే పాత్రలే కాదు, కన్నీరు పెట్టించే పాత్రల్లోనూ మెప్పించగలరని నిరూపించుకున్నారు.
►ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కైకాల ప్రయాణం
►కైకాల సత్య నారాయణ నటించిన మొదటి చిత్రం : సిపాయి కూతురు
► చివరి చిత్రం : మహర్షి
►9 చారిత్రక 28 పౌరాణిక, 51 జానపద చిత్రాల్లో నటిం చిన కైకాల
► కైకాల సత్య నారాయణ 200 మందికి పైగా దర్శకులతో పనిచేశారు.
►100 రోజులు ఆడిన కైకాల నటించిన 223 చిత్రాలు.
►59 సినిమాలు అర్ధ శత దినోత్స వాలు జరుపుకున్నాయి
►10 చిత్రాలు సంవత్స కాలం ప్రదర్శితమయ్యాయి.
► తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి సహస్ర శిరచ్ఛే ద అపూర్వ చిం తామణి చిత్రం లో నటించిన కైకాల
► తొలి ప్రతినాయకుడి వేషం విఠలాచార్య దర్శకత్వం లో
► తొలిసారి ప్రతినాయకుడి పాత్ర పోషిం చిన కైకాల చిత్రం కనకదుర్గపూజ మహిమ
►ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో నటించిన కైకాల సత్య నారాయణ
►సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లోనటిం చిన కైకాల
►రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సం స్థను స్థాపిం చిన కైకాల సత్య నారాయణ
►కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించిన కైకాల
►1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కా రం
►2011లో రఘుపతి వెంకయ్య పురస్కా రం అందుకున్న కైకాల
► 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్య నారాయణ
►తెలుగుదేశం పార్టీ అభ్య ర్థిగా మచిలీపట్నం నుం చి లోక్ సభకు కైకాల ఎన్ని క
►తొలి రోజుల్లో ”రాముడు-భీముడు’ వం టి ఎన్.టి.ఆర్. ద్వి పాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటిం చారు
ఫిల్మ్ ఫేర్ అవార్డులు
►జీవితకాల సాఫల్య పురస్కా రం (2017)
నంది అవార్డులు
►ఉత్తమ చలన చిత్రం – బంగారు కుటుంబం (1994)
►రఘుపతి వెంకయ్య అవార్డు – 2011
►ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అవార్డు
టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు
టీడీపీ వ్యవస్థాపక సభ్యుడిలో కైకాల సత్యనారాయణ కూడా ఒకరు. టీడీపీలో ఉన్నప్పటికీ చాలా కాలం వరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 1996లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.
సినిమాల్లో ప్రత్యేకమైన బాణీ కైకాల
పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో సత్యనారాయణ తనదైన బాణీ పలికించారు. యన్టీఆర్, యస్వీఆర్ వంటి మహానటులు ధరించిన యమధర్మరాజు, రావణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలను పోషించి మెప్పించారు సత్యనారాయణ. మూడు తరాల హీరోల చిత్రాలలో ప్రతినాయక పాత్రలు పోషించి అలరించారాయన. నిర్మాతగానూ కొన్ని చిత్రాలు నిర్మించి ఆకట్టుకున్నారు. సత్యనారాయణ తెలుగు చిత్రసీమకు చేసిన సేవలకు గాను 2011లో ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. నువ్వెళ్ళిపోయావనే నిజం..అంతరించిపోయింది ఓ వెలుగు వెలిగిపోయిన విలనిజం. గొప్ప నటనకు నెలవు ఆలసి పోయి తీసుకున్న సెలవు.