దక్షిణాదిలో ప్రతిపక్షాల ఐక్యతకు యత్నం
తొలి దశగా తమిళనాడు సీఎంతో భేటీ
కుటుంబ సమేతంగా శ్రీరంగానికి…అక్కడి నుంచి స్టాలిన్ ఇంటికి
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొత్త దారిని ఎంచుకున్నారు. ఉత్తరాది నాయకులపై కాకుండా ప్రస్తుతం దక్షిణాది నాయకులపై దృష్టిపెట్టారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే వ్యూహం ఆయన అడుగులలో ద్యోతకమవుతోంది. 2018 ఎన్నికలలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ నుంచి శరద్ పవార్ దాకా ఆయన అనేకమంది హేమాహేమీలను కలిసి చర్చించారు. అప్పటి రాజకీయ సమీకరణాలు..పరిణామాల క్రమంలో కేసీఆర్ యత్నం సఫలం కాలేదు. సాధారణద ఎన్నికలు మరో రెండేళ్ళలో జరగనున్న తరుణంలో మళ్ళీ కేసీఆర్ అలాంటి ప్రయత్నాలే ప్రారంభించారు. ఇప్పుడు దక్షిణాది ఆయన కార్యస్థానంగా నిలిచింది. కర్ణాటక విడిచిపెడితే మిగిలిన రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలే అధికారంలో ఉన్నాయి. ముందు ఇక్కడ ఐక్యత సాధించి, ఒక నేతగా ఎదిగి తన సత్తా చాటాలనేది తన వ్యూహంగా కనిపిస్తోంది.
రైతు ప్రయోజనాలే బాసటగా…
దేశంలో ఏ రాజకీయనాయకుడికైనా రైతుల ప్రయోజనాలే ఆలంబన. ఆ విషయాన్ని ప్రధాని మోడీ ఏడాది తరవాత తెలుసుకున్నారు. అందుకే నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. మొట్టమొదటిసారి ఒక ప్రధాన మంత్రి జాతికి క్షమాపణ చెప్పారు. దీనికి పూర్వం తెలంగాణ సీఎం కేసీఆర్ మోగించిన సమర శంఖం కూడా కలిసి వచ్చింది. ఎప్పుడైతే కేసీఆర్ ఉద్యమ పథాన్ని ఎంచుకున్నారో…. అది కేంద్రంలో ప్రకంపనలు పుట్టించింది. ఉత్తరాదిన రైతుల ఉద్యమంతో సతమతమవుతున్న కేంద్రం దక్షిణాదిన కూడా ఆ పరిస్థితి తెచ్చుకోలదలచుకోలేదు. అందుకే ముందుగా వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది. కానీ, తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై వెనకడుగు మాత్రం వేయలేదు. అంటే సమస్యను పచ్చిగానే ఉంచిందన్న మాట. అంటే కేంద్రంతో కేసీఆర్‌కు ఘర్షణ కొనసాగుతుందనేది సుస్పష్టం.
కాంగ్రెస్ లేని ఫ్రంట్ సాధ్యమా
వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రతిపక్షాలన్నీ కేంద్రానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. వాటికి రైతుల ఆందోళన ప్రధాన ఆయుధం కాబోతుందన్న తరుణంలో కేంద్రం దానిని ఉపసంహరించుకోవడం అశనిపాతమే. అయినా ముందు ఒక్కటవ్వాలనే ఆలోచన ప్రతిపక్షాలలో మెదిలింది. కానీ కాంగ్రెస్‌ను కలుపుకోవాలనే ఊహ వాటిలో రావడం లేదు. కాంగ్రెస్‌ను కలుపుకుంటే తప్ప ఏ ఫ్రంటూ దేశంలో మనజాలదు. అది అనేక సందర్భాలలో అది నిరూపితమైంది కూడా. ఈసారి అలాంటి తప్పు జరగకూడదని ప్రతిపక్ష నేతలు అనుకుంటున్నట్లు తోస్తోంది. అయితే ఇదెంతవరకూ సాధ్యం? అనేది కోటి రూకల ప్రశ్న.
అందుకే కేసీఆర్ దృష్టి దక్షిణాదిపై
సరిగ్గా ఇదే ఆలోచనతో కేసీఆర్ దక్షిణాదిపై దృష్టి సారించారు. మమత బెనర్జీ చూపంతా ప్రధాని పీఠంపైనే ఉంది. ఇందుకు పోటీగా శరద్ పవార్, మాయావతి, అఖిలేశ్, ఇలా జాబితా చాంతాండంత అవుతుంది. ప్రతిపక్షాలలో అనైక్యతకు ప్రధాన కారణం ఇదే. దీనినే కాంగ్రెస్ నగదు చేసుకుంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీల సస్పెన్షన్ అంశంపై ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీకి మమతను పిలవకుండా కాంగ్రెస్ తన ఉద్దేశాన్ని సూటిగానే చెప్పింది. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకునే కేసీఆర్ కొత్త దారిని ఎంచుకున్నారని తెలుస్తోంది.
రైతు బంధు చుట్టూ రాజకీయం
కేసీఆర్ ముందు ఉన్న ప్రధాన సమస్య రైతు బంధు. రైతులకు ముందే పెట్టుబడిగా తెలంగాణ ప్రభుత్వం నగదు చెల్లిస్తోంది. దేశంలో కేసీఆరే ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తరవాతే కేంద్రంలోనూ ఇదే తరహా పథకం వచ్చింది. ఇప్పుడు ధాన్యం కొనే అవకాశం లేదని కేంద్రం స్పష్టంచేసిన క్రమంలో రైతు బంధు అమలు ఎలా అనే అంశంపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. ధాన్యం కాకుండా ఇతర పంటలు వేసిన వారికే రైతు బంధును వర్తింపజేయాలన్న అధికారుల సూచనను కేసీఆర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. మధ్యే మార్గంగా ఏం చేయాలనే అంశంపై కసరత్తు సాగుతోంది. రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలను గమనిస్తూనే కేసీఆర్ దేశ రాజకీయ యవనికపై కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమంలో ఆయన వైఖరి చూసిన ఎవరికైనా ఆయన పట్టుదల కనిపిస్తుంది. అందుకే కేంద్రం సాధ్యమైనంతగా ఆయనను ఇతరత్రా ఇబ్బంది పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ఇబ్బంది పెడుతుంది. ఈ విషయం తెలుసుకునే కేసీఆర్ నూతన మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.