– డా. పురాణపండ వైజయంతి (ఉషశ్రీ మూడవ కుమార్తె)
ఇది ఉషశ్రీ మార్గము
ఇటువంటి మార్గమొకటి యుండునా
యుండునేమో
యుండకపోయినచో ఎట్లందురు
ఒకరు ఏర్పరచిన దానిని.. వారి మార్గముగనే చెప్పవలయును కదా.
నిక్కముగ చెప్పనేవలయును.
చెప్పకున్న దోసమగును.
దోసము చేయుట మానవులకు తగదు కదా.
అందులకే
ఇది ఉషశ్రీ మార్గము.
ఇప్పటికి అర్థం అయి ఉంటుంది.
ఈ మాట ఎవరు అన్నారో.
అవును
ఆయనయే
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ.
ఉషశ్రీ రచించిన ‘అమృతకలశం’ పురాణ కథల సంపుటికి ముందుమాట రాస్తూ, 1961 ప్రాంతంలో ఈ మాట అన్నారు.
నానృషి కురుతే కావ్యం అన్నట్లుగానే…
ఋషి కాని వాడు భవిష్యత్తు కూడా చెప్పలేడు
విశ్వనాథ వారు మహర్షులు, బ్రహ్మర్షులు.
ఏ శుభముహూర్తాన ఈ మాటలు అన్నారో కాని
ఆనాటి బాల ఉషశ్రీ
ఆ తరువాత ప్రచండమార్తాండుడు అయ్యారు.
తన మార్గంలోనే పయనించారు.
మురారిః తృతీయ పంధాః అన్నట్లుగా
ఉషశ్రీః స్వయం పంథాః అనిపించుకున్నారు.
’ ’ ’
ఉషశ్రీ రచించిన ‘అమృత కలశం’ అనే పుస్తకానికి ముందుమాట రచించమని విశ్వనాథ వారిని కోరగా, తన ఆశీస్సులు పంపారు.
అదే ఇది –
ఆశీస్సు
‘‘ఉషశ్రీ రచించిన ‘అమృత కలశం’ అన్న నాలుగు పురాణ కథల సంపుటం చూచాను. కథలు పురాణ కథలు. రచన వ్యావహారికం. వ్యావహారికమనటం కంటే శిష్ట వ్యావహారిక మనటం మంచిది. పలుచోట్ల పెద్దపెద్ద సమాసాలున్నవి. కాని రచన గంభీరంగా నున్నది. అనుశ్రుతంగా ఒక మాధుర్య రేఖ సర్వరచన యందు ప్రవహిస్తున్నది. పురాణకథలు ఈ పద్ధతిలో వ్రాయటం, ఈ పద్ధతిలో అచ్చు వేయటం ఇదియొక క్రొత్త మార్గమని చెప్పాలి. ఉషశ్రీ ప్రసిద్ధుడే – ఈ గ్రంథము ఆయన ప్రసిద్ధికి మరీ దోహదమే చేస్తున్నది. ఆయనింక నిట్టి గ్రంథములు వ్రాసి, యీ మార్గమునకు ఉపదేష్టయగు గాక! ‘ఇది ఉషశ్రీ మార్గము’ – అన్న ప్రతిష్ఠ బడయుగాక!
(విశ్వనాథ సత్యనారాయణ, 12 – 12 – 1963)
‘శిల్పికి శిలా, చిత్రకారునికి కుడ్యమూ వలె కవికి, ఇతివృత్తం ఆధారం మాత్రమే. ఆధారం గొప్పదైనంత మాత్రాన నిర్మాణం గొప్పది కాదు. స్రష్ట ప్రతిభావంతుడైతేనే అందులో నుంచి సుందర కళాఖండం ఆవిష్కృతమవుతుంది. ఉషశ్రీ ఈ సంగతి తెలిసినవాడు. అందుకే పాతకథలు తీసుకుని క్రొత్త కథలు చేశాడు’ అని జమదగ్ని శర్మ ‘అమృత కలశం’ ముందుమాటలో అన్నారు.
(జమదగ్ని, విజయవాడ, 6 – 12. 1963)
చెప్పినదే ఆచరించుట
ఉషశ్రీ తొలిరోజులలో అనేక కథలు రచించారు. కొన్ని కథలను సంకలనం చేసి పుస్తక రూపంలో ప్రచురించారు. ‘మల్లె పందిరి’ జ్వలితజ్వాల’ అమృత కలశం’ – ఈ మూడు పుస్తకాలు కథల సంకలనాలు. ఇంకా ‘సంతప్తులు’ ‘ప్రేయసి – ప్రియంవద’ ‘తరాలు –అంతరాలు’ అనే నవలలు కూడా రచించారు. వీటికి తోడుగా ‘రాగ హృదయం, వెంకటేశ్వర కల్యాణం’ అనే రెండు యక్ష గానాలు కూడా ఉషశ్రీ కలం నుంచి వెలువడ్డాయి.
ఉషశ్రీ కథా రచన ఆరంభించిన నాటి నుంచి తుది శ్వాస వరకు తాను ఆచరించినదే తన రచనలలో చెప్పారు. కుటుంబ వ్యవస్థ – కట్టుబాట్లు, భారతీయ సంప్రదాయం, భారతరామాయణాలు, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీపురుష సమానత్వం… అన్నీ ఆచరించి, రచనలలో నిక్షిప్తం చేశారు.
‘ఉపనిషత్తుల్లో కూడా ఉన్నారుట పెళ్లి కాని పిల్లలు’ అంటారు దౌహృది అనే కథలో. ఇంకా అదే కథలో –
‘జీవితంలో భార్య అనేది దుఃఖంలో భాగం పంచుకునేందుకు కాదు, అది ఏ స్నేహితుడయినా పంచుకుంటాడు. పైగా ప్రపంచం దుఃఖానికి సానుభూతి ప్రకటించటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కొందరు ‘మొసలి కన్నీరు’ విడిచినా కొందరయినా ఆత్మతో అనుబంధం కలిగించుకుని యేడుస్తారు. అధికమైన ఆనందం కలిగినప్పుడు అందులో భాగస్థుడు కాగలిగినవాడే స్నేహితుడు. ఆ విషయంలో స్నేహితుడి కంటె మరికాస్త అనుభవించగలుగుతుంది భార్య. మొగుడూ పెళ్లాల అనుబంధం అందుకు’ అంటారు.
‘తప్పులూ, పొరపాట్లూ, చిరాకులూ, పరాకులూ ఇద్దరికీ వస్తాయి. అవి నలుగురితోనూ చెప్పుకోవడం వల్ల మనం లోకువ కావడం తప్ప ప్రయోజనం లేదు. పైగా మన మధ్య ఉండవలసిన స్నేహం ద్వేషంగా మారుతుంది’ అంటారు ‘నాతి చరామి’ కథలో.
‘భార్యాభర్తల మధ్య ఉండేది స్నేహమే కాని బంధుత్వం కాదు’ అంటారు అంతర్వత్ని కథలో
‘పుత్రగాత్ర పరిష్వంగ సుఖాన్ని నన్నయభట్టారకులు వర్ణిస్తే, ఆ అక్షరాలకు రూపాన్ని చూపించాడు నీ కొడుకు. వాడనుభవించిన వేదన ఈ గొడ్డుమోతువాడికేం అర్థమవుతుంది’ అంటారు జ్వలితజ్వాల నవలికలో.
‘చదువుకున్న ఆడది హాయిగా ఏ ఉద్యోగమో చేసుకుంటూ తన జీవిక తను నిర్విచారంగా సాగించుకోలేదా? ఇందుకోసం మరో ప్రాణి మీద ఆధారపడి, సంసారపు సాలెగూడులో చిక్కుకుని దానికి ఆ ప్రాణిని బలి చేయడమో, అందులో తాను ఆహుతి కావడమో జరగక తప్పదా? ఈ జీవితాలకి మరో పరిష్కార మార్గం లేదా’ అంటారు 1962లో రచించిన ‘ప్రేయసి – ప్రియంవద’ నవలలో.
ఇంకా
1961 – 62 మధ్యకాలంలో ముప్పై వారాల పాటు కృష్ణా పత్రికలో ప్రచురితమైన ‘పెళ్లాడే బొమ్మా!’నవలా లేఖావళిలో ఆడపిల్లలు వ్యక్తిత్వంతో స్వేచ్ఛగా జీవించమని ఒక అన్నగా వెన్నుతట్టారు. ఇందులో రామాయణ మహాభారత పాత్రలనే ఉదాహరణలుగా చూపారు.
’ ’ ’
వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే –
ఎవ్వరికీ ఎన్నడూ తలవంచని తత్త్వం.
నిర్మొహమాటంగా విమర్శించే లక్షణం.
బిరుదులకు, రాజకీయ నాయకులకు దూరంగా ఉండే సాధారణమైన జీవితం.
నిత్యం శ్వేత వస్త్ర ధారణ.
తెల్లని జుట్టు.
పెదవులపై స్వచ్ఛమైన చిరునవ్వు.
సున్నిత మనస్సు.
ఎదుటివారిలోని మంచిని స్వీకరించే నీరక్షీరన్యాయం వహించే హంస.
పరులను దూషించటం, నిందించటం తెలియని రాముని వ్యక్తిత్వం.
అన్నిటికీ దూరం..
ఎన్ని బిరుదులు ఇచ్చినా, మరెన్ని సన్మాన పత్రాలు బహూకరించినా, అవి ఇంటికి చేరేది లేదు. వ్యాసవాల్మీకులకు లేని బిరుదులు తనకు మాత్రం ఎందుకు అనటం ఉషశ్రీ మార్గం.
శృంగేరి శారదా పీఠం వారు వారి ఆస్థాన విద్వాంసునిగా ప్రకటించిన విషయం ఉషశ్రీకి తప్ప మరెవరికీ తెలియదు. ఆ విషయం విశ్వనాధ పావనిశాస్త్రి గారు మహాలక్ష్మి పబ్లికేషన్స్ వారు ముద్రించిన ఉషశ్రీ భగవద్గీత లో ముందు మాటలో వ్రాసారు. అలా తెలిసింది ఆ విషయం.
నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను విమర్శించి కనకాభిషేకం వదులుకున్న ఆత్మాభిమాని.
నిరాడంబర జీవితం, నిష్కల్మష మనస్తత్వం, ఇతరులకు సహాయపడటం ఉషశ్రీ జీవిత విధానం.
(మార్చి 16, 2024 ఉషశ్రీ 96వ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం)